YouVersion Logo
Search Icon

ప్రకటన 9

9
1అయిదవ దూత తన బూరను ఊదినప్పుడు ఆకాశం నుండి రాలి భూమి మీద పడిన ఒక నక్షత్రాన్ని నేను చూశాను. అగాధానికి వెళ్లే గొయ్యి తాళపుచెవులు ఆ నక్షత్రానికి ఇవ్వబడ్డాయి. 2అతడు ఆ అగాధాన్ని తెరిచినప్పుడు, చాలా పెద్ద కొలిమిలో నుండి పొగ వచ్చినట్లు ఆ అగాధం నుండి దట్టమైన పొగ పైకి లేచింది. అగాధం నుండి వచ్చిన ఆ పొగకు సూర్యునికి ఆకాశంలో చీకటి కమ్మింది. 3ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చాయి. వాటికి భూమిపై ఉండే తేళ్ళకు ఉన్న శక్తి ఇవ్వబడింది. 4భూమి మీద మొలిచే గడ్డికి కాని, పచ్చని మొక్కలకు కాని, చెట్లకు కాని హాని చేయకూడదు కాని ఏ మనిషి నుదుటి మీద దేవుని ముద్ర లేదో వానికే హాని చేయాలని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. 5ఆ మిడతలకు అయిదు నెలలపాటు మనుష్యులను వేధించడానికి అధికారం ఇవ్వబడింది కాని వారిని చంపడానికి అనుమతి ఇవ్వబడలేదు. అవి కుట్టినప్పుడు వారికి తేలు కుట్టినంతగా బాధ ఉంటుంది. 6ఆ రోజుల్లో మనుష్యులు మరణాన్ని వెదకుతారు కాని అది వారికి దొరకదు; వారు చావాలని కోరుకుంటారు కాని మరణం వారి నుండి పారిపోతుంది.
7ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్న గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలల మీద బంగారు కిరీటాల వంటివి ఉన్నాయి; వాటి ముఖాలు మనుష్యుల ముఖాల్లా ఉన్నాయి. 8వాటి తలవెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహపు కోరల్లా ఉన్నాయి. 9వాటి ఛాతీ ఇనుప కవచంలా ఉంది. వాటి రెక్కల ధ్వని యుద్ధానికి పరుగెత్తే అనేక గుర్రాల రథాల ధ్వనిలా ఉంది. 10వాటికి తేళ్ళ తోకల వంటి తోకలు ఉన్నాయి. అవి అయిదు నెలల వరకు తమ తోకలతో మనుష్యులకు హాని చేసే అధికారాన్ని కలిగి ఉన్నాయి. 11అగాధాన్ని పాలించే దూత వాటికి రాజుగా ఉన్నాడు. వాడి పేరు హెబ్రీ భాషలో అబద్దోను. గ్రీకు భాషలో అపొల్యోను అనగా నాశనం చేసేవాడు అని అర్థము.
12మొదటి శ్రమ గతించిపోయింది. ఇదిగో, ఇంకా రెండు శ్రమలు రానున్నాయి.
13ఆరో దూత బూర ఊదినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్న బంగారు బలిపీఠపు నాలుగు కొమ్ముల నుండి ఒక స్వరం నాకు వినిపించింది. 14ఆ స్వరం బూర ఊదిన ఆరో దేవదూతతో, “యూఫ్రటీసు అనే మహా నది దగ్గర బంధించబడి ఉన్న నలుగురు దూతలను విడిపించు” అని చెప్పడం విన్నాను. 15అయితే ఆ సంవత్సరం, ఆ నెల, ఆ రోజు, ఆ గంట కోసం సిద్ధం చేయబడిన ఆ నలుగురు దూతలు మనుష్యుల్లో మూడవ భాగాన్ని చంపడానికి విడుదల చేయబడ్డారు. 16స్వారీ చేసేవారి సైన్యం లెక్క ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇంత అని నేను విన్నాను.
17నా దర్శనంలో ఆ గుర్రాలు, వాటిపై స్వారీ చేసేవారు ఇలా ఉన్నారు; నిప్పులాంటి ఎరుపురంగు, ముదురు నీలం రంగు, గంధకం లాంటి పసుపురంగు కవచాలను వారు తమ ఛాతీ మీద ధరించి ఉండడం నేను చూశాను. ఆ గుర్రాల తలలు సింహపు తలల్లా కనిపించాయి. వాటి నోటి నుండి అగ్ని, పొగ, గంధకం బయలుదేరాయి. 18వాటి నోళ్ల నుండి వచ్చిన అగ్ని, పొగ, గంధకాల వలన మూడు తెగుళ్ళు మనుష్యుల్లో మూడవ భాగం చంపేశాయి. 19ఆ గుర్రాల శక్తి వాటి నోటిలో వాటి తోకలలో ఉంది. వాటి తోకలు పాముల్లా తలలు కలిగి మనుష్యులను గాయపర్చేవిగా ఉన్నాయి.
20ఈ తెగుళ్ళ చేత బాధించబడి చావకుండ మిగిలిన ప్రజలు బంగారు, వెండి, ఇత్తడి, రాయి, కొయ్యలతో తయారుచేసుకొన్న విగ్రహాలను, దయ్యాలను పూజచేయడం మానలేదు. ఆ విగ్రహాలు చూడలేవు, వినలేవు, నడవలేవు. అయినా అవి కేవలం తమ చేతి పని అని వారు గ్రహించలేదు. వాటిని దేవునిగా పూజించడం తప్పు అని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగలేదు. 21వారు చేసే హత్యలు, మంత్రపు ప్రయోగాలు, లైంగిక దుర్నీతి, దొంగతనం అనేవి తప్పు అని గ్రహించి పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగలేదు.

Currently Selected:

ప్రకటన 9: TSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ప్రకటన 9