రోమా పత్రిక 12
12
సజీవ యాగం
1కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన. 2ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు.
క్రీస్తు శరీరంలో వినయంతో పరిచర్య
3నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో అందరికి నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో అందరికి పంచి ఇచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి. 4ఎలాగైతే మనకు ఉన్న ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నా అవన్నీ ఒకే పని ఎలా చేయవో, 5అలాగే మనం అనేకులమైనప్పటికీ క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాము, ప్రతి ఒక్కరు మిగిలిన వారందరికి సంబంధించినవారే. 6మనలో అందరికి అనుగ్రహించబడిన కృపను బట్టి మనం వేరు వేరు కృపావరాలు కలిగి ఉన్నాము. నీ కృపావరం ప్రవచనా వరమైతే నీ విశ్వాసానికి అనుగుణంగా ప్రవచించు. 7ఆ కృపావరం సేవచేయడమైతే సేవ చేయి. ఆ కృపావరం బోధించడమైతే బోధించు; 8ఒకవేళ అది ప్రోత్సహించడమైతే ప్రోత్సహించు; ఒకవేళ అది దానం చేయడమైతే ధారళంగా దానం చేయి; ఒకవేళ ఇతరులను నడిపించడమైతే శ్రద్ధగా నడిపించు, ఒకవేళ అది కనికరం చూపించడమైతే, సంతోషంగా చూపించండి.
క్రియలలో ప్రేమ
9ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. చెడ్డదాన్ని ద్వేషించి మంచిని పట్టుకోవాలి. 10ప్రేమలో ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండండి. మీకన్న ఎక్కువగా ఒకరిని ఒకరు గౌరవించండి. 11అత్యాసక్తి చూపడంలో ఎన్నడూ వెనుకబడవద్దు కాని మీరు ఆత్మీయ ఉత్సాహం కలిగి దేవుని సేవించండి. 12నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి. 13అవసరంలో ఉన్న పరిశుద్ధులతో పంచుకోండి. ఆతిథ్యం ఇవ్వండి.
14మిమ్మల్ని హింసించినవారిని దీవించండి; వారిని దీవించండి కాని శపించవద్దు. 15ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి. 16ఒకరితో ఒకరు ఐక్యమత్యం కలిగి జీవించండి. గర్వం ఉండవద్దు కాని మీకన్న తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలతో కూడా సహవాసం చేయండి. అహంకారం ఉండవద్దు.
17చెడుకు ప్రతిగా ఎవరికి చెడు చేయకండి. అందరి దృష్టికి సరియైనవిగా ఉన్నవాటిని చేసేలా జాగ్రత్తపడండి. 18మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి. 19నా ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోకండి కాని, “పగ తీర్చుకోవడం నా పని, వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తానని#12:19 ద్వితీ 32:35 ప్రభువు చెప్పారు” అని వ్రాయబడిన ప్రకారం దేవుని ఉగ్రతకు విడిచిపెట్టండి. 20అయితే,
“మీ శత్రువు ఆకలితో ఉంటే వానికి ఆహారం పెట్టండి;
అతడు దాహంతో ఉంటే వానికి త్రాగడానికి ఇవ్వండి.
మీరు ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తారు.”#12:20 సామెత 25:21,22
21చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి.
Currently Selected:
రోమా పత్రిక 12: TSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.