రోమా పత్రిక 3
3
దేవుని విశ్వసనీయత
1అయితే యూదునిగా ఉండడం వల్ల ప్రయోజనమేమిటి? సున్నతిలో ఉన్న విలువేమిటి? 2ప్రతీ విషయంలోను ఎక్కువే! మొదటిగా, దేవుని మాటలు యూదులకు అప్పగించబడ్డాయి.
3వారిలో కొందరు అవిశ్వాసంగా ఉన్నంత మాత్రాన వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా? 4ఎన్నటికి కాదు; ప్రతి ఒక్క మనిషి అబద్ధికుడు కావచ్చు కాని దేవుడు సత్యవంతుడు. దేవుని గురించి లేఖనంలో ఇలా వ్రాయబడి ఉన్నది,
“మాట్లాడినప్పుడు నీవు నీతిమంతుడవని నిరూపించబడతావు
తీర్పు తీర్చునప్పుడు నీవు జయిస్తావు.”#3:4 కీర్తన 51:4
5అయితే మన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని మరింత స్పష్టమవుతుంటే, మనమేమి చెప్పగలం? దేవుడు తన ఉగ్రతను మనమీద చూపితే ఆయన అన్యాయస్థులు అవుతారా? నేను మానవరీతిగా మాట్లాడుతున్నాను. 6ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలరు? 7అయితే కొందరు, “ఒకవేళ నా అబద్ధం వలన దేవుని సత్యం వ్యాపించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపిగా ఎందుకు తీర్పు తీర్చబడాలి?” అని వాదిస్తారు. 8“మంచి జరగడానికి చెడు చేద్దాం” అని మేము చెప్తున్నామని కొందరు దూషిస్తున్నట్లుగా మేమెందుకు చెప్పకూడదు? అలాంటి వారికి వచ్చే శిక్ష న్యాయమైనదే!
ఎవరూ నీతిమంతులు కారు
9అప్పుడు మనం ఏమని నిర్ధారించాలి? మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత మాత్రం లేదు! యూదులు, యూదేతరులు ఒకేలా పాప బంధకాలలో ఉన్నారని మేము ముందుగానే చెప్పాము. 10దీని గురించి లేఖనాల్లో ఈ విధంగా,
“నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు;
11గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు;
దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు.
12అందరు దారి తప్పి చెడిపోయారు,
వారందరు కలిసి అప్రయోజకులయ్యారు;
మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు,
ఒక్కరు కూడా లేరు.”#3:12 కీర్తన 14:1-3; 53:1-3; ప్రసంగి 7:20
13“వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి;
వారు నాలుకలతో మోసం చేస్తారు.”#3:13 కీర్తన 5:9
“వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది.”#3:13 కీర్తన 140:3
14“వారి నోటి నిండా శాపాలు, పగ ఉన్నాయి.”#3:14 కీర్తన 10:7
15“వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి;
16వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి,
17సమాధాన మార్గం వారికి తెలియదు.”#3:17 యెషయా 59:7,8
18“వారి కళ్లలో దేవుని భయం లేదు.”#3:18 కీర్తన 36:1
19ప్రతి నోరు మౌనంగా ఉండేలా, లోకమంతా దేవునికి లెక్క అప్పగించేలా ధర్మశాస్త్రం చెప్పేవన్నీ ధర్మశాస్త్రానికి లోబడేవారికి చెప్తుందని మనం తెలుసు. 20కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరూ దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్పు తీర్చబడరు, కాని ధర్మశాస్త్రం ద్వారా మన పాపాల గురించి మనం తెలుసుకుంటాము.
విశ్వాసం ద్వారా నీతి
21అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండానే దేవుని నీతి తెలియజేయబడుతుంది. దానిని గురించి ధర్మశాస్త్రం, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. 22యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా నమ్మిన#3:22 ద్వారా నమ్మిన యేసు క్రీస్తు విశ్వాసం ద్వారా వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు మధ్య ఏ భేదం లేదు. 23అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. 24కాబట్టి విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. 25క్రీస్తు రక్తాన్ని చిందించడం ద్వారా దేవుడు ఆయనను ప్రాయశ్చిత్త బలిగా సమర్పించారు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన సహనంతో పూర్వం చేసిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేశారు. 26ఆయన ఈ ప్రస్తుత కాలంలో తన నీతిని కనుపరచడానికి, ఆయన నీతిమంతుడై ఉండి యేసులో విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవానిగా ఉండడానికి ఇలా చేశారు.
27అయితే అతిశయించడానికి కారణం ఎక్కడ? అది రద్దు చేయబడింది. ఏ నియమాన్ని బట్టి? క్రియల నియమాన్ని బట్టియా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టియే. 28కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాకుండా విశ్వాసం ద్వారానే ఒకరు నీతిమంతునిగా తీర్చబడతారని మనం నిశ్చయించుకున్నాము. 29దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడా? యూదేతరులకు ఆయన దేవుడు కాడా? అవును, ఆయన యూదేతరులకు కూడా దేవుడే. 30దేవుడు ఒక్కడే కాబట్టి సున్నతి పొందినవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేనివారిని కూడా అదే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చుతారు. 31అయితే ఈ విశ్వాసం బట్టి మనం ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నామా? ఎన్నటికి కాదు! మనం ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.
Currently Selected:
రోమా పత్రిక 3: TSA
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.