YouVersion Logo
Search Icon

1 కొరింథీ పత్రిక 8

8
విగ్రహాలకు అర్పించబడిన ఆహారం
1విగ్రహాలకు అర్పించబడిన ఆహారాన్ని గురించి: “మనమందరం జ్ఞానం కలిగి ఉన్నాం” అని మనకు తెలుసు. అయితే జ్ఞానం అతిశయపడేలా చేస్తుంది కాని, ప్రేమ అభివృద్ధి కలిగిస్తుంది. 2ఒకరు తమకు ఏమైనా తెలుసు అనుకుంటే, వారు తెలుసుకోవలసినంతగా తెలుసుకోలేదని అర్థం. 3అయితే దేవుని ప్రేమించేవారిని దేవుడు గుర్తిస్తారు.
4అందుకే, విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయంలో: “లోకంలో విగ్రహానికి విలువలేదు, ఒకే ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు” అని మనకు తెలుసు. 5ఒకవేళ ఆకాశంలో కాని భూమి మీద కాని దేవుళ్ళు అని పిలువబడే వారు ఉన్నా (నిజానికి చాలామంది “దేవుళ్ళు” చాలామంది “ప్రభువులు” ఉన్నారు), 6కానీ మనకైతే ఒక్కడే తండ్రియైన దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారానే అన్ని కలిగాయి. ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాం; అలాగే మనకు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే, ఆయన ద్వారానే అన్ని కలిగాయి, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాము.
7అయితే ఈ జ్ఞానం అందరికి లేదు. కొందరు ఇప్పటికీ విగ్రహాలను ఆరాధించేవారు తాము తినే పదార్థాలు విగ్రహాలకు బలి అర్పించినవి అని భావిస్తారు. కాబట్టి వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతుంది. 8అయితే ఆహారం మనల్ని దేవునికి దగ్గరగా తీసుకురాదు; తినకపోతే మనకు నష్టంలేదు, తినడం వల్ల మనకు లాభం లేదు.
9అయితే మీకున్న అధికారాన్ని బలహీనులకు అభ్యంతరం కలిగించకుండ చూసుకోండి. 10ఎందుకంటే మీకున్న జ్ఞానంతో విగ్రహాలు ఉన్న మందిరంలో నీవు తినడం బలహీనమైన మనస్సాక్షి కలవారు చూస్తే, వారు విగ్రహాలను అర్పించిన వాటిని తినడానికి ధైర్యం తెచ్చుకుంటారు కదా? 11అందువల్ల ఎవరి కోసం క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనులైన ఆ సహోదరీ సహోదరులు నీ జ్ఞానాన్నిబట్టి నశిస్తారు. 12ఇలా వారికి విరోధంగా పాపం చేసి వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించినందుకు మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. 13కాబట్టి నేను తిన్నదే నా సహోదరీ సహోదరులు పాపంలో పడడానికి ఒకవేళ కారణమైతే, వారు పాపంలో పడడానికి నేను కారణం కాకూడదని నేను మళ్ళీ ఎప్పుడు అలాంటి ఆహారాన్ని తినను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in