కొలొస్సీ పత్రిక 1
1
1దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి వ్రాయునది:
2కొలొస్సయిలో ఉన్న దేవుని పరిశుద్ధ ప్రజలకు, క్రీస్తులో విశ్వాసులైన సహోదరీ సహోదరులకు,
మన తండ్రియైన దేవుని#1:2 కొ.ప్ర.లలో తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక.
కృతజ్ఞత ప్రార్థన
3-4క్రీస్తు యేసులో మీరు కలిగి ఉన్న విశ్వాసం గురించి, దేవుని ప్రజలందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి మేము విన్నాము, కాబట్టి మేము మీ కోసం ప్రార్థన చేసినప్పుడెల్లా, మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. 5మీ దగ్గరకు వచ్చిన సువార్త అనే సత్య బోధలో మీరు విన్న, పరలోకంలో మీ కోసం దాచి ఉంచిన నిరీక్షణ నుండి విశ్వాసం ప్రేమ కలిగాయి. 6అదే విధంగా, మీరు సువార్తను విని, దేవుని కృప గురించి నిజంగా గ్రహించిన రోజు నుండి అది మీ మధ్యలో ఫలించి వృద్ధి చెందుతున్న ప్రకారమే, ఈ సువార్త లోకమంతా ఫలిస్తూ వృద్ధిచెందుతుంది. 7మా ప్రియ తోటి సేవకుడైన ఎపఫ్రా నుండి వీటిని మీరు నేర్చుకున్నారు, అతడు మా విషయంలో క్రీస్తు యొక్క నమ్మకమైన పరిచారకుడు. 8ఆత్మలో మీకున్న ప్రేమను కూడా అతడు మాకు తెలియజేశాడు.
9ఈ కారణంగా, మీ గురించి విన్న రోజు నుండి, మేము మీ కోసం మానక ప్రార్థిస్తున్నాము. మీరు ఆత్మ ఇచ్చే సంపూర్ణ జ్ఞానం, వివేకం ద్వారా ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించినవారై, 10ప్రతి మంచి పనిలో సఫలమవుతూ, దేవుని జ్ఞానంలో ఎదుగుతూ అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా జీవించాలని, 11మీరు ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును, సహనాన్ని కలిగి ఉండేలా, ఆయన మహిమ ప్రభావాలను బట్టి సంపూర్ణ శక్తితో మీరు బలపరచబడాలని దేవున్ని నిరంతరం వేడుకుంటున్నాము. 12వెలుగు రాజ్యంలో పరిశుద్ధ ప్రజల స్వాస్థ్యంలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని ఎన్నికచేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. 13ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలోనికి మనల్ని తీసుకువచ్చారు. 14ఆ కుమారుని ద్వారా మనకు విడుదల, పాపక్షమాపణ కలుగుతుంది.
క్రీస్తు యొక్క సర్వాధికారం
15కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు. 16ఎందుకనగా, ఆయనలోనే సమస్తం సృష్టించబడ్డాయి, అనగా: ఆకాశంలో ఉన్నవి, భూమిపై ఉన్నవి, కంటికి కనబడేవి కనబడనివి, సింహాసనాలైనా లేదా ప్రభుత్వాలైనా లేదా పాలకులైనా లేదా అధికారులైనా, సమస్తం ఆయన ద్వారానే ఆయన కొరకే సృష్టించబడ్డాయి. 17ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము. 18సంఘమనే శరీరానికి ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో సర్వాధికారం కలిగి ఉండడానికి ఆయనే ఆరంభం, మృతులలో నుండి లేచుటలో ప్రథముడయ్యారు. 19ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం. 20ఆయన ద్వారా సమస్తాన్ని అనగా, భూమిపై ఉన్న లేదా పరలోకంలో ఉన్న, అన్నిటిని, క్రీస్తు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీపరచి, క్రీస్తు ద్వారా తనలో సమాధానపరచుకోవడం తండ్రికి ఇష్టమైనది.
21ఒకప్పుడు మీరు దేవుని నుండి దూరం అయ్యారు, మీ దుష్ట ప్రవర్తన వలన మీ మనస్సులో విరోధులయ్యారు. 22అయితే, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా తన సన్నిధిలో నిలబెట్టడానికి యేసు యొక్క భౌతికమైన శరీరం మరణించుట ద్వారా ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచారు. 23అందువల్ల మీరు విశ్వాసంలో కొనసాగుతూ స్థిరంగా నిలబడి, సువార్తలో చెప్పబడిన నిరీక్షణలో నుండి తొలగిపోకుండా ఉండండి. మీరు విన్న ఈ సువార్త, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడుతుంది, పౌలు అనే నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను.
సంఘం కోసం పౌలు పరిచర్య
24మీ కోసం నేను అనుభవిస్తున్న శ్రమలలో ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను, సంఘమనే ఆయన శరీరం కోసం క్రీస్తు పడిన బాధల్లో మిగిలి ఉన్న వాటిలో నా వంతును, నా శరీరంలో పూర్తి చేస్తున్నాను. 25మీకు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తెలియజేయడానికి, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను బట్టి సంఘానికి సేవకుడినయ్యాను. 26దేవుని వాక్యం అనగా గత అనేక యుగాలుగా తరాలుగా మరుగుచేయబడిన మర్మం, కాని ఇది ఇప్పుడు పరిశుద్ధులకు తెలియజేయబడింది. 27యూదేతరుల మధ్యలో నుండి దేవుడు ఎన్నికచేసిన వారికి ఈ మర్మం యొక్క సంపూర్ణ మహిమైశ్వర్యం ఎలాంటిదో, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై ఉన్నారనే విషయం తెలియజేయబడింది.
28మేము అందరిని సంపూర్ణులుగా క్రీస్తులో నిలబెట్టడానికి సమస్త జ్ఞానంతో అందరికి ఆయన గురించే ప్రకటిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము, బోధిస్తున్నాము. 29నాలో బలంగా పని చేస్తున్న క్రీస్తు శక్తి అంతటిని బట్టి, ఇప్పటివరకు నేను ప్రయాసపడి పని చేస్తున్నాను.
Currently Selected:
కొలొస్సీ పత్రిక 1: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.