దానియేలు 11
11
1మాదీయుడైన దర్యావేషు పరిపాలన యొక్క మొదటి సంవత్సరం, నేను అతనికి సహాయం చేయడానికి, బలపరచడానికి నిలబడ్డాను.)
ఉత్తర దక్షిణ రాజులు
2“కాబట్టి ఇప్పుడు, నేను నీకు సత్యం చెప్తాను: ఇంకా ముగ్గురు పర్షియా రాజులు వస్తారు, తర్వాత నాలుగవ రాజు వస్తాడు, అతడు ఇతరులందరికంటే ఎంతో ధనవంతుడు. తన ధనం వల్ల బలం పొందుకున్న తర్వాత, అతడు గ్రీసు రాజ్యనికి వ్యతిరేకంగా అందరిని పురికొల్పుతాడు. 3తర్వాత బలమైన రాజు లేచి, గొప్ప శక్తితో పాలిస్తూ, తన ఇష్టానుసారంగా చేస్తాడు. 4అతడు పైకి వచ్చిన తర్వాత, అతని సామ్రాజ్యం చీల్చబడి ఆకాశ నలుదిక్కులకు పంచి పెట్టబడుతుంది. అది అతని వారసులకు సంక్రమించదు, లేదా అతడు ఉపయోగించిన అధికారం దానికి ఉండదు ఎందుకంటే, అతని సామ్రాజ్యం పెరికి వేయబడి ఇతరులకు ఇవ్వబడుతుంది.
5“తర్వాత దక్షిణాది రాజు బలవంతుడవుతాడు, అయితే అతనికంటే అతని అధిపతులలో ఒకడు ఇంకా ఎక్కువ బలం కలిగి, అతని సొంత రాజ్యంలో గొప్ప అధికారంతో ఏలుతాడు. 6కొన్ని సంవత్సరాలకు వారిద్దరు మిత్రులవుతారు. అంతేగాక దక్షిణ రాజు కుమార్తె ఉత్తర రాజుతో సంబంధాలు సరిచేయడానికి అతని దగ్గరకు వెళ్తుంది, కాని ఆమె అతని మీద తన ప్రభావాన్ని నిలుపుకోదు, అతడు, అతని అధికారం#11:6 లేదా సంతానం నిలువదు. ఆ రోజుల్లో ఆమె, ఆమె రాజ అంగరక్షకులు, ఆమె తండ్రి, ఆమెకు సహాయపడినవాడు తృణీకరించబడతారు.
7“ఆమె కుటుంబ వంశం నుండి ఆమెకు బదులు ఒకడు లేస్తాడు. అతడు ఉత్తరాది రాజు యొక్క బలగాలపై దాడి చేసి అతని కోటలో చొరబడతాడు; అతడు వారి మీద యుద్ధం చేసి గెలుస్తాడు. 8అతడు వారి దేవుళ్ళను, వారి పోతవిగ్రహాలను, వారి విలువైన వెండి బంగారు వస్తువులను పట్టుకుని ఈజిప్టుకు తీసుకెళ్తాడు. కొన్ని సంవత్సరాలు అతడు ఉత్తరాది రాజును ఒంటరిగా వదిలేస్తాడు. 9తర్వాత ఉత్తరాది రాజు దక్షిణాది రాజు దేశంలోకి దండెత్తి వస్తాడు కాని, తిరిగి స్వదేశానికి వెళ్లిపోతాడు. 10అతని కుమారులు యుద్ధానికి సిద్ధపడి, గొప్ప సైన్యాన్ని సమకూరుస్తారు, అది ఆగలేని వరదలా ముందుకు వస్తూ, అతని కోట వరకు యుద్ధాన్ని తీసుకెళ్తుంది.
11“అప్పుడు దక్షిణాది రాజు కోపంతో గొప్ప సైన్యాన్ని పురికొల్పిన ఉత్తరాది రాజు మీదికి దండెత్తి వస్తాడు, వారిని ఓడిస్తాడు. 12ఆ సైన్యాన్ని పట్టుకెళ్లిన తర్వాత, దక్షిణాది రాజు గర్వంతో నిండి, వేలమందిని చంపేస్తాడు, అయినా అతని విజయం నిలువదు. 13ఎందుకంటే ఉత్తరాది రాజు మరో సైన్యాన్ని సిద్ధం చేస్తాడు, అది ముందున్న దానికంటే గొప్పది; కొన్ని సంవత్సరాల తర్వాత, పూర్తిగా సిద్ధం చేయబడిన మహా సైన్యంతో అతడు తిరిగి వస్తాడు.
14“ఆ రోజుల్లో చాలామంది దక్షిణాది రాజు మీదికి లేస్తారు. నీ సొంత ప్రజల్లో హింసాత్మకమైన వారు దర్శనం నెరవేర్పులో భాగంగా తిరగబడతారు, కాని విఫలమవుతారు. 15తర్వాత ఉత్తరాది రాజు వచ్చి ముట్టడి దిబ్బలను వేసి, కోటగల పట్టణాన్ని చెరగా పట్టుకుంటాడు. దక్షిణాది బలగాలకు ఎదుర్కొనే శక్తి ఉండదు; వారి యొక్క బలమైన సైన్యానికి కూడా ఎదుర్కొనే బలం ఉండదు. 16ఉత్తరాది రాజు తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు; అతన్ని ఎదిరించే సామర్థ్యం ఎవరికీ లేదు. అతడు సుందరమైన దేశంలో తనను తాను స్థిరపరచుకుంటాడు, దానిని నాశనం చేసే శక్తి అతనికి ఉంది. 17అతడు తన రాజ్యమంతటి బలంతో వచ్చి దక్షిణాది రాజుతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతని రాజ్యాన్ని పడగొట్టడానికి ఒక కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేస్తాడు, కాని అతని ప్రణాళికలు విజయవంతం కావు, అవేవి అతనికి సహాయపడవు. 18తర్వాత అతడు తన దృష్టి సముద్ర తీరాల మీద పెట్టి చాలా పట్టణాలను జయిస్తాడు, కాని అతడు కలిగించిన అవమానాన్ని ఒక సైన్యాధిపతి తుదముట్టించి ఆ అవమానం అతనికే కలిగిస్తాడు. 19దీని తర్వాత, అతడు తన దేశ కోటల వైపు తిరుగుతాడు, కాని మరెన్నడు కనిపించకుండా, తడబడి పడిపోతాడు.
20“అతని వారసుడు రాజ వైభవాన్ని నిర్వహించడానికి పన్ను వసూలు చేసేవాన్ని పంపిస్తాడు, అయితే అతడు నాశనమవుతాడు, అయినా ఎవరి కోపం వల్ల లేదా యుద్ధం వల్ల కాదు.
21“అతని తర్వాత రాజ్య గౌరవం దక్కని నీచమైన వ్యక్తి అధికారంలోకి వస్తాడు. ప్రజలు సురక్షితంగా ఉన్నామని అనుకున్నప్పుడు, అతడు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు, కాని కుట్రతో ఆక్రమించుకుంటాడు. 22అప్పుడు అతని ఎదుట ఉప్పొంగే సైన్యం కొట్టుకుపోతుంది; అది, దాని నిబంధన అధికారి నాశనమవుతారు. 23అతనితో సంధి చేసుకున్న తర్వాత అతడు కపటంగా వ్యవహరిస్తాడు, తనతో ఉన్న కొంతమంది ప్రజలతో మాత్రమే అధికారంలోకి వస్తాడు. 24ధనికమైన ప్రాంతాలు సురక్షితంగా ఉన్నామని భావించినప్పుడు, అతడు వాటిని ఆక్రమించి, తన పితరులు, తన పూర్వికులు సంపాదించలేనిది సంపాదిస్తాడు. అతడు దోపుడుసొమ్మును, కొల్లగొట్టిన సొమ్మును, ధనాన్ని తన అనుచరులకు పంచిపెడతాడు. కోటలు పడగొట్టడానికి కుట్ర చేస్తాడు, కాని కొంతకాలం మట్టుకే.
25“గొప్ప సైన్యంతో అతడు దక్షిణాది రాజు మీద తన బలాన్ని, ధైర్యాన్ని సమకూరుస్తాడు. దక్షిణాది రాజు చాల శక్తివంతమైన పెద్ద సైన్యం సమకూర్చుకొని యుద్ధం చేస్తాడు, కాని అతనికి విరుద్ధంగా వేసిన కుట్రలను బట్టి అతడు నిలువలేకపోతాడు. 26రాజు భోజనం తినేవారు, అతన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు; అతని సైన్యం తుడిచివేయబడుతుంది, ఎంతోమంది యుద్ధంలో కూలిపోతారు. 27ఆ ఇద్దరు రాజులు కీడును ఉద్దేశిస్తూ, ఒకే బల్ల దగ్గర కూర్చుని ఒకనితో ఒకడు అబద్ధాలు చెప్పుకుంటారు, కాని అది నిష్ప్రయోజనం, ఎందుకంటే అంతం దాని నిర్ణీత కాలంలో వస్తుంది. 28ఉత్తరాది రాజు గొప్ప ఐశ్వర్యంతో తన స్వదేశానికి తిరిగి వస్తాడు, అయితే అతని హృదయం పరిశుద్ధ నిబంధనకు విరుద్ధంగా ఉంటుంది. దానికి విరుద్ధంగా కార్యం చేసి, తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోతాడు.
29“నిర్ణీత కాలంలో అతడు దక్షిణాది ప్రాంతం మీద మళ్ళీ దాడి చేస్తాడు, అయితే ఈసారి మునుపటి ఫలితానికి భిన్నంగా ఉంటుంది. 30కిత్తీము అనగా పశ్చిమ తీర ప్రాంతాల ఓడలు అతన్ని వ్యతిరేకిస్తాయి, అతడు ధైర్యం కోల్పోతాడు. అప్పుడు అతడు తన దేశానికి తిరిగివెళ్లి, పరిశుద్ధ నిబంధనకు వ్యతిరేకంగా తన కోపాన్ని చూపిస్తాడు. అతడు తిరిగివెళ్లి పరిశుద్ధ నిబంధనను విడిచిపెట్టినవారి పట్ల దయ చూపిస్తాడు.
31“అతని సాయుధ దళాలు దేవాలయ కోటను అపవిత్రపరచి అనుదిన బలిని నిలిపివేయడానికి లేచి నాశనానికి కారణమైన హేయమైన దానిని నిలబెడతారు. 32అతడు దుర్మార్గమైన పనులు చేస్తూ పొగడ్తలతో నిబంధనను అతిక్రమించేవారిని తన వశం చేసుకుంటాడు, అయితే తమ దేవున్ని తెలుసుకున్నవారు కదలక అతన్ని ఎదిరిస్తారు.
33“ప్రజల్లో జ్ఞానులు చాలామందికి ఉపదేశిస్తారు, కాని వారు ఖడ్గం చేత గాని దహించబడడం వల్ల గాని చెరపట్టబడడం వల్ల గాని దోపిడికి గురికావడం వల్ల గాని హతమవుతారు. 34వారు పడిపోయినప్పుడు, వారు కొద్ది సహాయం పొందుకుంటారు, అయితే చాలామంది నిజాయితీ లేనివారు వారితో చేరుతారు. 35అంత్యకాలం కోసం శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి, మచ్చలేని వారిగా చేయబడడానికి జ్ఞానులలో కొంతమంది పడిపోతారు, ఎందుకంటే, నిర్ణీత సమయంలో అంతం వస్తుంది.
తనను తాను హెచ్చించుకునే రాజు
36“రాజు తన ఇష్టానుసారంగా చేస్తాడు. తనను తాను ప్రతి దేవునిపైన హెచ్చించుకొని, ఘనపరచుకొని, దేవాది దేవునికి వ్యతిరేకంగా ఎన్నడు వినని విషయాలు మాట్లాడతాడు. ఉగ్రత కాలం పూర్తయ్యే వరకు అతడు వర్ధిల్లుతూ ఉంటాడు, ఎందుకంటే నిర్ణయించబడింది జరగాలి. 37అతడు తన పూర్వికుల దేవుళ్ళను గాని, స్త్రీలు కోరే దేవున్ని కాని, ఏ ఇతర దేవతను గాని ఆలోచింపక, వారందరి మీద తనను తాను హెచ్చించుకుంటాడు. 38వారికి బదులు, కోటల దేవున్ని ఘనపరుస్తాడు; తన పూర్వికులకు తెలియని దేవున్ని వెండి, బంగారం, ప్రశస్తమైన రాళ్లు, ఖరీదైన బహుమానాలు ఇచ్చి ఘనపరుస్తాడు. 39అతడు పరదేశి దేవుని సహాయంతో బలమైన కోటల మీద దాడి చేసి, తనను గుర్తించిన వారిని గొప్పగా ఘనపరుస్తాడు. వారిని అనేకుల మీద పాలకులుగా నియమిస్తాడు, వెలకు దేశాన్ని పంచిపెడతాడు.
40“అంత్యకాలంలో దక్షిణాది రాజు యుద్ధంలో పాల్గొంటాడు, ఉత్తరాది రాజు రథాలు, గుర్రాల దళం, ఎన్నో యుద్ధ నౌకలతో అతని మీద దాడి చేస్తాడు. అతడు ఎన్నో దేశాలను ఆక్రమించి వరదలా వాటిని లాగేస్తాడు. 41అతడు సుందరమైన దేశాన్ని కూడ ఆక్రమిస్తాడు, ఎన్నో దేశాలు పడిపోతాయి, కాని ఎదోము, మోయాబు, అమ్మోను నాయకులు అతని చేతి నుండి విడిపించబడతారు. 42అతడు ఎన్నో దేశాల మీద తన అధికారం కలిగి ఉంటాడు; ఈజిప్టు తప్పించుకోలేదు. 43ఈజిప్టులో కూడబెట్టిన వెండి, బంగారు నిధులు, విలువైన వస్తువులన్నీ అతని ఆధీనంలోనికి తీసుకుంటాడు. లిబియానీయులు, కూషీయులు#11:43 అంటే, ఇతియొపియా వారు అతనికి లొంగిపోతారు. 44అయితే తూర్పు, ఉత్తరం నుండి వచ్చే సమాచారాలు అతన్ని కలవరపరుస్తాయి. అప్పుడతడు అనేకులను నాశనం చేయడానికి నిర్మూలించడానికి మహా కోపోద్రేకంతో బయలుదేరుతాడు. 45అతడు తన రాజ గుడారాలను సముద్రాల మధ్య సుందరమైన పవిత్ర పర్వతం దగ్గర వేసుకుంటాడు. అయినా అతడు అంతరించిపోతాడు, ఎవరూ అతనికి సహాయం చేయరు.
Currently Selected:
దానియేలు 11: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.