YouVersion Logo
Search Icon

ద్వితీయో 3

3
బాషాను రాజైన ఓగు ఓటమి
1తర్వాత మనం తిరిగి బాషానుకు వెళ్లే మార్గంలో వెళ్లాము. అప్పుడు బాషాను రాజైన ఓగు తన సైన్యమంతటితో ఎద్రెయీ దగ్గర యుద్ధంలో మనలను ఎదుర్కోడానికి బయలుదేరాడు. 2యెహోవా నాతో, “అతనికి భయపడకండి, ఎందుకంటే అతన్ని, అతని సైన్యమంతటిని, అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. హెష్బోనును పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికి చేయండి” అని అన్నారు.
3కాబట్టి మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును, అతని సైన్యమంతటిని మన చేతికి అప్పగించారు. వారిలో ఎవరిని మిగల్చకుండా అందరిని హతం చేశాము. 4ఆ సమయంలో అతని పట్టణాలన్నిటిని మనం స్వాధీనం చేసుకున్నాము. బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రాంతమంతటిలో ఉన్న అరవై పట్టణాల్లో స్వాధీనం చేసుకోనిది ఒక్కటి కూడా లేదు. 5ఈ పట్టణాలన్ని ఎత్తైన గోడలు, ద్వారాలు గడియలతో పటిష్టంగా ఉన్నాయి, వీటితో పాటు గోడలులేని అనేక గ్రామాలు కూడా ఉన్నాయి. 6హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లే ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులు, పిల్లలను పూర్తిగా నాశనం చేశాము. 7అయితే మన కోసం పశువులన్నిటిని, వారి పట్టణాల నుండి సొమ్మును దోచుకున్నాము.
8ఆ సమయంలో ఈ ఇద్దరు అమోరీయుల రాజుల నుండి అర్నోను వాగు మొదలుకొని హెర్మోను పర్వతం వరకు యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాము. 9హెర్మోనును సీదోనీయులు షిర్యోను అంటారు; అమోరీయులు శెనీరు అని పిలుస్తారు. 10పీఠభూమిలో ఉన్న పట్టణాలన్నిటిని, బాషానులో ఓగు రాజ్యంలోని పట్టణాలైన సలేకా ఎద్రెయీల వరకు గిలాదు అంతటిని, బాషానును అంతటిని స్వాధీనం చేసుకున్నాము. 11రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు చివరివాడు. అతని సమాధి ఇనుముతో చేయబడి తొమ్మిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు#3:11 సుమారు 4 మీటర్ల పొడవు 1.8 మీటర్ల వెడల్పు కలది. అది ఇంకా అమ్మోనీయులకు చెందిన రబ్బాలో ఉంది.
భూభాగాన్ని విభజించుట
12ఆ సమయంలో మనం స్వాధీనం చేసుకున్న దేశాన్ని అనగా అర్నోను వాగు లోయలో ఉన్న అరోయేరు నుండి గిలాదు కొండ ప్రాంతంలోని సగభాగాన్ని దానిలో ఉన్న పట్టణాలతో కలిపి రూబేనీయులకు గాదీయులకు ఇచ్చాను. 13గిలాదులో మిగతా ప్రాంతాన్ని, ఓగు రాజ్యమైన బాషాను అంతటిని మనష్షే అర్ధగోత్రానికి ఇచ్చాను. బాషానులోని అర్గోబు ప్రాంతమంతా రెఫాయీయుల దేశమని పిలువబడేది. 14మనష్షే సంతానమైన యాయీరు అర్గోబు ప్రాంతమంతా గెషూరీయుల మయకాతీయుల సరిహద్దుల వరకు స్వాధీనపరచుకున్నాడు. దానికి అతని పేరు పెట్టబడింది కాబట్టి నేటికీ బాషాను హవ్వోత్ యాయీరు#3:14 లేదా యాయీరు స్థావరాలు అని పిలుస్తారు. 15గిలాదును మాకీరుకు ఇచ్చాను. 16అయితే రూబేనీయులకు, గాదీయులకు గిలాదు నుండి అర్నోను వాగు లోయ మధ్య వరకు, యబ్బోకు నది వరకు, అమ్మోనీయుల సరిహద్దు వరకు నేను ఇచ్చాను. 17దాని పశ్చిమ సరిహద్దు కిన్నెరెతు#3:17 లేదా గలిలయ సరస్సు నుండి పిస్గా కొండచరియల తూర్పున, మృత సముద్రమనే అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబాలోని యొర్దాను నది.
18ఆ సమయంలో నేను యొర్దాను తూర్పున నివసిస్తున్న గోత్రాలకు మీకు ఇలా ఆజ్ఞాపించాను: “మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. అయితే మీలో ధృడమైనవారు, యుద్ధానికి సిద్ధపడినవారు ఇతర ఇశ్రాయేలీయులకు ముందుగా నది దాటాలి. 19-20అయితే యెహోవా మీకు విశ్రాంతి ఇచ్చినట్టు మీ సోదరులకును విశ్రాంతి ఇచ్చేవరకు, అంటే యొర్దాను అవతల మీ దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునేవరకు మీ భార్యలు, మీ పిల్లలు మీ పశువులు నేను మీకిచ్చిన పట్టణాల్లోనే ఉండాలి. ఆ తర్వాత నేను మీకు ఇచ్చిన స్వాస్థ్యాలకు ప్రతి ఒక్కరు తిరిగి వెళ్లవచ్చు.”
యొర్దాను దాటడం మోషేకు నిషేధం
21ఆ సమయంలో నేను యెహోషువకు ఆజ్ఞాపించాను: “నీవు నీ కళ్లారా దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసిందంతా చూశావు. నీవు వెళ్లబోయే చోటులో ఉన్న అన్ని రాజ్యాలకు యెహోవా అలాగే చేస్తారు. 22వారికి నీవు భయపడకు; నీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తారు.”
23ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమాలుకున్నాను: 24“ప్రభువైన యెహోవా, మీ గొప్పతనాన్ని, మీ బలమైన చేతిని మీ సేవకునికి చూపించడం మొదలుపెట్టారు. ఆకాశంలో గాని భూమిమీదగాని మీరు చేసే పనులు, అద్భుతకార్యాలు చేయగల దేవుడెవరున్నారు? 25నేను వెళ్లి యొర్దాను అవతల ఉన్న మంచి దేశాన్ని, మంచి కొండ ప్రాంతాన్ని, లెబానోనును చూడనివ్వండి.”
26అయితే మీ కారణంగా యెహోవా నా మీద కోప్పడి, నా మొర వినలేదు. యెహోవా నాతో అన్నారు, “ఇక చాలు, ఈ విషయమై నాతో ఇక మాట్లాడవద్దు. 27నీవు పిస్గా కొండ శిఖరం పైకెక్కి అక్కడినుండి పడమర, ఉత్తరం, దక్షిణం, తూర్పు వైపులకు చూడు. నీవు యొర్దాను నది దాటవు కాబట్టి నీ కళ్లారా ఆ దేశాన్ని చూడు. 28అయితే యెహోషువను నియమించి, అతన్ని ప్రోత్సాహించి బలపరచు, ఎందుకంటే అతడు ఈ ప్రజలను నది దాటిస్తాడు, నీవు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకునేలా చేస్తాడు.” 29కాబట్టి మనం బేత్-పెయోరు దగ్గర ఉన్న లోయలో ఉన్నాము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in