ద్వితీయో 32
32
1ఆకాశాల్లారా, ఆలకించండి, నేను మాట్లాడతాను;
భూమీ, నా నోటి మాటలు విను.
2నా ఉపదేశం వర్షంలా కురుస్తుంది
నా మాటలు మంచు బిందువుల్లా దిగుతాయి,
లేతగడ్డి మీద జల్లులా,
లేత మొక్కల మీద సమృద్ధి వర్షంలా ఉంటుంది.
3నేను యెహోవా నామాన్ని ప్రకటిస్తాను.
మన దేవుని గొప్పతనాన్ని స్తుతించండి!
4ఆయన మనకు ఆశ్రయదుర్గం, ఆయన పనులు పరిపూర్ణం,
ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి.
ఆయన తప్పుచేయని నమ్మదగిన దేవుడు,
ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు.
5ఆయన ప్రజలు అవినీతిపరులు, వారు ఆయన పిల్లలు కారు;
వారి అవమానం పొందిన మూర్ఖులైన వక్ర తరం వారు.
6అవివేకులైన తెలివితక్కువ ప్రజలారా,
యెహోవాకు మీరు తిరిగి చెల్లించే విధానం ఇదేనా?
మిమ్మల్ని చేసిన, మిమ్మల్ని రూపించిన,
మీ తండ్రి, మీ సృష్టికర్త ఆయన కాడా?
7పాత రోజులను జ్ఞాపకముంచుకోండి;
గత తరాలను గురించి ఆలోచించండి.
తండ్రిని అడగండి, ఆయనే మీకు చెప్తారు,
మీ పెద్దలను అడగండి, వారే మీకు వివరిస్తారు.
8మహోన్నతుడు జనాంగాలకు వారి వారి వారసత్వాలను ఇచ్చినప్పుడు,
సర్వ మనుష్యజాతిని విభజించినప్పుడు,
ఇశ్రాయేలు కుమారుల సంఖ్య ప్రకారం
జనములకు ఆయన సరిహద్దులు ఏర్పరిచారు.
9యెహోవా ప్రజలే ఆయన భాగం,
యాకోబు ఆయనకు కేటాయించబడిన వారసత్వము.
10-11ఆయన అతన్ని ఎడారి ప్రదేశంలో,
శబ్దాలు వినబడే బంజరు భూమిలో కనుగొన్నారు.
తన గూడును కదిలించి,
తన పిల్లల పైగా అల్లాడుతూ ఉండే,
వాటిని పైకి తీసుకెళ్లడానికి దాని రెక్కలు చాపి
వాటిని పైకి మోసుకెళ్లే గ్రద్దలా,
ఆయన అతన్ని చుట్టూ ఆవరించి సంరక్షిస్తూ,
తన కనుపాపలా ఆయన అతన్ని కాపాడారు.
12యెహోవా ఒక్కడే అతన్ని నడిపించారు;
ఏ ఇతర దేవుడు అతనితో ఉండలేదు.
13ఆయన అతన్ని ఎత్తైన స్థలాలపైకి ఎక్కించారు
పొలాల పంటను అతనికి తినిపించారు.
బండ నుండి తీసిన తేనెతో,
రాళ్లమయమైన పర్వత శిఖరం నుండి తీసిన నూనెతో అతన్ని పోషించారు,
14ఆవు పెరుగును, గొర్రెల, మేకల పాలను, గొర్రెపిల్లల క్రొవ్వును,
మేకపోతులను, పశువుల మంద, గొర్రెల మంద నుండి పెరుగు, పాలతో
క్రొవ్విన గొర్రెపిల్లలను, మేకలను,
బాషాను శ్రేష్ఠమైన పొట్టేళ్లను
నాణ్యమైన గోధుమలను మీకిచ్చారు.
మీరు ద్రాక్షరసంతో చేసిన మద్యాన్ని త్రాగారు.
15యెషూరూను#32:15 యెషూరూను అర్థం యథార్థవంతులు అంటే, ఇశ్రాయేలు. క్రొవ్వుపట్టి కాలు జాడించాడు;
తిండి ఎక్కువై, వారు బలిసి మొద్దులయ్యారు.
వారు తమను చేసిన దేవున్ని విసర్జించి
రక్షకుడైన తమ ఆశ్రయ దుర్గాన్ని తృణీకరించారు.
16వారు ఇతర దేవుళ్ళ వల్ల ఆయనకు రోషం పుట్టించారు,
వారి అసహ్యకరమైన విగ్రహాలతో ఆయనకు కోపం కలిగించారు.
17దేవుడు కాని దయ్యాలకు వారు బలులర్పించారు
తమకు తెలియని దేవుళ్ళకు,
క్రొత్తగా వచ్చిన దేవుళ్ళకు,
మీ పూర్వికులు లెక్కచెయ్యని దేవుళ్ళకు మ్రొక్కారు.
18మీకు తండ్రిగా ఉన్న ఆశ్రయ దుర్గాన్ని మీరు విడిచిపెట్టారు;
మీకు జన్మనిచ్చిన దేవుని మీరు మరచిపోయారు.
19యెహోవా ఇది చూసి వారిని తృణీకరించారు,
ఎందుకంటే ఆయన తన కుమారులు కుమార్తెల వల్ల కోప్పడ్డారు.
20“నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను,
వారి అంతం ఎలా ఉంటుందో చూస్తాను;
ఎందుకంటే వారొక దుర్బుద్ధి కలిగిన తరం,
నమ్మకద్రోహులైన పిల్లలు.
21దేవుడు కాని దానితో వారు నాకు రోషం పుట్టించారు,
అయోగ్యమైన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు.
జనులు#32:21 లేదా బలహీనులైన జనులు కాని వారిని చూసి వారు అసూయపడేలా చేస్తాను;
తెలివిలేని జనులను చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను.
22ఎందుకంటే నా ఉగ్రత అగ్నిలా రగులుకుంటుంది,
పాతాళం వరకు అది మండుతుంది.
అది భూమిని దాని పంటను మ్రింగివేస్తుంది
పర్వతాల పునాదులకు నిప్పు పెడుతుంది.
23“నేను ఆపదలను వారిపై కుప్పగా చేస్తాను,
నా బాణాలను వారి మీదికి వేస్తాను.
24నేను వారి మీదికి తీవ్రమైన కరువును పంపుతాను,
తీవ్ర జ్వరం, మరణకరమైన తెగులు వారిని వేధిస్తాయి,
నేను అడవి మృగాల కోరలను,
దుమ్ములో ప్రాకే ప్రాణుల విషాన్ని నేను వారి మీదికి పంపుతాను.
25బయట ఖడ్గం వారిని సంతానం లేనివారినిగా చేస్తుంది;
వారి ఇళ్ళలో భయం పరిపాలిస్తుంది,
యువతీ యువకులు, నశిస్తారు
శిశువులు, తల నెరసినవారు నశిస్తారు.
26నేను వారిని చెదరగొడతాను,
మానవ జ్ఞాపకంలో నుండి వారి పేరును తుడిచివేస్తాను.
27కాని వారి శత్రువులు తప్పుగా అర్థం చేసుకుని,
‘ఇదంతా యెహోవా చేసినది కాదు,
మా బలంతోనే గెలిచాం’ అని అంటారేమోనని
శత్రువుల దూషణకు భయపడి అలా చేయలేదు.”
28వారు ఆలోచనలేని జనులు,
వారిలో వివేచన లేదు.
29వారు తెలివైన వారైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు,
వారి అంతం ఏమిటో వివేచిస్తారు!
30తమ ఆశ్రయదుర్గం వారిని అప్పగిస్తేనే తప్ప,
యెహోవా వారిని వదిలివేస్తేనే తప్ప,
ఒక్కడు వేయిమందిని తరుమగలడా?
ఇద్దరు పదివేలమందిని పారిపోయేలా చేయగలరా?
31వారి బండ మన ఆశ్రయదుర్గం వంటిది కాదు,
మన శత్రువులు కూడా ఒప్పుకుంటారు.
32వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్షచెట్టు నుండి వచ్చింది
అది గొమొర్రా పొలాల్లో నుండి వచ్చింది.
వాటి ద్రాక్షపండ్లు విషంతో నిండి ఉన్నాయి,
వాటి గెలలు చేదుగా ఉన్నాయి.
33వాటి ద్రాక్షరసం సర్ప విషం,
నాగుపాముల మరణకరమైన విషము.
34“వారి క్రియలు ఎలాంటివో ఆ లెక్క అంతా నా దగ్గరే ఉంది,
దాన్ని నిల్వచేసే నా ఖజానాలో భద్రపరచలేదా?
35పగ తీర్చుకోవడం నా పని; నేను తిరిగి చెల్లిస్తాను.
సరియైన సమయంలో వారి పాదం జారుతుంది;
వారి ఆపద్దినం దగ్గరపడింది
వారి విధి వేగంగా వారి మీదికి వస్తుంది.”
36వారి బలం పోయిందని
బానిసలు గాని స్వతంత్రులు గాని ఎవరు మిగలలేదని చూసి,
యెహోవా తన ప్రజలకు తీర్పు తీరుస్తారు
తన సేవకుల మీద జాలి పడతారు.
37ఆయన ఇలా అంటున్నారు: “వారి దేవుళ్ళు ఎక్కడ,
వారు ఆశ్రయంగా ఏర్పరచుకున్న బండ ఎక్కడ,
38వారి బలుల క్రొవ్వు తిని
వారి పానార్పణల ద్రాక్షరసం త్రాగిన వారి దేవుళ్ళు ఎక్కడ?
మీకు సాయం చేయడానికి వారు లేచెదరు గాక!
వారు మీకు ఆశ్రయమిచ్చెదరు గాక!
39“చూడండి, నేనే ఏకైక దేవున్ని!
నేను తప్ప మరో దేవుడు లేడు
చంపేవాడను నేనే బ్రతికించేవాడను నేనే.
గాయం చేసేది నేనే, బాగు చేసేది నేనే,
నా చేతిలో నుండి ఎవరూ విడిపించలేరు.
40నేను ఆకాశం వైపు నా చేయి ఎత్తి రూఢిగా ప్రమాణం చేస్తున్నాను:
నా శాశ్వత జీవం తోడని చెప్తున్న,
41నేను నా మెరిసే ఖడ్గానికి పదును పెట్టి,
నా చేయి న్యాయాన్ని పట్టుకున్నప్పుడు,
నేను నా ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటాను
నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను.
42నా ఖడ్గం మాంసాన్ని తింటుండగా,
నేను నా బాణాలను రక్తంతో మత్తెక్కేలా చేస్తాను:
చంపబడినవారి రక్తం, బందీల రక్తంతో,
శత్రు నాయకుల తలలను అవి తింటాయి.”
43జనులారా, ఆయన ప్రజలతో కూడా సంతోషించండి,
ఎందుకంటే ఆయన తన సేవకుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటారు;
ఆయన తన శత్రువుల మీద పగతీర్చుకుంటారు
తన దేశం కోసం తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తారు.
44మోషే నూను కుమారుడైన యెహోషువతో పాటు వచ్చి ప్రజలు వింటుండగా ఈ పాటలోని అన్ని మాటలను వినిపించాడు. 45మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలీయులందరికి వినిపించడం ముగించి, 46వారితో, “ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటిని జాగ్రత్తగా పాటించమని మీ పిల్లలకు ఆజ్ఞాపించేలా, ఈ రోజు నేను మీకు హెచ్చరికగా ప్రకటించిన మాటలన్నిటిని జ్ఞాపకముంచుకోండి. 47అవి కేవలం మామూలు మాటలు కావు, అవి మీకు జీవము. మీరు యొర్దాను దాటి వెళ్లి స్వాధీనపరుచుకోబోయే దేశంలో దీర్ఘకాలం జీవిస్తారు” అన్నాడు.
మోషే నెబో పర్వతం మీద చనిపోవుట
48అదే రోజు యెహోవా మోషేతో మాట్లాడుతూ, 49“యెరికోకు ఎదురుగా మోయాబులోని నెబో పర్వతానికి అబారీము పర్వతశ్రేణిలోకి వెళ్లి, నేను ఇశ్రాయేలీయులకు వారి సొంత స్వాస్థ్యంగా ఇస్తున్న కనాను దేశాన్ని చూడు. 50నీ సహోదరుడు అహరోను హోరు కొండపై చనిపోయి తన ప్రజల దగ్గరకు చేరుకున్నట్టు, నీవు ఎక్కిన కొండమీద నీవు చనిపోయి నీ ప్రజల దగ్గరకు చేరుతావు. 51అసలు ఇలా జరిగిందంటే, మీరు సీను ఎడారిలోని మెరీబా కాదేషు నీళ్ల దగ్గర ఇశ్రాయేలీయుల ముందు మీరిద్దరూ నా పట్ల నమ్మకద్రోహం చేశారు, ఇశ్రాయేలీయుల ఎదుట మీరు నా పరిశుద్ధతను గౌరవించకపోవడము. 52కాబట్టి, నీవు దూరం నుండి మాత్రమే దేశాన్ని చూస్తావు; నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న దేశంలో నీవు ప్రవేశించవు” అని అన్నారు.
Currently Selected:
ద్వితీయో 32: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.