YouVersion Logo
Search Icon

ద్వితీయో 6

6
మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి
1మీరు యొర్దాను దాటి స్వాధీనపరుచుకోబోయే దేశంలో మీరు పాటించాలని మీకు బోధించమని మీ దేవుడైన యెహోవా నాకు నిర్దేశించిన ఆజ్ఞలు, శాసనాలు చట్టాలు ఇవే. 2మీరు, మీ పిల్లలు, వారి పిల్లలు జీవితకాలమంతా మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఇచ్చే ఆయన శాసనాలు, ఆజ్ఞలు పాటించడం ద్వారా మీరు దీర్ఘాయువును అనుభవిస్తారు. 3ఇశ్రాయేలూ విను, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన రీతిగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీకు శ్రేయస్సు కలిగి అధికంగా అభివృద్ధి కలిగేలా మీరు వాటికి లోబడి ఉండేలా జాగ్రత్త వహించండి.
4ఓ ఇశ్రాయేలీయులారా, వినండి: మన దేవుడైన యెహోవా, యెహోవా ఒక్కరే. 5మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. 6ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు మీ హృదయాల్లో నిలిచి ఉండాలి. 7వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వాటి గురించి మాట్లాడాలి. 8వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి. 9మీ ఇళ్ళ ద్వారబంధాల మీద, ద్వారాల మీద వాటిని వ్రాయండి.
10మీ దేవుడైన యెహోవా మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన రీతిగా మిమ్మల్ని ఆ దేశంలోనికి తీసుకువచ్చి మీరు కట్టని విశాలమైన మంచి పట్టణాలను, 11మీరు సమకూర్చని అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇళ్ళను, మీరు తవ్వని బావులను, మీరు నాటని ద్రాక్షతోటలు, ఒలీవల తోటలను మీకు ఇస్తారు; మీరు తిని తృప్తిపొందిన తర్వాత, 12బానిస దేశమైన ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్తగా ఉండండి.
13మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను మాత్రమే సేవించి, ఆయన పేరిట మాత్రమే మీరు ప్రమాణం చేయాలి. 14ఇతర దేవుళ్ళను అనగా మీ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్ళను అనుసరించకూడదు; 15మీ మధ్యనున్న మీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు, ఆయన కోపం మీమీద రగులుకొని దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నాశనం చేస్తారు. 16మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను పరీక్షించినట్లు ఆయనను పరీక్షించకూడదు. 17మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన మీకు ఇచ్చిన నిబంధనలను, శాసనాలను జాగ్రత్తగా పాటించండి. 18-19మీకు మేలు కలిగేలా యెహోవా చెప్పినట్లు మీ శత్రువులందరిని మీ ఎదుట నుండి తరిమివేసి యెహోవా మీ పూర్వికులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకోవాలంటే మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి.
20భవిష్యత్తులో, “మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన నిబంధనలు, శాసనాలు, చట్టాలకు అర్థం ఏంటి?” అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు, 21మీరు వారితో, “మనం ఈజిప్టులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు, యెహోవా బలమైన హస్తంతో మనలను ఈజిప్టులో నుండి బయటకు తీసుకువచ్చారు. 22మన కళ్లముందు యెహోవా ఈజిప్టు మీద, ఫరో మీద, అతని ఇంటివారందరి మీద గొప్ప, భయంకరమైన అసాధారణ గుర్తులను, అద్భుతాలను చేశారు. 23ఆయన మన పూర్వికులతో ప్రమాణం చేసిన దేశంలోనికి మనలను తీసుకువచ్చి దానిని మనకు ఇవ్వడానికి అక్కడినుండి మనలను బయటకు తీసుకువచ్చారు. 24మనం ఎల్లప్పుడు వర్ధిల్లుతూ, నేడు ఉన్నట్లుగా మనం బ్రతికి ఉండడానికి ఈ శాసనాలన్నిటికి లోబడి మన దేవుడైన యెహోవాకు భయపడమని యెహోవా మనకు ఆజ్ఞాపించారు. 25మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన ఎదుట మనం ఈ ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా అనుసరిస్తే అది మనకు నీతిగా పరిగణించబడుతుంది” అని చెప్పండి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in