ప్రసంగి 7
7
జ్ఞానం
1చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది,
జన్మదినం కంటే మరణ దినం మంచిది.
2విందు జరిగే వారి ఇళ్ళకు వెళ్లే కంటే
ఏడ్చేవారి ఇళ్ళకు వెళ్లడం మంచిది.
ఎందుకంటే మరణం ప్రతి ఒక్కరికీ వస్తుంది;
జీవించి ఉన్నవారు దీనిని హృదయపూర్వకంగా స్వీకరించాలి.
3నవ్వడం కంటే దుఃఖపడడం మేలు,
ఎందుకంటే విచారంగా ఉన్న ముఖం గుండెకు మంచిది.
4జ్ఞానుల హృదయం దుఃఖపడే వారి గృహంలో ఉంటుంది
కాని బుద్ధిహీనుల మనస్సు సంతోషించే వారి ఇంట్లో ఉంటుంది.
5మూర్ఖుల పాటలు వినడంకంటే,
జ్ఞానుల గద్దింపు వినడం మేలు.
6కుండ క్రింద చిటపటమనే ముండ్ల కంప మంట ఎలాంటిదో,
మూర్ఖుల నవ్వు అలాంటిదే.
అది కూడా అర్థరహితమే.
7అన్యాయం జ్ఞానంగల వానిని మూర్ఖునిగా మారుస్తుంది,
లంచం హృదయాన్ని పాడుచేస్తుంది.
8ఆరంభం కంటే అంతం మేలు,
అహంకారం కంటే సహనం మేలు.
9తొందరపడి కోపపడవద్దు
ఎందుకంటే కోపం మూర్ఖుల ఒడిలో ఉంటుంది.
10“ఇప్పుడు ఉన్న రోజుల కన్నా గడిచిపోయిన రోజులే ఎందుకు మంచివి?” అని అనవద్దు
అలాంటి ప్రశ్నలు అడగడం తెలివైనది కాదు.
11జ్ఞానం ఒక వారసత్వంలా ఒక మంచి విషయమే
అది సూర్యుని క్రింద బ్రతికి ఉన్నవారికి ప్రయోజనం కలిగిస్తుంది.
12డబ్బుతో భద్రత లభించినట్లే,
జ్ఞానంతో కూడా భద్రత లభిస్తుంది,
ప్రయోజనం ఏంటంటే:
జ్ఞానం తనను కలిగినవారిని కాపాడుతుంది.
13దేవుడు చేసిన వాటిని పరిశీలించండి:
ఆయన వంకరగా చేసిన దానిని
ఎవరు సరిచేయగలరు?
14సమయం మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి;
కానీ సమయం చెడుగా ఉన్నప్పుడు ఇలా ఆలోచించండి:
దేవుడు దీన్ని చేశారు
అలాగే దాన్ని చేశారు.
అందువల్ల, తమ భవిష్యత్తు గురించి
ఎవరూ ఏమీ తెలుసుకోలేరు.
15నా ఈ అర్థరహిత జీవితంలో నేను ఈ రెండు చూశాను;
నీతిమంతులు తమ నీతిలో నశించారు,
దుష్టులు తమ దుష్టత్వంలో దీర్ఘకాలం జీవించారు.
16మరీ ఎక్కువ నీతిమంతునిగా ఉండకు,
మరీ ఎక్కువ జ్ఞానిగా ఉండకు,
నిన్ను నీవే ఎందుకు నాశనం చేసుకొంటావు?
17మరీ ఎక్కువ దుర్మార్గంగా ఉండకు,
మూర్ఖునిగా ఉండకు.
సమయం రాకముందే ఎందుకు చనిపోవాలి?
18ఒకదాన్ని పట్టుకోవడం
మరొకదాన్ని విడిచిపెట్టకపోవడం మంచిది.
దేవునికి భయపడేవారు అన్ని విపరీతాలను అధిగమిస్తారు.
19పట్టణంలోని పదిమంది అధికారుల కంటే
తెలివైన వ్యక్తికి ఉన్న జ్ఞానం శక్తివంతమైనది.
20ఎప్పుడూ పాపం చేయకుండా మంచినే చేస్తూ ఉండే,
నీతిమంతులు భూమిపై ఒక్కరు లేరు.
21ప్రజలు చెప్పే ప్రతి మాటను వినవద్దు,
లేకపోతే మీ సేవకుడు మిమ్మల్ని శపించడం మీరు వింటారు.
22ఎందుకంటే మీరే చాలాసార్లు
ఇతరులను శపించారని మీకు తెలుసు.
23నా జ్ఞానంతో ఇదంతా నేను పరిశోధించాను,
“నేను జ్ఞానిని కావాలని నిశ్చయించుకున్నాను”
కాని అది నావల్ల కాలేదు.
24జ్ఞానం దూరంగా లోతుగా ఉంది
దానిని ఎవరు కనుగొనగలరు?
25జ్ఞానాన్ని, సంగతుల మూలకారణాన్ని వెదకి తెలుసుకోడానికి,
దుష్టత్వంలోని బుద్ధిహీనతను,
మూర్ఖత్వంలోని వెర్రితనాన్ని గ్రహించడానికి,
నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను.
26నేను మరణం కన్నా దుఃఖకరమైనది తెలుసుకున్నాను,
అది వల వంటిది,
ఉచ్చులాంటి మనస్సు కలిగి
సంకెళ్ల వంటి చేతులు కలిగిన స్త్రీ.
దేవుని సంతోషపరిచేవారు ఆమె నుండి తప్పించుకుంటారు.
కాని ఆమె పాపులను పట్టుకుంటుంది.
27ప్రసంగి ఇలా అంటున్నాడు, “నేను తెలుసుకున్నది ఇదే:
“సంగతుల మూలకారణాలను తెలుసుకోడానికి ఒక దానికి మరొకదాన్ని జోడించాను.
28నేను ఇంకా వెదకుతున్నాను
కాని దొరకడం లేదు,
వేయిమంది పురుషులలో ఒక్క యథార్థవంతుడు దొరికాడు,
కానీ స్త్రీలందరిలో ఒక్క యథార్థవంతురాలు కూడా దొరకలేదు.
29నేను తెలుసుకున్నది ఇది ఒక్కటే;
దేవుడు మనుష్యజాతిని యథార్థవంతులుగానే సృజించారు,
కానీ వారు అనేక చెడు పథకాల వెంటపడుతున్నారు.”
Currently Selected:
ప్రసంగి 7: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.