హబక్కూకు 2
2
1నేను నా కావలి స్థలం దగ్గర కనిపెట్టుకుని
నగర గోడపై నిలబడి ఉంటాను;
ఆయన నాతో ఏమి చెప్తాడో,
ఈ ఫిర్యాదుకు#2:1 ఈ ఫిర్యాదుకు లేదా ఈ గద్దింపుకు నేను ఏమి జవాబు చెప్పాలో చూస్తాను.
యెహోవా జవాబు
2యెహోవా నాకిలా జవాబిచ్చారు:
“ప్రకటించేవాడు పరుగెడుతూ సులభంగా చదవడానికి వీలుగా
దర్శన సందేశాన్ని
పలక మీద స్పష్టంగా వ్రాయి.
3దర్శన సందేశం ఒక నియమిత సమయంలో జరుగుతుంది;
అది అంతం గురించి మాట్లాడుతుంది
అది తప్పక నెరవేరుతుంది.
అది ఆలస్యమైనా, దాని కోసం వేచి ఉండండి;
ఇది ఖచ్చితంగా జరుగుతుంది
ఆలస్యం కాదు.
4“చూడండి, శత్రువు కోరికలు న్యాయమైనవి కాకపోయినా
అతడు అతిశయపడుతున్నాడు;
కాని నీతిమంతుడు తన నమ్మకత్వాన్ని బట్టి జీవిస్తాడు.
5ద్రాక్షరసం అతన్ని మోసం చేస్తుంది;
గర్విష్ఠియైన అతడు ఎప్పుడూ విశ్రమించడు.
అతనికి పాతాళమంత దురాశ ఉన్నందున
మరణంలా అది ఎన్నడూ తృప్తిపడదు,
అతడు సమస్త జనాలను వశపరచుకుంటాడు
ప్రజలందరిని బందీలుగా తీసుకెళ్తాడు.
6“అయితే వారందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఈ సామెత చెబుతారు,
“ ‘దొంగిలించిన వస్తువులను పోగుచేసి
బలత్కారంతో ధనవంతునిగా మారిన వారికి శ్రమ!
ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?’
7అప్పు ఇచ్చినవారు నీ మీద అకస్మాత్తుగా పడరా?
వారు లేచి నీకు వణుకు పుట్టించరా?
అప్పుడు వారు నిన్ను దోచుకుంటారు.
8నీవు అనేక దేశాలను దోచుకున్నావు కాబట్టి,
మిగిలి ఉన్న ప్రజలంతా నిన్ను దోచుకుంటారు.
నీవు నరహత్యలు చేసినందుకు, భూములను పట్టణాలను
వాటిలోని వారందరినీ నాశనం చేసినందుకు ప్రజలు నిన్ను దోచుకుంటారు.
9“తనకు నాశనం కలుగకుండా తన నివాసాన్ని ఎత్తు చేసుకుని
అన్యాయమైన సంపాదనతో
తన ఇంటిని నిర్మించుకునే వారికి శ్రమ!
10అనేక ప్రజలను నాశనం చేయడానికి కుట్రచేసి
నీ ఇంటివారి మీదికి అవమానం తెచ్చుకుని నీ ప్రాణాన్ని కోల్పోతున్నావు.
11గోడ రాళ్లు మొరపెడతాయి,
చెక్క దూలాలు వాటిని ప్రతిధ్వనింపచేస్తాయి.
12“రక్తం చిందించి పట్టణాన్ని నిర్మించేవారికి
అన్యాయంతో ఊరిని స్థాపించేవారికి శ్రమ!
13ప్రజలు కష్టపడతారు కాని అగ్ని పాలవుతారని,
వ్యర్థమైన దాని కోసం కష్టపడి జనులు అలసిపోతారని
సైన్యాల యెహోవా నిర్ణయించలేదా?
14నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు
యెహోవా మహిమాన్విత జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.
15“తన పొరుగువారి నగ్న శరీరాలను చూడాలని,
వారు మత్తులో మునిగిపోయేలా
కోపంతో వారికి ద్రాక్షరసం పోసేవారికి శ్రమ!
16కీర్తికి బదులుగా నీకు అవమానం కలుగుతుంది
కాబట్టి ఇప్పుడు నీ వంతు! నీవు కూడా త్రాగి నీ నగ్నత్వాన్ని చూపించుకుంటావు.
యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ దగ్గరకు వస్తోంది,
అవమానం నీ కీర్తిని కప్పివేస్తుంది.
17లెబానోనుపై నీవు చేసిన హింస నీ మీదికే వస్తుంది,
పశువులను నాశనం చేసినందుకు నీ మీదికి భయంకరమైన తీర్పు వస్తుంది.
నీవు మనుష్యులను హత్య చేసినందుకు,
దేశాలను పట్టణాలను వాటి నివాసులను నాశనం చేసినందుకు ఇలా జరుగుతుంది.
18“శిల్పి చెక్కిన ఒక విగ్రహం వలన ప్రయోజనమేంటి?
అబద్ధాలు బోధించే ప్రతిమ వలన ప్రయోజనమేంటి?
ఒకడు మాట్లాడలేని విగ్రహాలను చేసిన
తాను రూపం ఇచ్చిన వాటిపైనే నమ్మకం ఉంచడం వలన ప్రయోజనమేంటి?
19చెక్కను చూసి, ‘ప్రాణం తెచ్చుకో’ అని
నిర్జీవమైన రాయితో, ‘మేలుకో’ అని చెప్పేవానికి శ్రమ!
అది దారి చూపించగలదా?
అది బంగారం వెండితో పూత వేయబడింది;
దానిలో శ్వాస లేదు.”
20కాని, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు;
ఆయన ఎదుట లోకమంతా మౌనం వహించాలి.
Currently Selected:
హబక్కూకు 2: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.