హెబ్రీ పత్రిక 11
11
క్రియలలో విశ్వాసం
1విశ్వాసమనేది మనం ఎదురు చూసే వాటిని గురించిన నమ్మకం, మన కళ్లముందు లేనివాటిని గురించిన నిశ్చయత. 2దీనిని బట్టి పూర్వికులు మెప్పుపొందారు.
3దేవుని ఆజ్ఞ చేత సృష్టి రూపించబడింది, కాబట్టి కనిపించే వాటినుండి కనిపిస్తున్నవి చేయబడలేదని విశ్వాసం ద్వారా మనం గ్రహిస్తున్నాము.
4విశ్వాసం ద్వారానే హేబెలు కయీను కంటే ఉత్తమమైన అర్పణను దేవునికి తెచ్చాడు. విశ్వాసం ద్వారానే అతడు నీతిమంతునిగా ప్రశంసించబడ్డాడు. దేవుడు అతని అర్పణను మెచ్చుకొన్నాడు. చనిపోయినప్పటికి విశ్వాసం ద్వారానే హేబెలు ఇంకా మాట్లాడుతున్నాడు.
5విశ్వాసం ద్వారానే హనోకు ఈ జీవితంలో మరణాన్ని పొందకుండానే కొనిపోబడ్డాడు; “దేవుడు అతన్ని తీసుకెళ్లారు కాబట్టి అతడు కనబడలేదు.”#11:5 ఆది 5:24 అతడు కొనిపోబడక ముందు అతడు దేవుని సంతోషపెట్టినవానిగా ప్రశంసించబడ్డాడు. 6విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం ఎందుకంటే, దేవుని దగ్గరకు వచ్చే ప్రతివాడు దేవుడు ఉన్నాడని, తన కోసం ఆసక్తితో వెదకేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి.
7విశ్వాసం ద్వారానే నోవహు అప్పటివరకు చూడనివాటి గురించి హెచ్చరించబడి పవిత్ర భయం కలిగినవాడై తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను నిర్మించాడు. తన విశ్వాసం వల్లనే అతడు లోకాన్ని ఖండిస్తూ విశ్వాసంతో కొనసాగుతూ నీతికి వారసుడయ్యాడు.
8విశ్వాసం ద్వారానే అబ్రాహాము, తాను స్వాస్థ్యంగా పొందబోతున్న ప్రదేశానికి వెళ్లమని పిలువబడినపుడు ఆ పిలుపుకు లోబడి తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియకపోయినా అతడు బయలుదేరి వెళ్లాడు. 9విశ్వాసం ద్వారానే దేవుడు తనకు వాగ్దానం చేసిన దేశంలో పరదేశిలా గుడారంలో నివసించాడు, అతనితో పాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు యాకోబులు కూడా అలాగే చేశారు. 10ఎందుకంటే అతడు ఎదురుచూస్తున్నది పునాదులుగల పట్టణం కోసం, దానికి దేవుడే శిల్పి నిర్మాణకుడు. 11వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని శారా నమ్మింది కాబట్టి శారాకు పిల్లలను కనే వయస్సు దాటిపోయినా, విశ్వాసం ద్వారానే ఆమె#11:11 లేదా అబ్రాహాము పిల్లలను కనలేనంత ముసలివాడు శారా కూడా తల్లికాలేని స్ధితిలో ఉన్నప్పటికీ విశ్వాసం వల్లనే అబ్రాహాము తండ్రి కాగలిగాడు బిడ్డను కనగలిగింది. 12చనిపోయినవానితో సమానమైన ఈ ఒక్క మనుష్యుని నుండే ఆకాశంలోని నక్షత్రాల సంఖ్యలా, సముద్రతీరంలోని ఇసుక రేణువుల్లా లెక్కకు మించిన సంతానం కలిగింది.
13వీరందరు చనిపోయినా, విశ్వాసం ద్వారానే ఇంకా జీవిస్తున్నారు. వాగ్దానం చేసిన వాటిని వారు పొందలేదు; వారు కేవలం దూరం నుండి చూసి వాటిని ఆహ్వానించి, ఈ భూమిపై తాము విదేశీయులమని అపరిచితులమని ఒప్పుకున్నారు. 14అలాంటి విషయాలు చెప్పే ప్రజలు తమ స్వదేశం కోసం చూస్తున్నారని స్పష్టం చేస్తారు. 15వారు తాము వదిలి వచ్చిన దేశం గురించి ఆలోచిస్తూ ఉంటే, వారు తిరిగి వెళ్లడానికి అవకాశం కలిగి ఉండేవారు. 16అయితే, వారు అంతకంటే ఉత్తమమైన దేశాన్ని అంటే పరలోకసంబంధమైన దేశం కోసం ఆరాటపడ్డారు. కాబట్టి వారి దేవున్ని వారి చేత పిలిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. ఎందుకంటే ఆయన వారికి ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు.
17-19దేవుడు అబ్రాహామును పరీక్షించినపుడు, విశ్వాసం ద్వారానే అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడు. “ఇస్సాకు మూలంగానే నీ సంతానం లెక్కించబడుతుంది”#11:17-19 ఆది 21:12 అని దేవుడు అతనితో చెప్పినప్పటికి, వాగ్దానాలను పొందిన అబ్రాహాము తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. చనిపోయినవారిని సహితం లేపడానికి దేవుడు శక్తిమంతుడని అబ్రాహాము భావించాడు, దానిని ఉపమానరీతిలో చెప్పాలంటే అతడు తన కుమారుడైన ఇస్సాకును మరణం నుండి తిరిగి పొందుకున్నాడు.
20విశ్వాసం ద్వారానే ఇస్సాకు తన సంతానమైన యాకోబు ఏశావులను వారి భవిష్యత్తు గురించి ఆశీర్వదించాడు.
21విశ్వాసం ద్వారానే యాకోబు తాను చనిపోయే సమయంలో యోసేపు కుమారులలో అందరిని ఆశీర్వదించి, తన చేతికర్ర మీద ఆనుకుని ఆరాధించాడు.
22విశ్వాసం ద్వారానే యోసేపు తాను చనిపోయే సమయంలో ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయుల ప్రయాణం గురించి చెప్పి, తన ఎముకలను సమాధి చేయమని ఆదేశాలిచ్చాడు.
23విశ్వాసం ద్వారానే మోషే తల్లిదండ్రులు అతడు పుట్టిన తర్వాత మూడు నెలల వరకు దాచి ఉంచారు, ఎందుకంటే అతడు సాధారణమైన బాలుడు కాడని వారు గ్రహించారు, రాజాజ్ఞకు వారు భయపడలేదు.
24విశ్వాసం ద్వారానే మోషే, పెరిగి పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోడానికి నిరాకరించాడు. 25అతడు అశాశ్వతమైన పాపభోగాలను అనుభవించేకంటే దేవుని ప్రజలతో పాటు శ్రమ పొందడాన్ని ఎంచుకున్నాడు. 26క్రీస్తు కొరకైన అవమానాన్ని ఈజిప్టు ధనం కన్నా గొప్ప విలువైనదిగా భావించాడు, ఎందుకంటే అతడు తన బహుమానం కోసం ఎదురు చూస్తున్నాడు. 27విశ్వాసం ద్వారానే మోషే, రాజు కోపాన్ని లెక్కచేయక, ఈజిప్టును విడిచి వెళ్లాడు; అతడు కనిపించని దేవుని చూస్తూ పట్టువదలక సాగిపోయాడు. 28అతడు విశ్వాసం ద్వారానే, పస్కాను ఆచరించి ఆ పస్కా బలి పశువు రక్తాన్ని పూయడం వలన జ్యేష్ఠ సంతానాన్ని సంహరించే మరణ దూత, ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ సంతానాన్ని ముట్టకుండా చేశాడు.
29విశ్వాసం ద్వారానే ప్రజలు ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై నడిచివెళ్లారు; అయితే ఈజిప్టువారు అలాగే నడిచి వారి వెనుక వెళ్లడానికి ప్రయత్నించి, మునిగిపోయారు.
30విశ్వాసం ద్వారానే ఇశ్రాయేలు సైన్యం యెరికో గోడల చుట్టూ ఏడు రోజులు తిరుగగా, యెరికో గోడలు కూలిపోయాయి.
31విశ్వాసం ద్వారానే వేశ్యయైన రాహాబు, గూఢచారులను అతిథులుగా స్వీకరించింది కాబట్టి అవిధేయులతో#11:31 లేదా, అవిశ్వాసులు పాటు చంపబడకుండా రక్షించబడింది.
32ఇంకా నేనేం చెప్పాలి? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనేవారి గురించి, ప్రవక్తల గురించి వివరించడానికి నాకు సమయం లేదు. 33వారు విశ్వాసం ద్వారానే రాజ్యాలను జయించారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానఫలాన్ని పొందారు, సింహాల నోళ్లను మూయించారు, 34తీవ్రమైన అగ్ని జ్వాలలను చల్లార్చారు, ఖడ్గపు అంచు నుండి తప్పించుకున్నారు; వారికి వారి బలహీనతే బలంగా మార్చబడింది; వారు యుద్ధాలలో మహాశక్తివంతులై శత్రు సైన్యాలను ఓడించారు. 35కొందరు స్త్రీలు చనిపోయిన తమ వారిని తిరిగి సజీవులుగా పొందారు. హింసించబడినవారు ఇంకా కొందరు దేవునితో శ్రేష్ఠమైన పునరుత్థానాన్ని పొందడానికి ఆ హింసను తప్పించుకోలేదు. 36కొందరు ఎగతాళిచేయబడి కొరడా దెబ్బలు తిన్నారు, సంకెళ్ళతో బంధించబడ్డారు. 37వారు చంపబడటానికి రాళ్లతో కొట్టబడ్డారు,#11:37 కొ.ప్రా.ప్ర.లలో వారిని శోధించడానికి రాళ్లు వేశారు రంపాలచేత భాగాలుగా కోయబడ్డారు, కత్తితో చంపబడ్డారు. గొర్రెల మేకల చర్మాలను కప్పుకుని, శ్రమలు హింసలు పొందుతూ దరిద్రుల్లా బాధలు అనుభవించారు. 38ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు. వారు ఎడారుల్లో, పర్వతాల్లో, గుహల్లో, సొరంగాల్లో తిరుగుతూ జీవించారు.
39వీరందరు వారి విశ్వాసం ద్వారానే ఎంతో మెప్పుపొందినా కాని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు పొందలేదు, 40ఎందుకంటే, కేవలం మనతో మాత్రమే కలిపి వారిని పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు మన కోసం మరింత ఉన్నతమైన ప్రణాళిక నిర్ణయించారు.
Currently Selected:
హెబ్రీ పత్రిక 11: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.