YouVersion Logo
Search Icon

హోషేయ 4

4
ఇశ్రాయేలుపై అభియోగం
1ఇశ్రాయేలీయులారా, యెహోవా వాక్కు వినండి,
యెహోవా ఈ దేశ వాసులైన మీమీద
నేరం మోపుతున్నారు:
“ఈ దేశంలో నమ్మకత్వం, ప్రేమ
దేవుని గురించిన జ్ఞానం అనేవి లేవు.
2శపించడం,#4:2 అంటే, శాపం పలకడం అబద్ధాలు చెప్పడం, హత్య చేయడం,
దొంగిలించడం, వ్యభిచారం చేయడం మాత్రమే ఉన్నాయి;
వారు దౌర్జన్యాలు మానలేదు,
నిత్యం రక్తపాతం జరుగుతూ ఉంది.
3ఈ కారణంచేత దేశం ఎండిపోతుంది,
అందులో నివసించేవారు నీరసించి పోతున్నారు;
అడవి జంతువులు, ఆకాశపక్షులు,
సముద్రపు చేపలు నశించిపోతున్నాయి.
4“అయితే ఏ ఒకరిపై నేరం మోపకండి,
ఏ ఒక్కరు ఇంకొకరిని నిందించకండి,
ఎందుకంటే మీ ప్రజలు
యాజకుని మీద నేరం మోపుతారు.
5మీరు పగలు రాత్రులు తడబడతారు,
ప్రవక్తలు మీతో కలిసి తడబడతారు,
కాబట్టి నేను నీ తల్లిని నాశనం చేస్తాను.
6జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు.
“మీరు జ్ఞానాన్ని త్రోసివేశారు కాబట్టి,
నేను కూడా మిమ్మల్ని నా యాజకులుగా ఉండకుండా త్రోసివేస్తున్నాను;
మీరు మీ దేవుని ఉపదేశాన్ని పట్టించుకోలేదు కాబట్టి,
నేను కూడా మీ పిల్లలను పట్టించుకోను.
7యాజకుల సంఖ్య పెరిగిన కొద్దీ,
వారు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు;
వారి ఘనతను అవమానంగా మారుస్తాను.
8నా ప్రజల పాపాన్ని ఆహారంగా చేసుకుంటారు
వారి దుష్టత్వం ఎక్కువ కావాలని కోరుకుంటారు.
9కాబట్టి ప్రజలు జరిగినట్లే యాజకులకు జరుగుతుంది.
వారి విధానాలను బట్టి వారిద్దరిని నేను శిక్షిస్తాను
వారి క్రియలకు తగిన ప్రతిఫలం వారికిస్తాను.
10“వారు తింటారు, కాని తృప్తి పొందరు;
వారు వ్యభిచారం చేస్తారు, కాని అభివృద్ధి చెందరు,
ఎందుకంటే వారు యెహోవాను వదిలేశారు,
తమను తాము 11వ్యభిచారానికి అప్పగించుకున్నారు;
పాత ద్రాక్షరసం, క్రొత్త ద్రాక్షరసం
వారి మతిని పోగొట్టాయి.
12నా ప్రజలు చెక్క విగ్రహాన్ని సంప్రదిస్తారు,
సోదె చెప్పే వాని కర్ర వారితో మాట్లాడుతుంది.
వ్యభిచార ఆత్మ వారిని చెదరగొడుతుంది;
వారు తమ దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు.
13వారు పర్వత శిఖరాల మీద బలులు అర్పిస్తారు
కొండలమీద ధూపం వేస్తారు,
సింధూర, చినారు, మస్తకి వృక్షాల క్రింద
నీడ మంచిగా ఉన్నచోట బలులు అర్పిస్తారు.
కాబట్టి మీ కుమార్తెలు వేశ్యలయ్యారు
మీ కోడళ్ళు వ్యభిచారిణులయ్యారు.
14“మీ కుమార్తెలు వేశ్యలు అయినందుకు,
నేను వారిని శిక్షించను,
మీ కోడళ్ళు వ్యభిచారం చేసినందుకు,
నేను వారిని శిక్షించను
ఎందుకంటే, మనుష్యులు వ్యభిచారిణులుతో పోతారు,
క్షేత్ర వ్యభిచారులతో పాటు బలులు అర్పిస్తారు,
గ్రహింపు లేని ప్రజలు నాశనమవుతారు.
15“ఇశ్రాయేలూ, నీవు వ్యభిచారం చేసినా సరే,
యూదా అపరాధం చేయకూడదు.
“గిల్గాలుకు వెళ్లవద్దు;
బేత్-ఆవెనుకు#4:15 బేత్-ఆవెను అంటే దుష్టత్వం గల ఇల్లు వెళ్లవద్దు.
‘యెహోవా జీవం తోడు’ అని ఒట్టు పెట్టుకోవద్దు.
16పొగరుబోతు పెయ్యలా
ఇశ్రాయేలీయులు మొండిగా ఉన్నారు.
అలాగైతే యెహోవా వారిని విశాల మైదానంలో
గొర్రెపిల్లలను మేపినట్టు ఎలా పోషిస్తారు?
17ఎఫ్రాయిం విగ్రహాలతో కలుసుకున్నాడు;
అతన్ని అలాగే వదిలేయండి!
18వారి పానీయాలు అయిపోయినా,
వారి వ్యభిచారం కొనసాగిస్తున్నారు;
వారి పాలకులు సిగ్గుమాలిన విధానాలను ఎంతో ఇష్టపడతారు.
19సుడిగాలి వారిని చెదరగొడుతుంది,
వారి బలుల వలన వారికి అవమానం కలుగుతుంది.

Currently Selected:

హోషేయ 4: OTSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in