యెషయా 44
44
ఏర్పరచుకోబడ్డ ఇశ్రాయేలు
1“అయితే నా సేవకుడవైన యాకోబూ,
నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలూ, విను.
2నిన్ను పుట్టించి, గర్భంలో నిన్ను నిర్మించి
నీకు సహాయం చేసేవాడైన
యెహోవా చెప్పే మాట ఇదే:
నా సేవకుడవైన యాకోబూ,
నేను ఏర్పరచుకున్న యెషూరూను#44:2 యెషూరూను అంటే యథార్థవంతుడు, అంటే, ఇశ్రాయేలు భయపడకు.
3నేను దాహంతో ఉన్న దేశం మీద నీళ్లు,
ఎండిన భూమి మీద నీటి ప్రవాహాలను కుమ్మరిస్తాను.
నీ సంతానంపై నా ఆత్మను,
నీ వారసులపై నా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను.
4వారు మైదానంలో గడ్డిలా పెరుగుతారు,
నీటికాలువల దగ్గర నాటిన నిరవంజి చెట్లలా ఎదుగుతారు.
5కొంతమంది, ‘నేను యెహోవా వాడను’ అని అంటారు;
ఇతరులు యాకోబు పేరుతో తమను తాము పిలుచుకుంటారు;
ఇంకా కొందరు తమ చేతిపై ‘యెహోవా వారము’ అని రాసుకుని
ఇశ్రాయేలు పేరును పెట్టుకుంటారు.
విగ్రహాలు కాదు, యెహోవాయే
6“ఇశ్రాయేలీయుల రాజు, విమోచకుడు,
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే:
నేను మొదటివాడను చివరివాడను;
నేను తప్ప ఏ దేవుడు లేడు.
7నాలా ఎవరు ఉన్నారు? అతడు ప్రకటించాలి.
నేను నా మొదటి ప్రజలను నియమించినప్పటి నుండి ఏమి జరిగిందో,
ఇంకా ఏమి జరగబోతుందో
అతడు తెలియజేయాలి, నా ముందు ఉంచాలి.
అవును ఏమి జరగబోతుందో వారు తెలియజేయాలి.
8మీరు బెదరకండి, భయపడకండి.
చాలా కాలం క్రితం నేను ఈ విషయం చెప్పి మీకు ప్రకటించలేదా?
మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా?
నేను తప్ప, ఆశ్రయ దుర్గమేదీ లేదు. ఉన్నట్లు నేనెరుగను.”
9విగ్రహాలను చేసే వారందరు వట్టివారు.
వారు నిధిగా ఉంచిన వస్తువులు పనికిరానివి.
వారి కోసం మాట్లాడేవారు గ్రుడ్డివారు;
వారు తెలివిలేనివారు, వారు సిగ్గుపరచబడతారు.
10ఎందుకు పనికిరాని విగ్రహాన్ని పోతపోసిన
దానినొక దేవునిగా రూపించేవాడు ఎవడు?
11అలా చేసే ప్రజలందరూ సిగ్గుపరచబడతారు.
ఆ శిల్పకారులు కేవలం మనుష్యులే.
వారందరు కలిసివచ్చి నిలబడాలి;
వారు భయానికి గురై సిగ్గుపడతారు.
12కమ్మరి తన పనిముట్టు తీసుకుని
దానితో నిప్పుల మీద పని చేస్తాడు;
సుత్తితో విగ్రహానికి రూపిస్తాడు
తన చేతి బలంతో దానిని తయారుచేస్తాడు.
అతనికి ఆకలి వేస్తుంది, అతని బలం తగ్గిపోతుంది.
అతడు నీళ్లు త్రాగడు, సొమ్మసిల్లిపోతాడు.
13వడ్రంగి నూలు త్రాడుతో కొలతలు వేసి
రూపం యొక్క రూపురేఖలను గుర్తిస్తాడు;
అతడు ఉలితో దానిని చెక్కి
దిక్సూచితో గుర్తులు పెడతాడు.
క్షేత్రంలో అది ఉండడానికి
దానికి నర రూపాన్ని ఇచ్చి
నర సౌందర్యం కలదానిగా తయారుచేస్తాడు.
14అతడు దేవదారు చెట్లను నరుకుతాడు
సరళ వృక్షాన్ని గాని సింధూర వృక్షాన్ని గాని తీసుకుంటాడు.
అతడు అడవి చెట్ల మధ్యలో దానిని ఎదిగేటట్లు చేస్తాడు,
దేవదారు చెట్టు నాటుతాడు, వర్షం దానిని పెంచుతుంది.
15ఒక మనుష్యుడు దాని కట్టెలను మంట పెట్టడానికి ఉపయోగిస్తాడు;
అతడు ఆ కట్టెలలో కొన్ని తీసుకుని చలి కాచుకుంటాడు,
అవే కట్టెలతో అతడు నిప్పు రాజేసి రొట్టె కాల్చుకుంటాడు.
మిగిలిన కర్రతో ఒక దేవున్ని చేసికొని దానిని పూజిస్తాడు;
దానితో ఒక విగ్రహాన్ని చేసి దానికి నమస్కారం చేస్తాడు.
16సగం కట్టెలను నిప్పుతో కాల్చి
ఆ కట్టెల మీద తన ఆహారం వండుకుంటాడు.
దానిపై అతడు మాంసం వండుకుని తృప్తిగా తింటాడు.
అంతేకాదు, అతడు చలి కాచుకుంటూ,
“ఆహా! నాకు వెచ్చగా ఉంది; నాకు మంట కనబడుతుంది” అని అనుకుంటాడు.
17మిగిలిన దానితో అతడు తనకు దేవునిగా ఒక విగ్రహాన్ని చేసుకుంటాడు.
అతడు దానికి నమస్కారం చేసి పూజిస్తాడు.
“నీవే నా దేవుడవు! నన్ను రక్షించు!”
అని దానికి ప్రార్థిస్తాడు.
18ఈ మనుష్యులకు ఏమీ తెలియదు, దేన్ని గ్రహించరు;
చూడకుండ వారి కళ్లు కప్పబడ్డాయి,
గ్రహించకుండా వారి మనస్సులు మూయబడ్డాయి.
19ఎవరూ ఆలోచించడం లేదు,
“దీనిలో సగం ఇంధనంగా వాడాను;
దాని నిప్పుల మీద రొట్టె కూడా కాల్చాను,
నేను మాంసం వండుకుని తిన్నాను.
నేను మిగిలిన దానితో అసహ్యమైన దానిని చేయాలా?
నేను చెట్టు మొద్దుకు నమస్కారం చేయాలా?” అని
ఆలోచించడానికి ఎవరికీ తెలివి గాని వివేచన గాని లేదు.
20అలాంటివాడు బూడిద తింటాడు; మోసపూరితమైన హృదయం అతన్ని దారి తప్పిస్తుంది;
తనను తాను రక్షించుకోలేడు,
“నా కుడి చేతిలో ఉన్నది అబద్ధం కాదా?” అని అనలేడు.
21“యాకోబూ, వీటిని గుర్తు చేసుకో,
ఎందుకంటే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు.
నేను నిన్ను నిర్మించాను, నీవు నా సేవకుడవు;
ఇశ్రాయేలూ, నేను నిన్ను మరచిపోను.
22మేఘం విడిపోవునట్లు నీ దోషాలను
ఉదయకాలపు మంచు మబ్బు తొలగిపోయేలా నీ పాపాలను, తుడిచివేశాను.
నేను నిన్ను విడిపించాను.
నా దగ్గరకు తిరిగి రా.”
23యెహోవా దీనిని చేశారు కాబట్టి ఆకాశాల్లారా, ఆనందంతో పాడండి;
భూమి లోతుల్లారా, బిగ్గరగా అరవండి.
పర్వతాల్లారా, అరణ్యమా,
నీలో ఉన్న ప్రతి చెట్టు సంగీత నాదం చేయండి.
యెహోవా యాకోబును విడిపించారు
ఆయన ఇశ్రాయేలులో తన మహిమను చూపిస్తారు.
యెరూషలేము నివాస స్థలంగా మారుట
24“నిన్ను గర్భంలో రూపించిన నీ విమోచకుడైన
యెహోవా చెప్పే మాట ఇదే:
“యెహోవాను నేనే
అన్నిటిని సృష్టించాను,
నేనే ఆకాశాలను విశాలపరిచాను
నేను నేనే భూమికి ఆకారమిచ్చాను.
25నేనే అబద్ధ ప్రవక్తల సూచనలను భంగం చేస్తాను,
సోదె చెప్పేవారిని వెర్రివారిగా చేస్తాను.
జ్ఞానులను వెనుకకు త్రిప్పి
వారి చదువును వ్యర్థం చేసేది నేనే.
26నా సేవకుని మాటలను స్థిరపరచి
నా దూతల ఆలోచనను నెరవేర్చేది నేనే.
“యెరూషలేము నివాస స్థలంగా అవుతుందని
యూదా పట్టణాలు మరలా కట్టబడతాయని
వాటిలో పాడైన స్థలాలను బాగుచేయబడతాయని చెప్పాను.
27నేను నీటి లోతులతో, ‘ఎండిపో,
నీ ప్రవాహాలను ఎండిపోయేటట్లు చేస్తాను’ అని చెప్పాను.
28నేను కోరెషు గురించి, ‘అతడు నా కాపరి,
నా ఇష్టాన్నంతటిని నెరవేరుస్తాడు’ అని చెప్పాను.
అతడు, ‘యెరూషలేము తిరిగి కట్టబడాలి’ అని
‘మందిరం పునాదులు వేయబడాలి’ అని చెప్తాడు.”
Currently Selected:
యెషయా 44: OTSA
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.