యెషయా 7
7
ఇమ్మానుయేలు గురించి సూచన
1యూదా రాజైన ఉజ్జియాకు పుట్టిన యోతాము కుమారుడైన ఆహాజు కాలంలో సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చారు కాని అది వారు జయించలేకపోయారు.
2అప్పుడు దావీదు ఇంటివారికి, “అరాము ఎఫ్రాయిముతో పొత్తు పెట్టుకుంది” అని తెలియజేయబడింది; కాబట్టి గాలికి అడవి చెట్లు కదిలినట్లు ఆహాజు, అతని ప్రజల హృదయాలు వణికాయి.
3అప్పుడు యెహోవా యెషయాతో ఇలా అన్నారు, “ఆహాజును కలుసుకోడానికి నీవు, నీ కుమారుడైన షెయార్యాషూబు#7:3 షెయార్యాషూబు అంటే మిగిలినవారు తిరిగి వస్తారు చాకలి రేవుకు వెళ్లే దారిలో ఉన్న పై కోనేటి కాలువ చివరికి వెళ్లండి. 4అతనితో, ‘జాగ్రత్త, నెమ్మదిగా ఉండు, భయపడకు. పొగరాజుకుంటున్న ఈ రెండు కాగడాలకు అనగా రెజీను, అరాము, రెమల్యా కుమారుడైన పెకహు యొక్క తీవ్రమైన కోపానికి అధైర్యపడకు. 5అరాము, ఎఫ్రాయిం, రెమల్యా కుమారుడు నీకు కీడు చేయాలని కుట్రపన్ని, 6“మనం యూదాపై దాడి చేద్దాము; మనం దానిని చీల్చివేసి, మన మధ్యలో పంచుకుందాం, టాబెయేలు కుమారున్ని దానికి రాజుగా చేద్దాం” అని చెప్పుకున్నారు.’ ” 7అయితే ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
“అది నిలబడదు,
అలా జరుగదు.
8ఎందుకంటే అరాము రాజధాని దమస్కు.
దమస్కు రాజు రెజీను మాత్రమే.
అరవై అయిదు సంవత్సరాలు కాకముందే
ఎఫ్రాయిం ఒక జాతిగా ఉండకుండా నాశనం అయిపోతుంది.
9ఎఫ్రాయిముకు సమరయ రాజధాని,
సమరయకు రెమల్యా కుమారుడు రాజు.
మీరు మీ విశ్వాసంలో స్థిరంగా ఉండకపోతే
మీరు క్షేమంగా ఉండలేరు.”
10యెహోవా ఆహాజుతో మరలా మాట్లాడుతూ, 11“నీ దేవుడైన యెహోవాను ఒక సూచన అడుగు. అది పాతాళమంత లోతైనా సరే, ఆకాశమంత ఎత్తైనా సరే” అన్నారు.
12అయితే ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు.
13అప్పుడు యెషయా, “దావీదు కుటుంబమా! వినండి. మనుష్యుల ఓపికను పరీక్షించడం సరిపోదని, నా దేవుని ఓపికను కూడా పరీక్షిస్తున్నారా? 14కాబట్టి, ప్రభువే స్వయంగా మీకు ఒక సూచన ఇస్తారు: ఇదిగో ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు#7:14 ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని పేరు పెడతారు. 15తప్పును తిరస్కరించి, సరియైనది ఎంచుకోవడం తెలిసినప్పుడు అతడు పెరుగు, తేనె తింటాడు. 16ఎందుకంటే తప్పును తిరస్కరించి సరియైనది ఎంచుకునే తెలివి ఆ బాలునికి రాకముందు నిన్ను భయపెట్టే ఆ ఇద్దరు రాజుల దేశాలు పాడుచేయబడతాయి. 17యెహోవా నీ మీదికి, నీ ప్రజలమీదికి, నీ తండ్రి ఇంటి మీదికి, ఎఫ్రాయిం యూదా నుండి విడిపోయిన రోజు నుండి ఇప్పటివరకు రాని రోజులను రప్పిస్తారు. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పిస్తారు” అని అన్నాడు.
అష్షూరు యెహోవా పనిముట్టు
18ఆ రోజున ఈజిప్టులో నైలు నది పాయల నుండి ఈగలను, అష్షూరు దేశం నుండి కందిరీగలను యెహోవా ఈలవేసి పిలుస్తారు. 19అవన్నీ వచ్చి మెట్ట కనుమలలో, రాళ్ల పగుళ్లలో, ముళ్ళపొదల్లో, పచ్చికబయళ్లలో నివసిస్తాయి. 20ఆ రోజున యెహోవా యూఫ్రటీసు నది అవతలి నుండి కూలికి తెచ్చిన మంగలకత్తితో అనగా, అష్షూరు రాజుతో మీ తలవెంట్రుకలు కాళ్లవెంట్రుకలు క్షౌరం చేయిస్తారు. అది మీ గడ్డాలను కూడా గీసివేస్తారు. 21ఆ రోజున ఒకనికి ఒక చిన్న ఆవు రెండు గొర్రెలు ఉంటాయి. 22అవి సమృద్ధిగా ఇచ్చిన పాలవలన అతడు తినడానికి పెరుగు ఉంటుంది. ఆ దేశంలో మిగిలిన వారందరు పెరుగు, తేనె తింటారు. 23ఆ రోజున వెయ్యి వెండి షెకెళ్ళు#7:23 అంటే, సుమారు 12 కి. గ్రా. లు విలువ కలిగిన వెయ్యి ద్రాక్షతీగెలు ఉన్న ప్రతిచోట గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటాయి. 24ఆ దేశమంతా గచ్చపొదలు ముళ్ళతో నిండి ఉంటుంది కాబట్టి బాణాలు విల్లులు పట్టుకుని వేటగాళ్లు అక్కడికి వెళ్తారు. 25గచ్చపొదలకు, ముళ్ళకు భయపడి పారతో సాగుచేసిన కొండలన్నిటికి మీరు దూరంగా ఉంటారు; ఆ స్థలాలు పశువులు తిరగడానికి, గొర్రెలు త్రొక్కడానికి ఉపయోగపడతాయి.
Currently Selected:
యెషయా 7: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.