YouVersion Logo
Search Icon

సంఖ్యా 35

35
లేవీయులకు పట్టణాలు
1మోయాబు సమతల మైదానాల్లో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతంలో యెహోవా మోషేతో అన్నారు, 2“ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే స్వాస్థ్యం నుండి పట్టణాలను లేవీయులు నివసించడానికి ఇమ్మని ఆజ్ఞాపించు. పట్టణాల చుట్టూ ఉన్న పచ్చికబయళ్లు వారికి ఇవ్వాలి. 3అప్పుడు వారు నివసించడానికి పట్టణాలు కలిగి ఉంటారు వారి సొంత పశువుల కోసం, ఇతర జంతువుల కోసం పచ్చికబయళ్లు ఉంటాయి.
4“లేవీయులకు ఇచ్చే పట్టణాల చుట్టూ ఉండే పచ్చికబయళ్లు పట్టణ ప్రాకారానికి 1,000 క్యూబిట్‌ల#35:4 అంటే, సుమారు 450 మీటర్లు దూరంలో ఉంటుంది. 5పట్టణం బయట తూర్పు దిక్కున 2,000 క్యూబిట్‌ల దక్షిణ దిక్కున 2,000 క్యూబిట్‌ల, పడమటి దిక్కున 2,000 క్యూబిట్‌ల, ఉత్తర దిక్కున 2,000 క్యూబిట్‌లు కొలవాలి, దాని కేంద్రంగా పట్టణం ఉంటుంది. వారు ఈ భూభాగాన్ని పట్టణాలకు పచ్చికబయళ్లుగా కలిగి ఉంటారు.
ఆశ్రయపురాలు
6“లేవీయులకు ఇచ్చే వాటిలో ఆరు పట్టణాలు ఆశ్రయపురాలుగా ఉండాలి. ప్రమాదవశాత్తు ఎవరినైనా చంపితే ఆ వ్యక్తి ఇక్కడకు పారిపోవచ్చు. వీటితో సహా 42 పట్టణాలు వారికి ఇవ్వాలి. 7మొత్తం 48 పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో సహా లేవీయులకు ఇవ్వాలి. 8ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే వాటిలో లేవీయులకు ఇచ్చే పట్టణాలు ప్రతి గోత్రం వారి వారసత్వం నుండి ఇవ్వాలి. ఎక్కువ పట్టణాలు గల గోత్రం నుండి ఎక్కువ పట్టణాలు, తక్కువ ఉన్న వారి నుండి తక్కువ తీసుకోవాలి.”
9తర్వాత యెహోవా మోషేతో ఇలా మాట్లాడారు: 10“ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను దాటి కనానుకు వెళ్లినప్పుడు, 11కొన్ని పట్టణాలను ఆశ్రయపురాలుగా ఎన్నుకోండి. ప్రమాదవశాత్తు ఒకరు ఎవరినైన చంపితే, వాటికి పారిపోయి ఆశ్రయం పొందవచ్చు. 12ఆ పట్టణాలు ప్రతీకారం తీర్చుకునే వారి నుండి కాపాడుకోడానికి ఆశ్రయంగా ఉంటాయి, తద్వారా హత్యకు పాల్పడిన ఎవరైనా సమాజం ముందు విచారణకు రాకముందు చంపబడరు. 13ఈ ఆరు పట్టణాలు మీ ఆశ్రయ పట్టణాలుగా ఉంటాయి. 14మూడు యొర్దానుకు ఇటువైపు, మూడు కనాను దేశంలో ఆశ్రయపురాలుగా ఇవ్వాలి. 15ఈ ఆరు పట్టణాలు ఇశ్రాయేలీయులు వారి మధ్య నివసించే విదేశీయులకు ఆశ్రయపురాలుగా ఉంటాయి, తద్వార, ప్రమాదవశాత్తు ఒకరు ఎవరినైన చంపితే, వాటికి పారిపోయి ఆశ్రయం పొందవచ్చు.
16“ ‘ఎవరైనా ఇనుప వస్తువుతో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి. 17లేదా ఒకవేళ ఎవరైనా ఒక రాయితో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి. 18లేదా ఒకవేళ ఎవరైనా ఒక చెక్క వస్తువుతో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి. 19పగ తీర్చుకునేవాడు ఆ హంతకునికి మరణశిక్ష వేయాలి; పగ తీర్చుకునేవాడు హంతకున్ని పట్టుకున్నప్పుడు అతన్ని చంపుతాడు. 20ఎవరైనా పగతో నెట్టినా లేదా వారివైపు ఉద్దేశపూర్వకంగా చేతిలో ఉన్నదానిని వారి మీదికి విసిరివేసినా, వారు చనిపోతే 21లేదా శత్రుత్వం బట్టి ఒకరిని పిడికిలితో కొడితే ఆ వ్యక్తి చస్తే, వాడు మరణశిక్ష పొందాలి; ఆ వ్యక్తి హంతకుడు. పగ తీర్చుకునేవాడు అతన్ని కలిసినప్పుడు అతన్ని చంపుతాడు.
22“ ‘అయితే ఎవరైనా శత్రుత్వం లేకుండ ఎవరినైన అకస్మాత్తుగా నెట్టినా, లేదా వారివైపు అనుకోకుండ ఏదైనా విసిరినా, 23లేదా చూడకుండ బరువైన రాయి వేసినా, వారు చనిపోతే, వేసినవానికి వారు శత్రువు కాదు హాని చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి, 24సమాజం నిందితునికి, పగతీర్చుకునే వానికి మధ్య ఉండి ఈ చట్టాల ప్రకారం తీర్పు తీర్చాలి. 25సమాజం ఆ నిందితుడిని పగతీర్చుకునే వాని నుండి కాపాడి తిరిగి అతడు పారిపోయిన ఆశ్రయపురానికి పంపించాలి. నిందితుడు పరిశుద్ధ నూనెతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అక్కడే ఉండాలి.
26“ ‘ఒకవేళ నిందితుడు తాను వెళ్లిన ఆశ్రయపురం నుండి బయటకు వెళ్తే, 27పగ తీర్చుకునేవాడు అతన్ని ఆశ్రయపురం బయట చూస్తే, అతన్ని చంపవచ్చు, అది హత్యగా లెక్కించబడదు. 28ప్రధాన యాజకుడు చనిపోయే వరకు నిందితుడు ఆశ్రయపురం లోనే ఉండాలి. ఆ తర్వాత అతడు తన స్వస్థలానికి వెళ్లిపోవచ్చు.
29“ ‘ఇది మీరు ఎక్కడ నివసించినా, రాబోయే తరాలలో మీ కోసం చట్టబద్ధమైన నియమంగా ఉంటుంది.
30“ ‘సాక్షుల నోటి మాటను బట్టి హంతకులు మరణశిక్ష పొందుతారు. అయితే ఒక్క సాక్షి సాక్ష్యాన్ని బట్టి ఏ ఒక్కరికీ మరణశిక్ష విధించబడకూడదు.
31“ ‘శిక్ష పొందాల్సిన హంతకుల జీవితం కోసం విమోచన క్రయధనం స్వీకరించకూడదు. వారు మరణశిక్ష పొందాలి.
32“ ‘ఆశ్రయపురానికి పారిపోయినవారి నుండి విమోచన క్రయధనం స్వీకరించకూడదు, ప్రధాన యాజకుడు చనిపోకముందు వారిని తమ స్వస్థలానికి పంపించవద్దు.
33“ ‘మీరున్న భూమిని కలుషితం చేయకండి. రక్తపాతం దేశాన్ని కలుషితం చేస్తుంది రక్తపాతం చేసిన ఆ వ్యక్తి రక్తం ద్వారానే తప్ప ఆ భూమికి ప్రాయశ్చిత్తం చేయలేము. 34మీరు నివసించే, నేను నివసించే భూమిని అపవిత్రం చేయవద్దు, ఎందుకంటే, యెహోవానైన నేను, ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను.’ ”

Currently Selected:

సంఖ్యా 35: OTSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in