YouVersion Logo
Search Icon

సామెతలు 14

14
1జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది,
కాని మూర్ఖురాలు తన స్వహస్తాలతో తన ఇల్లు కూల్చివేస్తుంది.
2యెహోవాకు భయపడేవారు యథార్థంగా నడుస్తారు,
ఆయనను తృణీకరించేవారు వారి మార్గాల్లో వంచకులు.
3మూర్ఖుల నోరు అరుస్తుంది,
జ్ఞానం గలవారి పెదవులు వారిని కాపాడతాయి.
4ఎద్దులు లేనిచోట, పశువుల దొడ్డి ఖాళీగా ఉంటుంది,
కాని ఒక ఎద్దు బలం చేత విస్తారమైన పంట వస్తుంది.
5నమ్మకమైన సాక్షులు మోసం చేయరు,
కాని అబద్ధ సాక్షులు అబద్ధాలు కుమ్మరిస్తారు.
6ఎగతాళి చేసేవారు జ్ఞానం వెదకుతారు కాని దొరకదు,
అయితే వివేకులకు తెలివి సులభంగా కలుగుతుంది.
7బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్లిపొమ్ము,
జ్ఞానపు మాటలు వానియందు కనబడవు కదా.
8వివేకవంతుల జ్ఞానం వారి మార్గాలను ఆలోచించడం,
కానీ మూర్ఖుల మూర్ఖత్వం మోసము.
9పాపానికి సవరణలు చేయడంలో మూర్ఖులు ఎగతాళి చేస్తారు,
కాని యథార్థవంతులు ఆయన నుండి దయ పొందుతారు.
10హృదయంలో ఉన్న బాధ దానికే తెలుస్తుంది,
దాని సంతోషంలో మరొకరు పాలివారు కాలేరు.
11దుష్టుల ఇల్లు నాశనమవుతుంది,
కాని యథార్థవంతుల గుడారం అభివృద్ధి చెందును.
12ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది,
అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.
13ఒకడు బయటకు నవ్వుతూ కనిపించినా, హృదయంలో బాధ ఉండవచ్చు
చివరికి సంతోషం దుఃఖంగా మారుతుంది.
14విశ్వాసభ్రష్టులు తమ క్రియలకు తగిన మూల్యం పొందుతారు,
మంచివారు వారి క్రియలకు తగిన బహుమానం పొందుతారు.
15బుద్ధిహీనులు దేన్నైనా నమ్ముతారు,
కానీ వివేకం కలవారు తన నడవడికను బాగుగా కనిపెడతారు.
16జ్ఞాని యెహోవాకు భయపడి చెడు నుండి తప్పుకుంటాడు,
మూర్ఖులు కోపిష్ఠులై కూడా భద్రంగా ఉన్నట్లు భావిస్తారు.
17తొందరగా కోప్పడేవారు మూర్ఖమైనవి చేస్తారు,
దుష్ట పన్నాగాలు వేసేవారు ద్వేషించబడతారు.
18జ్ఞానం లేనివారికి వారి మూర్ఖత్వమే ఆస్తి.
వివేకంగలవారు తెలివిని కిరీటంగా ధరించుకుంటారు.
19చెడ్డవారు మంచివారి ఎదుటను,
దుష్టులు నీతిమంతుల గుమ్మాల దగ్గర వంగుతారు.
20పేదవారు తన పొరుగువారికి అసహ్యులు,
ధనవంతులను ప్రేమించేవారు అనేకులు.
21తన పొరుగువానిని తిరస్కరించేవారు పాపులు,
బీదలకు దయ చూపేవాడు ధన్యుడు.
22కీడు తలపెట్టేవారు తప్పిపోతారు?
మేలు చేసేవారు, కృపా సత్యములను పొందుతారు.
23ఏ కష్టం చేసినను లాభమే కలుగును,
వట్టిమాటలు దరిద్రమునకు కారణము.
24జ్ఞానుల ఐశ్వర్యం వారికి కిరీటం,
బుద్ధిహీనుల మూర్ఖత్వం మూర్ఖత్వమే.
25నిజం పలికే సాక్షి ప్రాణాలను రక్షిస్తారు,
కానీ అబద్ధసాక్షి వట్టి మోసగాడు.
26యెహోవాకు భయపడేవారందరికి సురక్షితమైన కోట ఉంది,
వారి పిల్లలకు అది ఆశ్రయంగా ఉంటుంది.
27యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవపుఊట,
అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది.
28జనాభా ఎక్కువ ఉండడం చేత రాజులకు ఘనత వస్తుంది,
జనులు తగ్గిపోవడం రాజులకు నాశనకరము.
29ఎక్కువ ఓర్పు కలవారు మహా వివేకులు,
త్వరగా కోప్పడేవారు మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తారు.
30సమాధానం గల హృదయం శరీరానికి జీవం,
అసూయ ఎముకలకు కుళ్ళు.
31పేదవాని బాధపెట్టేవారు వాని సృష్టికర్తను నిందించేవారు,
బీదలను కనికరించేవారు ఆయనను ఘనపరిచేవారు.
32అపాయం వచ్చినప్పుడు దుష్టులు నశిస్తారు,
చనిపోయే సమయంలో కూడ నీతిమంతులకు దేవునిలో ఆశ్రయం దొరుకుతుంది.
33వివేకం గలవాని హృదయంలో జ్ఞానం నివాసం చేస్తుంది,
మూర్ఖుల మధ్య కూడా అది తనను తాను తెలియపరచుకుంటుంది.
34నీతి ఒక దేశాన్ని ఘనతకెక్కేలా చేస్తుంది,
పాపం ప్రజలకు అవమానం తెస్తుంది.
35జ్ఞానంగల సేవకుడు రాజులకు ఇష్టుడు,
అవమానకరమైన సేవకుడు రాజుకు కోపం రేపుతాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in