కీర్తనలు 104
104
కీర్తన 104
1నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.
యెహోవా నా దేవా, మీరు చాలా గొప్పవారు;
ఘనత ప్రభావాన్ని ధరించుకున్నారు.
2యెహోవా వెలుగును వస్త్రంలా ధరిస్తారు;
ఆయన ఒక గుడారంలా ఆకాశాన్ని విస్తరించి
3తన గదుల కిరణాలను వాటి నీటిపై వేస్తారు.
ఆయన మేఘాలను తన రథంగా చేసుకుని
వాయు రెక్కలపై స్వారీ చేస్తారు.
4ఆయన వాయువులను తనకు దూతలుగా,
అగ్ని జ్వాలలను తనకు సేవకులుగా చేస్తారు.
5భూమిని దాని పునాదులపై నిలిపారు;
అది ఎన్నటికి కదలదు.
6మీరు దానిని ఒక వస్త్రంలా నీటి అగాధాలతో కప్పారు;
జలాలు పర్వతాలకు పైగా నిలిచాయి.
7మీ మందలింపుతో జలాలు పారిపోయాయి,
మీ ఉరుముల ధ్వనికి పలాయనం చిత్తగించాయి;
8అవి పర్వతాలకు మీదుగా వెళ్లాయి,
అవి లోయల్లోకి దిగిపోయాయి,
వాటికి మీరు నిర్ణయించిన చోటుకు అవి చేరుకున్నాయి.
9అవి దాటలేని సరిహద్దును మీరు ఏర్పరిచారు;
అవి ఎన్నటికి భూమిని ముంచివేయవు.
10ఆయన ఊటలను కనుమలలోకి నీటిని కుమ్మరింపజేస్తారు;
అవి పర్వతాల మధ్య ప్రవహిస్తున్నాయి.
11అవి పొలాలలోని అడవి మృగాలకు నీరు అందిస్తాయి;
అడవి గాడిదలు తమ దాహం తీర్చుకుంటాయి.
12ఆ జలాల ప్రక్కన ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి;
కొమ్మల మధ్య అవి పాడతాయి.
13తన ఆకాశ గదుల్లో నుండి ఆయన పర్వతాలను తడుపుతారు;
ఆయన క్రియా ఫలం చేత భూమి తృప్తి చెందుతుంది.
14ఆయన పశువుల కోసం గడ్డి పెరిగేలా చేస్తున్నారు,
మనుష్యులు శ్రమించి సాగుచేయడానికి మొక్కలను మొలిపిస్తున్నారు,
అలా భూమి నుండి ఆహారాన్ని పుట్టిస్తున్నారు:
15మానవ హృదయాలకు సంతోషం కలిగించడానికి ద్రాక్షరసాన్ని,
వారి ముఖాలను ప్రకాశించేలా చేయడానికి నూనెను,
వారి హృదయాలను బలపరిచే ఆహారాన్ని ఇస్తున్నారు.
16యెహోవా వృక్షాలు,
లెబానోనులో దేవదారు చెట్లు చాలినంత నీరు కలిగి ఉన్నాయి.
17అక్కడ పక్షులు వాటిలో గూళ్ళు కట్టుకుంటాయి;
కొంగలు సరళ వృక్షాలపై నివాసముంటాయి.
18అడవి మేకపోతులు ఎత్తైన పర్వతాలమీద మేస్తూ ఉంటాయి;
కుందేళ్ళు బండ సందులను ఆశ్రయిస్తాయి.
19రుతువుల్ని సూచించడానికి ఆయన చంద్రుని చేశారు,
ఎప్పుడు అస్తమించాలో సూర్యునికి తెలుసు.
20మీరు చీకటి కలుగజేస్తారు, అది రాత్రి అవుతుంది,
అడవి మృగాలన్నీ వేట కోసం సంచరిస్తాయి.
21సింహాలు వాటి వేట కోసం గర్జిస్తాయి,
అవి దేవుని నుండి ఆహారం వెదకుతాయి.
22సూర్యుడు ఉదయించగానే, అవి వెళ్లిపోతాయి;
అవి గుహలకు వెళ్లి పడుకుంటాయి.
23అప్పుడు మనుష్యులు వారి పనులకు వెళ్లిపోతారు,
సాయంకాలం వరకు వారు కష్టపడతారు.
24యెహోవా! మీ కార్యాలు ఎన్నో!
మీ జ్ఞానంతో మీరు వాటన్నిటిని చేశారు;
భూమి అంతా మీ సృష్టితో నిండి ఉంది.
25అదిగో విశాలమైన, మహా సముద్రం,
అందులో లెక్కలేనన్ని జలచరాలు
దానిలో జీవులు చిన్నవి పెద్దవి ఉన్నాయి.
26అందులో ఓడలు ఇటు అటు తిరుగుతాయి,
సముద్రంలో ఆడుకోడానికి మీరు సృజించిన లెవియాథన్ అక్కడ ఉంది.
27సకాలంలో మీరు వాటికి వాటి ఆహారం పెడతారని,
జీవులన్నీ మీ వైపే చూస్తున్నాయి.
28మీరు దానిని వారికి ఇచ్చినప్పుడు,
అవి సమకూర్చుకుంటాయి;
మీరు గుప్పిలి విప్పి పెడుతుంటే
అవి తిని తృప్తి చెందుతాయి.
29మీ ముఖం మరుగైతే
అవి కంగారు పడతాయి;
మీరు వాటి ఊపిరిని ఆపివేసినప్పుడు,
అవి చనిపోయి మట్టి పాలవుతాయి.
30మీరు మీ ఆత్మను పంపినప్పుడు,
అవి సృజించబడ్డాయి,
మీరే భూతలాన్ని నూతనపరుస్తారు.
31యెహోవా మహిమ నిరంతరం ఉండును గాక;
యెహోవా తన క్రియలలో ఆనందించును గాక.
32ఆయన భూమిని చూస్తే, అది కంపిస్తుంది,
ఆయన పర్వతాలను తాకితే, అవి పొగలు గ్రక్కుతాయి.
33నా జీవితకాలమంతా నేను యెహోవాకు పాడతాను;
నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి నేను స్తుతిగానం చేస్తాను.
34నేను యెహోవాయందు ఆనందిస్తుండగా,
నా ధ్యానము ఆయనకు ఇష్టమైనదిగా ఉండును గాక.
35అయితే పాపులు భూమి మీద నుండి పూర్తిగా తుడిచివేయబడుదురు గాక
దుష్టులు ఇక ఉండక పోవుదురు గాక.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.
యెహోవాను స్తుతించు.#104:35 హెబ్రీలో హల్లెలూయా
Currently Selected:
కీర్తనలు 104: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.