YouVersion Logo
Search Icon

కీర్తనలు 106

106
కీర్తన 106
1యెహోవాను స్తుతించండి.#106:1 హెబ్రీలో హల్లెలూయా 48 వచనంలో కూడా
యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి;
ఆయన మారని ప్రేమ నిరంతరం నిలుస్తుంది.
2యెహోవా యొక్క గొప్ప కార్యాలను ఎవరు ప్రచురించగలరు?
ఆయన స్తుతిని సంపూర్ణంగా ఎవరు ప్రకటిస్తారు?
3న్యాయంగా ప్రవర్తించేవారు ధన్యులు,
వారు ఎల్లప్పుడు సరియైనది చేస్తారు.
4యెహోవా, మీ ప్రజలపై మీరు దయ చూపినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి,
మీరు వారిని రక్షించినప్పుడు నాకు సాయం చేయడానికి రండి,
5మీరు ఏర్పరచుకున్న వారి అభివృద్ధిని నేను ఆస్వాదించగలను,
మీ దేశము యొక్క ఆనందంలో పాలుపంచుకోగలను
మిమ్మల్ని స్తుతించడంలో మీ వారసులతో చేరతాను.
6మా పూర్వికుల్లాగే మేమూ పాపాలు చేశాము;
మేము తప్పు చేశాం దుష్టత్వంతో ప్రవర్తించాం.
7మా పూర్వికులు ఈజిప్టులో ఉన్నప్పుడు
నేను చేసిన అద్భుతాలను గ్రహించలేదు;
మీ దయాసమృద్ధిని వారు తలపోయ లేదు,
ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారు.
8అయినా ఆయన తన బలప్రభావాలను తెలియపరచడానికి,
తన పేరు కోసం వారిని రక్షించాడు.
9ఎర్ర సముద్రాన్ని గద్దించాడు. అది ఎండిపోయింది;
ఎడారిలో నడిచినట్లే జలాగాధంలో వారు నడిచారు.
దేవుడు వారిని నడిపించాడు.
10పగవారి బారి నుండి దేవుడే వారిని తప్పించాడు;
విడుదల ప్రసాదించాడు.
11విరోధులంతా నీటిలో మునిగి చచ్చారు.
ఒక్కడూ మిగల్లేదు.
12ఇశ్రాయేలీయులు అప్పుడు కాని దేవుని మాట నమ్మలేదు.
స్తుతిస్తూ పాటలు పాడారు.
13దేవుని క్రియలు వారు త్వరలోనే మరచిపోయారు.
ఆయన సలహాలను వారు లక్ష్యపెట్టు వారు కారు.
14ఎడారిలో పేరాశకు లోనయ్యారు;
పాడు ప్రదేశమది. దేవుడిని శోధించారు.
15దేవుడు వారి కోరిక తీర్చాడు,
అయినా వారి ప్రాణాలు క్షీణించిపోయాయి.
16దండులో మోషే మీద,
యెహోవాకు పరిశుద్ధుడైన, అహరోను మీద అసూయ ఏర్పడింది.
17భూమి నోరు తెరిచి దాతానును మ్రింగివేసింది;
అబీరాము గుంపును కప్పేసింది.
18వారి అనుచరులలో మంటలు చెలరేగాయి;
ఒక జ్వాల దుష్టులను కాల్చివేసింది.
19హోరేబు పర్వతం దగ్గర వారు దూడ విగ్రహం చేయించుకున్నారు.
పోత విగ్రహం ముందు విగ్రహారాధన చేశారు.
20వారు మహిమగల దేవునికి బదులు
తుక్కు మేసే ఎద్దు బొమ్మను ఉంచారు.
21వారిని రక్షించిన దేవున్ని,
ఈజిప్టులో ఆయన చేసిన గొప్ప కార్యాలను వారు మరచిపోయారు,
22హాము దేశంలో అద్భుతకార్యాలు
ఎర్ర సముద్రం ఒడ్డున ఆయన చేసిన భీకర క్రియలు.
23“వీరిని నాశనం చేస్తాను” అన్నాడు దేవుడు.
మోషే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి.
ఆయన వచ్చి దేవుని ఎదుట సందులో నిలిచి
విజ్ఞాపన చేస్తే ఆయన ఉగ్రత వారిని ధ్వంసం చేయకుండా ఆపింది.
24మనోహరమైన దేశాన్ని వారు తిరస్కరించారు;
వారాయన మాట నమ్మలేదు.
25యెహోవా మాట వినక,
డేరాలలో సణగ సాగారు.
26కాబట్టి ఆయన తన చేయెత్తి,
వారిని ఎడారిలో పతనమయ్యేలా చేస్తాను,
27వారి సంతతివారిని దేశాల మధ్య పతనమయ్యేలా చేస్తాను,
దేశాలకు వారిని చెదరగొడతాను, అని ప్రమాణం చేశారు.
28వారు బయల్-పెయోరు దగ్గరి విగ్రహం దగ్గర చేరారు.
నిర్జీవ విగ్రహాలకు పెట్టిన నైవేద్య బలులు తిన్నారు.
29తమ దుష్ట చర్యల చేత వారు దేవునికి కోపం రేపారు.
అందుకు వారి మధ్యకు తెగులు మొదలైంది.
30ఫీనెహాసు నిలిచి, న్యాయం చెప్పాడు. అపరాధులను శిక్షించాడు.
తెగులు ఆగిపోయింది.
31అది అంతులేని తరాలకు
అతనికి నీతిగా ఎంచబడింది.
32మెరీబా నీళ్ల దగ్గర వారంతా దేవుని కోపాగ్ని రేపారు,
వారి మూలంగా మోషేకు బాధ.
33వారు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు,
అతని పెదవుల వెంట కాని మాటలు వచ్చాయి.
34యెహోవా నాశనం చేస్తానన్న జాతులను
వీరు విడిచిపెట్టారు.
35ఇతర జనాంగాలలో కలిసిపోయి,
వారి జీవిత విధానాలు నేర్చుకున్నారు.
36వారి విగ్రహాలను పూజించారు.
అవే వారికి ఉరి అయ్యాయి.
37తమ కుమారులను, కుమార్తెలను
దయ్యానికి బలి ఇచ్చారు.
38నిరపరాధుల రక్తం,
తమ కుమారుల రక్తం, కుమార్తెల రక్తం వారు చిందించారు.
కనాను దేశపు విగ్రహాలకు తమ సొంత పిల్లల్ని బలి ఇచ్చారు.
ఈ రక్తపాతం చేత దేశమంతా అపవిత్రమైనది.
39వారు తమ దుష్ట క్రియల చేత అపవిత్రులయ్యారు;
విగ్రహాల మీద వారికి గల ప్రేమ యెహోవా దృష్టిలో వ్యభిచారము చేశారు.
40యెహోవా కోపం వారి మీదికి వచ్చింది,
తన వారసత్వం తన ప్రజలు అయినా వారంటే ఆయనకు అసహ్యం వేసింది.
41ఇతర దేశాలకు వారిని అప్పగించాడు.
అయినా వారి మీద ప్రభుత్వం చేశారు.
42శత్రువులే వారిని అణగద్రొక్కారు
వారి చేతి క్రింద తల వొగ్గారు.
43చాలాసార్లు ఆయన విడిపించాడు,
అయినా వారి తిరుగుబాటు ఆలోచనలు కార్యరూపం దాల్చాయి.
తిరగబడి, అపరాధులై, దురవస్థ చెందారు.
44అయినా వారు మొరపెట్టగానే ఆయన విన్నాడు.
వారి కష్టంను చూచాడు.
45దేవుడు తన నిబంధనను తలచుకొన్నాడు.
వారి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాడు.
తన మారని ప్రేమను బట్టి వారిని కనికరించాడు.
46చెరపట్టిన వారికి వీరి మీద జాలి కలిగింది.
అది దైవనిర్ణయమే.
47మా దేవా యెహోవా, మమ్మల్ని రక్షించండి;
ఇతర దేశాల మధ్య నుండి మమ్మల్ని సమకూర్చండి,
అప్పుడు మేము మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం,
మిమ్మల్ని స్తుతించడంలో అతిశయిస్తాం.
48ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు
నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక!
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
యెహోవాను స్తుతించండి!

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in