కీర్తనలు 109
109
కీర్తన 109
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన
1నేను స్తుతించే, నా దేవా,
మౌనంగా ఉండకండి,
2ఎందుకంటే దుష్టులు మోసగాళ్ళు
నాకు వ్యతిరేకంగా తమ నోళ్ళు తెరిచి;
అబద్ధాలాడే నాలుకలతో వారు నాకు వ్యతిరేకంగా మాట్లాడారు.
3ద్వేషపూరిత మాటలతో వారు నన్ను చుట్టుముడతారు;
వారు కారణం లేకుండా నా మీద దాడి చేస్తారు.
4వారు నా ప్రేమకు ప్రతిగా నా మీద ఆరోపణలు చేస్తారు,
కాని నేనైతే ప్రార్థిస్తూ ఉంటాను.
5నేను చేసిన మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తారు.
నా ప్రేమకు ప్రతిగా ద్వేషం చూపుతారు.
6నా శత్రువు మీద ఒక దుష్టుని నియమించండి;
అతని కుడి ప్రక్కన ఒక నేరం మోపేవాడు నిలబడాలి.
7తీర్పు సమయంలో అతడు దోషిగా వెల్లడి కావాలి,
అప్పుడు అతని ప్రార్థనలు పాపంగా లెక్కించబడతాయి.
8అతడు బ్రతికే రోజులు కొద్దివిగా ఉండును గాక;
అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక.
9అతని పిల్లలు తండ్రిలేనివారు కావాలి,
అతని భార్య విధవరాలు అవ్వాలి.
10అతని పిల్లలు బిక్షకులై తిరుగుదురు గాక,
వారు పాడుబడిన నివాసాల తోలివేయబడుదురు గాక.
11అప్పిచ్చేవాడు అతని దగ్గర ఉన్నవన్నీ స్వాధీనం చేసుకోవాలి;
అపరిచితులు అతని కష్టార్జితాన్ని దోచుకోవాలి.
12అతని మీద ఎవరు దయ చూపకూడదు,
తన తండ్రిలేని పిల్లలపై ఎవరికీ కనికరం చూపకూడదు.
13అతని వంశం అంతరించాలి,
వచ్చేతరం నుండి వారి పేర్లు తుడిచివేయబడాలి.
14అతని పూర్వికుల దోషాలు యెహోవా మరువకూడదు,
అతని తల్లి పాపాన్ని దేవుడు ఎన్నటికి తుడిచివేయకూడదు.
15వారి పాపాలన్నీ ఎప్పుడూ యెహోవా ఎదుట ఉండాలి,
తద్వార భూమి మీద నుండి అతని పిల్లల జ్ఞాపకాన్ని ఆయన తుడిచివేస్తారు.
16దయ చూపించాలని అతడు ఎప్పుడూ అనుకోలేదు;
కాని అతడు నలిగినవారిని పేదవారిని వేధించాడు
ధైర్యము కోల్పోయిన వారిని హతమార్చాడు.
17శపించటం అతనికి ఇష్టం కాబట్టి
అది అతని మీదికే వచ్చింది.
అతడు ఎవరినీ ఆశీర్వదించాలని కోరలేదు కాబట్టి
అతడు ఆశీర్వాదాన్ని అనుభవించలేదు.
18అతడు శాపాన్ని వస్త్రంగా ధరించాడు;
అది నీరులా అతని కడుపులోకి,
నూనెలా అతని ఎముకల్లోకి చొచ్చుకు పోయింది.
19అది అతని చుట్టూ చుట్టబడిన వస్త్రంలా,
అది నడుము దట్టిలా నిత్యం అతని చుట్టూ ఉండును గాక.
20నా మీద నేరం మోపేవారికి నా గురించి చెడుగా మాట్లాడేవారికి,
యెహోవా వారికి జీతం చెల్లించును గాక.
21అయితే, ప్రభువైన యెహోవా,
మీ నామ ఘనత కోసం నాకు సహాయం చేయండి;
శ్రేష్ఠమైన మీ మారని ప్రేమను బట్టి, నన్ను విడుదలచేయండి.
22ఎందుకంటే నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను,
నా హృదయం నాలో గాయపడి ఉంది.
23నేను సాయంత్రం నీడలా మసకబారుతున్నాను;
మిడతలా నేను దులిపివేయబడ్డాను.
24ఉపవాసాలు ఉండి నా మోకాళ్లు వణికిపోతున్నాయి;
నేను అస్థిపంజరంలా అయ్యాను.
25నా మీద నేరం మోపేవారికి నేను ఎగతాళి హాస్యాస్పదం అయ్యాను;
వారు నన్ను చూసినప్పుడు, వారు వెటకారంగా వారి తలలాడిస్తారు.
26యెహోవా, నా దేవా! నాకు సాయం చేయండి;
మీ మారని ప్రేమను బట్టి నన్ను కాపాడండి.
27ఇది చేసింది మీ హస్తమేనని,
యెహోవాయే చేశారని వారికి తెలియనివ్వండి.
28వారు నన్ను శపించినప్పుడు మీరు నన్ను దీవిస్తారు;
వారు నాపై దాడి చేసినప్పుడు వారు అవమానానికి గురవుతారు,
కాని మీ సేవకుడు సంతోషించును గాక.
29నా మీద నేరం మోపేవారు అవమానాన్ని వస్త్రంగా ధరించుదురు గాక
ఒక వస్త్రంలో అయినట్టుగా సిగ్గుతో చుట్టబడతారు.
30నేను నోరార యెహోవాను కీర్తిస్తాను;
ఆరాధికుల గొప్ప సమూహంలో నేను ఆయనను స్తుతిస్తాను.
31ఎందుకంటే అవసరతలో ఉన్న వారి పక్షాన ఆయన నిలబడతారు,
వారికి తీర్పు తీర్చే వారి నుండి వారి ప్రాణాలను కాపాడడానికి.
Currently Selected:
కీర్తనలు 109: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.