YouVersion Logo
Search Icon

కీర్తనలు 34

34
కీర్తన 34#34 ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి
అబీమెలెకు ఎదుట వెర్రి వానిలా ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత దావీదు వ్రాసిన కీర్తన.
1నేను అన్ని వేళలా యెహోవాను కీర్తిస్తాను;
ఆయన స్తుతి నిత్యం నా పెదవులపై ఉంటుంది.
2నేను యెహోవాలో అతిశయిస్తాను.
బాధించబడినవారు ఇది విని సంతోషించుదురు గాక!
3నాతో కలిసి యెహోవాను మహిమపరచండి;
మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం.
4నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు;
నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు.
5ఆయన వైపు చూసేవారికి వెలుగు కలుగుతుంది;
వారి ముఖాలు ఎప్పుడూ సిగ్గుపడవు.
6ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు
కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు.
7యెహోవా దూత ఆయనకు భయపడేవారి చుట్టూ ఉండి,
వారిని విడిపిస్తాడు.
8యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి;
ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు.
9యెహోవా పరిశుద్ధ జనమా, ఆయనకు భయపడండి,
ఆయనకు భయపడేవారికి ఏ కొదువ ఉండదు.
10సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు,
కాని యెహోవాను వెదికేవారికి ఏ మేలు కొరతగా ఉండదు.
11నా పిల్లలారా, రండి, నా మాట వినండి;
నేను మీకు యెహోవా పట్ల భయాన్ని బోధిస్తాను.
12మీలో ఎవరైతే జీవితాన్ని ప్రేమిస్తారో
ఎవరు ఎక్కువ మంచి రోజులను చూడాలనుకుంటారో
13మీరు చెడు పలుకకుండ మీ నాలుకను,
అబద్ధాలు చెప్పకుండ తమ పెదవులను అదుపులో పెట్టుకోవాలి.
14కీడు చేయడం మాని మేలు చేయాలి;
సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
15యెహోవా కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి,
ఆయన చెవులు వారి మొరను వింటాయి;
16అయితే కీడుచేసేవారి జ్ఞాపకాన్ని భూమి మీద లేకుండా చేయడానికి
యెహోవా ముఖం వారికి విరోధంగా ఉన్నది.
17నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తారు;
వారి ఇబ్బందులన్నిటి నుండి ఆయన వారిని విడిపిస్తారు.
18విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపంగా ఉంటారు.
ఆత్మలో నలిగినవారిని ఆయన రక్షిస్తారు.
19నీతిమంతులకు అనేక శ్రమలు కలుగవచ్చు,
కాని, యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపిస్తారు.
20వారి ఎముకలన్నిటిని ఆయన కాపాడతారు,
ఒక్క ఎముక కూడా విరగదు.
21చెడుతనం దుష్టులను నాశనం చేస్తుంది;
నీతిమంతుల శత్రువులు శిక్షింపబడతారు.
22యెహోవా తన సేవకులను విడిపిస్తారు;
ఆయనను ఆశ్రయించిన వారిలో ఎవరూ శిక్షింపబడరు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in