YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 5

5
సమాధానం, నిరీక్షణ
1మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం సమాధానాన్ని కలిగి ఉన్నాము. 2ఆయన ద్వారానే విశ్వాసం చేత ఇప్పుడు మనం నిలిచి ఉన్న కృపలోనికి రాగలిగాము. దేవుని మహిమను గురించిన నిరీక్షణలో మనం అతిశయిద్దాం. 3అంతేకాక, శ్రమలు ఓర్పును పుట్టిస్తాయని మనకు తెలుసు; కాబట్టి శ్రమలలో కూడా మనం ఆనందించగలము. 4ఓర్పు వలన గుణము, గుణము వలన నిరీక్షణ కలుగుతుంది. 5మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రుమ్మరింపబడుతుంది, కాబట్టి నిరీక్షణ వలన మనకు ఎన్నడూ నిరాశ కలుగదు.
6మనం ఇంకను బలహీనులమై ఉన్నప్పుడే, సరియైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం మరణించారు. 7ఒక మంచివాని కోసం ఎవరో ఒకరు చనిపోవడానికి సాహసం చేయవచ్చు, కాని ఒక నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోవడం చాలా అరుదు. 8కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించుట ద్వారా దేవునికి మన పట్ల ఉన్న తన ప్రేమను చూపించారు.
9ఇప్పుడైతే ఆయన రక్తం చేత నీతిమంతులంగా తీర్చబడిన మనం మరింత ఖచ్చితంగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం! 10ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడితే ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాము. 11అంతే కాకుండా మనల్ని సమాధానపరచిన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం దేవునిలో అతిశయిస్తున్నాము.
ఆదాము ద్వారా మరణం, క్రీస్తు ద్వారా జీవం
12ఒక్క మనుష్యుని ద్వారా ఈ లోకంలోనికి పాపం, పాపం ద్వారా మరణం ఎలా ప్రవేశించాయో, అలాగే అందరు పాపం చేశారు కాబట్టి మరణం ప్రజలందరికి వచ్చింది.
13ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే ఈ లోకంలో పాపం ఉంది కాని, ధర్మశాస్త్రం లేని సమయంలో ఎవరి మీద పాపం మోపబడలేదు. 14అయితే, ఆదాములా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకపోయినప్పటికి, ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు మరణం పరిపాలించింది. ఆదాము రాబోవుతున్న వానికి మాదిరిగా ఉన్నాడు.
15అయితే కృపావరమనేది అతిక్రమం వంటిది కాదు. ఒకవేళ ఒకని అతిక్రమాన్ని బట్టి అనేకమంది మరణిస్తే దేవుని కృప, యేసు క్రీస్తు అనే ఒక్క మనుష్యుని కృప చేత వచ్చిన కృపావరం అనేకమందికి విస్తరిస్తుంది కదా! 16దేవుని వరం ఒక మనుష్యుని పాపం యొక్క ఫలితంతో పోల్చబడలేదు: ఒక పాపం వలన తీర్పు వచ్చి శిక్షను తీసుకువచ్చింది, కాని అనేక అతిక్రమాల తర్వాత వచ్చిన వరం నీతిమంతులుగా చేసింది. 17ఒకవేళ ఒక్క మనుష్యుని అతిక్రమం వల్ల ఆ ఒక్క మనుష్యుని ద్వారా మరణం రాజ్యమేలితే, దేవుని కృపాసమృద్ధిని, నీతి అనే వరాన్ని పొందినవారు యేసు క్రీస్తు అనే ఒక్క మనుష్యుని ద్వారా ఇంకెంత ఎక్కువగా జీవంలో రాజ్యమేలుతారు!
18అదేరీతిగా ఒక్కని అతిక్రమం ఫలితంగా ప్రజలందరికి శిక్ష విధించబడినట్లే ఒక్కని నీతిక్రియ ఫలితంగా ప్రజలందరికి జీవప్రదమైన నీతి అనుగ్రహించబడింది. 19ఒక్క మనుష్యుని అవిధేయత వల్ల అనేకమంది పాపులుగా చేయబడ్డారు, అలాగే ఒక్క మానవుని విధేయత వల్లనే అనేకమంది నీతిమంతులుగా చేయబడ్డారు.
20అతిక్రమం ఎక్కువ కావడానికి ధర్మశాస్త్రం తీసుకు వచ్చినట్టైంది. అయితే పాపం ఎక్కువైనా కొద్ది, దేవుని కృప మరింత విస్తరించింది. 21కాబట్టి, పాపం మరణంలో రాజ్యం చేసినట్లుగానే, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిత్యజీవాన్ని తేవడానికి నీతి ద్వారా కృప రాజ్యం చేస్తుంది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for రోమా పత్రిక 5