YouVersion Logo
Search Icon

జెఫన్యా 1

1
1ఇది యూదా రాజైన ఆమోను కుమారుడు యోషీయా పాలనలో జెఫన్యాకు యెహోవా నుండి వచ్చిన వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు, కూషీ గెదల్యా కుమారుడు, గెదల్యా అమర్యా కుమారుడు, అమర్యా హిజ్కియాకు కుమారుడు.
యెహోవా దినాన భూమి అంతటికి తీర్పు
2“భూమి మీద ఏమీ మిగలకుండా
నేను సమస్తాన్ని తుడిచివేస్తాను,”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
3“మనుష్యులను మృగాలను తుడిచివేస్తాను;
ఆకాశంలో ఎగిరే పక్షులను,
సముద్రంలోని చేపలను తుడిచివేస్తాను,
దుర్మార్గులను పడిపోయేలా చేసే విగ్రహాలను తుడిచివేస్తాను.”
“నేను మానవజాతి అంతటిని
భూమి మీద ఉండకుండా చేస్తాను”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
4“యూదా వారి మీద,
యెరూషలేములో నివసిస్తున్న వారందరి మీద నా చేయి చాపుతాను.
ఈ స్థలంలో మిగిలి ఉన్న బయలు దేవత ఆరాధికులను
ఆ విగ్రహాన్ని పూజించేవారి పూజారుల పేర్లతో సహా నిర్మూలిస్తాను.
5మిద్దెమీద ఎక్కి
ఆకాశ నక్షత్ర సమూహాన్ని పూజించేవారిని,
యెహోవా పేర మోలెకు#1:5 హెబ్రీలో మల్కాము దేవత పేర
మొక్కి ఒట్టు వేసుకునేవారిని నేను నాశనం చేస్తాను.
6యెహోవాను అనుసరించకుండా ప్రక్కకు తిరిగినవారిని
ఆయనను వెదకకుండ, ఆయన దగ్గర విచారణ చేయనివారిని నాశనం చేస్తాను.”
7ప్రభువైన యెహోవా దినం సమీపించింది,
కాబట్టి ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి.
యెహోవా బలి సిద్ధం చేశారు;
తాను ఆహ్వానించిన వారిని ఆయన పవిత్రపరిచారు.
8“యెహోవా ఏర్పరచిన బలి దినాన
నేను అధికారులను, రాజకుమారులను,
విదేశీయుల్లా దుస్తులు
వేసుకున్నవారందరిని శిక్షిస్తాను.
9ఆ రోజున, ఇంటి గుమ్మం#1:9 1 సమూ 5:5 దాటివచ్చి,
తమ దేవతల మందిరాన్ని హింసతో
మోసంతో నింపేవారందరినీ నేను శిక్షిస్తాను.
10“ఆ దినాన యెరూషలేములో ఉన్న
చేప ద్వారం నుండి ఏడుపు,
పట్టణ దిగువ భాగం నుండి రోదన,
కొండల దిక్కునుండి గొప్ప నాశనం వస్తుంది,
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
11వర్తక ప్రాంతంలో#1:11 లేదా మోర్తారు నివసించేవారలారా! రోదించండి;
నీ వర్తకులంతా తుడిచివేయబడతారు,
వెండితో వ్యాపారం చేసేవారంతా నాశనం చేయబడతారు.
12ఆ కాలంలో నేను దీపాలు పట్టుకుని యెరూషలేమును సోదా చేస్తాను,
మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం లాంటివారై
‘యెహోవా మేలు గాని కీడు గాని ఏదీ చేయడు’ అనుకుంటూ,
ఆత్మసంతృప్తితో ఉన్నవారిని
నేను శిక్షిస్తాను.
13వారి ధనం దోపిడి అవుతుంది,
వారి ఇల్లు పాడవుతాయి.
వారు ఇళ్ళు కట్టుకున్నా
వాటిలో నివసించలేరు;
వారు ద్రాక్షతోటలు నాటినా
వాటి ద్రాక్షరసం త్రాగలేరు.”
14యెహోవా మహాదినం సమీపంగా ఉంది,
అది ఆసన్నమై త్వరగా రాబోతుంది.
యెహోవా దినాన ఏడ్పు భయంకరంగా ఉంటుంది;
ఆ దినాన బలాఢ్యులు ఘోరంగా ఏడుస్తారు.
15ఆ దినం ఉగ్రత దినం;
బాధ, వేదన కలుగుతుంది.
అది నాశనం, ధ్వంసం,
చీకటి అంధకారం కమ్మే దినం,
మబ్బులు, గాఢాంధకారం కమ్మే రోజు.
16ప్రాకార పట్టణాల దగ్గర
ఎత్తైన గోపురాల దగ్గర యుద్ధఘోష,
బాకానాదం వినబడే రోజు.
17“ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేశారు,
కాబట్టి మనుష్యులందరి మీదికి నేను బాధను రప్పించగా
వారు గ్రుడ్డివారిలా తడుముకుంటారు.
వారి రక్తం దుమ్ములా,
వారి మాంసం పెంటలా పారవేయబడుతుంది.
18యెహోవా ఉగ్రత దినాన
వారి వెండి బంగారాలు
వారిని తప్పించలేవు.”
ఆయన రోషాగ్ని చేత
లోకమంతా దగ్దమవుతుంది,
ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ
సర్వనాశనం చేయబోతున్నారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in