అపొస్తలుల కార్యములు 6

6
ఏడుగురు సేవకులను ఎంచుకోవడం
1ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు, ప్రతీ రోజు ఆహారం పంచిపెట్టే విషయంలో, గ్రీకు విధవరాండ్రను పట్టించుకోవడం లేదని గ్రీకుభాష మాట్లాడే యూదులు హెబ్రీభాష మాట్లాడే యూదుల మీద సణుగుకొన్నారు. 2కాబట్టి పన్నెండుమంది అపొస్తలులు మిగిలిన విశ్వాసులందరిని ఒకచోటకు పిలిపించి వారితో, “మేము దేవుని వాక్య పరిచర్యను నిర్లక్ష్యం చేసి భోజన బల్లల గురించి కనిపెట్టుకొని ఉండడం సరికాదు. 3కాబట్టి సహోదరి సహోదరులారా, ఆత్మతో, జ్ఞానంతో నింపబడిన ఏడుగురిని మీలో నుండి ఏర్పరచుకోండి. మేము ఈ బాధ్యతను వారికి అప్పగిస్తాము. 4అప్పుడు మేము ప్రార్థనపై, వాక్య పరిచర్యపై శ్రద్ధ వహించగలం” అని చెప్పారు.
5ఈ ఆలోచన అందరికి నచ్చింది. కాబట్టి వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండిన స్తెఫెను, ఫిలిప్పు, ప్రోకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదా మతంలోనికి మారిన అంతియొకయ నివాసియైన నికోలాసు అనే వారిని ఏర్పరచుకున్నారు. 6వారిని అపొస్తలుల ముందు నిలబెట్టినప్పుడు, వారు వీరిపై చేతులుంచి ప్రార్థన చేశారు.
7కాబట్టి దేవుని వాక్యం వ్యాపించింది. యెరూషలేములో శిష్యుల సంఖ్య అతివేగంగా పెరిగింది, యాజకులలో కూడా చాలామంది విశ్వాసానికి లోబడ్డారు.
స్తెఫెను హింసించబడుట
8స్తెఫెను, దేవుని కృపతో శక్తితో నిండి ప్రజలమధ్య గొప్ప అద్భుతాలు సూచకక్రియలు చేశాడు. 9అయితే స్వతంత్రుల సమాజమందిరానికి (అలా పిలువబడేది) చెందిన కురేనీయులు అలెక్సంద్రియ, అలాగే కిలికియా ఆసియా ప్రాంతాల నుండి వచ్చిన యూదులు స్తెఫెనుతో వాదించడం మొదలుపెట్టారు. 10కాని ఆత్మ అనుగ్రహించిన జ్ఞానంతో మాట్లాడుతున్న స్తెఫెనుకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేకపోయారు.
11కాబట్టి వారు రహస్యంగా కొందరిని ప్రేరేపించి, “మోషే మీద దేవుని మీద స్తెఫెను దైవదూషణ చేయడం మేము విన్నాం” అని చెప్పించారు.
12ప్రజలను, యూదా నాయకులను ధర్మశాస్త్ర ఉపదేశకులను వారు రెచ్చగొట్టారు. వారు స్తెఫెనును పట్టుకుని న్యాయసభ ముందు నిలబెట్టారు. 13వారు అబద్ధ సాక్షులను తీసుకువచ్చి, “ఇతడు ఈ పరిశుద్ధ స్థలానికి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఆపలేదు. 14నజరేయుడైన యేసు ఈ స్థలాన్ని పడగొట్టి, మోషే మనకు ఇచ్చిన ఆచారాలను మార్చేస్తాడని ఇతడు చెప్పడం మేము విన్నాం” అని చెప్పించారు.
15న్యాయసభలో కూర్చున్న వారంతా స్తెఫెను వైపు సూటిగా చూసినప్పుడు, అతని ముఖం ఒక దేవదూత ముఖంలా వారికి కనబడింది.

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió