యోహాను 10
10
మంచి గొర్రెల కాపరి, ఆయన గొర్రెలు
1“గొర్రెల దొడ్డిలోనికి వెళ్లే ద్వారం నుండి కాక, వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు, దొంగ మరియు దోచుకొనే వాడు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 2గొర్రెల దొడ్డిలోనికి ద్వారం గుండా లోనికి వచ్చేవాడు గొర్రెల కాపరి. 3కాపలాదారుడు కాపరికి తలుపు తీస్తాడు, ఆ గొర్రెలు తమ కాపరి స్వరాన్ని వింటాయి. ఆ కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలిచి, వాటిని బయటికి నడిపిస్తాడు. 4అతడు తన సొంత వాటన్నిటిని బయటకు తెచ్చి, వాటికి ముందుగా నడుస్తాడు, ఆ గొర్రెలకు అతని స్వరం తెలుసు కనుక అవి అతన్ని వెంబడిస్తాయి. 5అయితే క్రొత్తవారి స్వరాన్ని అవి గుర్తించవు కనుక వారిని వెంబడించవు; నిజానికి, అవి వారి నుండి పారిపోతాయి” అని చెప్పారు. 6ఈ సాదృశ్యం ద్వారా యేసు చెప్పిన దానిని పరిసయ్యులు గ్రహించలేకపోయారు.
7కనుక యేసు మళ్ళీ వారితో, “గొర్రెలకు ద్వారం నేనే, అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 8నాకన్నా ముందు వచ్చిన వారందరు దొంగలు దోచుకొనేవారు, కనుక గొర్రెలు వారి మాటలు వినలేదు. 9నేనే ద్వారాన్ని; నా ద్వారా లోపలికి ప్రవేశించేవారు రక్షింపబడతారు. వారు లోపలికి వస్తూ బయటకు వెళ్తూ పచ్చికను కనుగొంటారు. 10దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి వస్తాడు. అయితే నేను గొర్రెలకు జీవం కలిగించాలని, అది సమృద్ధిగా కలిగించాలని వచ్చాను.
11“నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెలను కాపాడడానికి తన ప్రాణానికి తెగిస్తాడు. 12జీతగాడు గొర్రెల కాపరి కాదు, ఆ గొర్రెలు తనవి కావు. కనుక తోడేలు రావడం చూసి వాడు గొర్రెలను విడిచి పారిపోతాడు. తోడేలు ఆ మంద మీద దాడి చేసి వాటిని చెదరగొడుతుంది. 13వాడు జీతగాడు జీతం కొరకే పని చేస్తాడు కనుక గొర్రెల గురించి పట్టించుకోకుండా పారిపోతాడు.
14-15“నేను మంచి కాపరిని; నా తండ్రికి నేను తెలుసు నాకు నా తండ్రి తెలుసు; అలాగే నాకు నా గొర్రెలు తెలుసు నా గొర్రెలకు నేను తెలుసు. నా గొర్రెల కొరకు నేను నా ప్రాణం పెడతాను. 16ఈ దొడ్డివికాని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి. వాటిని కూడ నేను తోడుకొని రావాలి. అవి కూడా నా స్వరం వింటాయి, అప్పుడు ఒక్క మంద మరియు ఒక్క కాపరి ఉంటాడు. 17నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నారు ఎందుకంటే, నేను నా ప్రాణాన్ని పెడతాను కనుక, అయితే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవటానికి మాత్రమే. 18నా దగ్గర నుండి ఎవరు దానిని తీసుకోలేరు, నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. ప్రాణం పెట్టడానికి దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞను నేను నా తండ్రి నుండి పొందాను” అని చెప్పారు.
19ఈ మాటల వలన యూదులలో మరల భేదాలు ఏర్పడ్డాయి. 20వారిలో అనేకమంది, “ఇతడు పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఇతనికి దయ్యం పట్టింది. ఇతని మాటలను ఎందుకు వింటున్నారు?” అన్నారు.
21కానీ మరికొందరు, “ఇవి దయ్యం పట్టినవాని మాటలు కాదు, ఒక దయ్యం గ్రుడ్డివాడికి చూపు ఇవ్వగలదా?” అని అడిగారు.
యూదులచేత తృణీకరించబడిన యేసు
22ఆ తర్వాత యెరూషలేములో ప్రతిష్ఠిత పండుగ సమీపించింది. అది శీతాకాలం. 23యేసు దేవాలయ ఆవరణంలో సొలొమోను మండపంలో నడుస్తున్నారు. 24అప్పుడు యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో, “నీవు మమ్మల్ని ఇంకా ఎంతకాలం ఇలా సందేహంలో ఉంచుతావు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు.
25అందుకు యేసు వారితో, “నేను మీకు చెప్పాను, కాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేసిన అద్బుత క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. 26కాని మీరు నా గొర్రెలు కారు కనుక మీరు నమ్మరు. 27నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి; అవి నాకు తెలుసు మరియు అవి నన్ను వెంబడిస్తాయి. 28నేను వాటికి నిత్యజీవాన్ని ఇస్తాను, కనుక అవి ఎన్నడు నశించవు; వాటిని నా చేతిలో నుండి ఎవరు అపహరించలేరు. 29వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు; నా తండ్రి చేతిలో నుండి ఎవరూ వాటిని అపహరించలేరు. 30నేను నా తండ్రి ఏకమై ఉన్నాం” అన్నారు.
31ఆయనకు విరోధంగా ఉన్న యూదులు మళ్ళీ ఆయనను కొట్టాలని రాళ్ళను పట్టుకొన్నారు. 32అయితే యేసు వారితో, “నా తండ్రి నుండి మీకు అనేక మంచి కార్యాలను చూపించాను. వాటిలో దేనిని బట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారా?” అని అడిగారు.
33“అందుకు యూదులు, నీవు చేసిన మంచిపనుల బట్టి కాదు, నీవు మానవుడవై యుండి దేవుడను అని చెప్పుకొంటూ దైవదూషణ చేస్తున్నందుకు” అని చెప్పారు.
34యేసు వారితో, “ ‘మీరు “దేవుళ్ళు” అని నేను అన్నాను’ అని మీ లేఖనాలలో వ్రాసిలేదా?#10:34 కీర్తన 82:6 35దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టివేయడానికి లేదు; దేవుని వాక్యాన్ని పొందుకొనిన వారినే ఆయన ‘దేవుళ్ళు’ అని పిలిచినప్పుడు, 36తండ్రి తన స్వంతవానిగా ప్రత్యేకపరచుకొని లోకానికి పంపినవాని సంగతేమిటి? ‘నేను దేవుని కుమారుడను’ అని చెప్పినందుకు, దైవదూషణ అని నాపైన నేరం ఎందుకు మోపుతున్నారు? 37నేను నా తండ్రి పనులను చేయకపోతే నన్ను నమ్మకండి. 38అయితే నేను వాటిని చేస్తే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలో, నేను తండ్రిలో ఉన్నామని మీరు తెలుసుకొని గ్రహించేలా, నేను చేసే క్రియలను నమ్మండి” అని చెప్పారు. 39వారు ఆయనను పట్టుకోవాలని మరల ప్రయత్నించారు, కానీ ఆయన వారి నుండి తప్పించుకున్నారు.
40తర్వాత యేసు యోర్దాను నదిని దాటి, యోహాను మొదట బాప్తిస్మమిస్తూ ఉండిన ప్రాంతానికి తిరిగి వచ్చి అక్కడ ఉన్నారు. 41చాలామంది ఆయన దగ్గరకు వచ్చి, “యోహాను ఏ అద్బుత క్రియను చేయలేదు, కాని ఈయన గురించి యోహాను చెప్పినవి అన్ని సత్యమే” అన్నారు. 42ఆ స్థలంలో చాలామంది యేసును నమ్మారు.
S'ha seleccionat:
యోహాను 10: TCV
Subratllat
Comparteix
Copia
Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.