యోహాను 16
16
1“మీరు విశ్వాసం నుండి తొలగిపోకూడదని నేను మీకు ఈ సంగతులను చెప్పాను. 2వారు మిమ్మల్ని సమాజమందిరంలో నుండి వెలివేస్తారు; నిజానికి, మిమ్మల్ని చంపినవారు, దేవుని కొరకు మంచి పని చేస్తున్నామని భావించే ఒక సమయం వస్తుంది. 3వారు నన్ను గాని, తండ్రిని గాని తెలుసుకోలేదు కనుక వారు ఇలాంటి పనులను చేస్తారు. 4అవి జరిగేటప్పుడు ఇలా జరుగుతుందని నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరించానని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు చెప్పాను. మొదట్లో ఈ సంగతులను మీతో చెప్పలేదు ఎందుకంటే అప్పుడు నేను మీతోనే ఉన్నాను. 5ఇప్పుడు నేను నన్ను పంపినవాని దగ్గరకు వెళ్తున్నాను, అయినా, ‘నీవు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు. 6కానీ నేను చెప్పిన ఈ సంగతులను గురించి మీ హృదయాలు దుఖంతో నిండి ఉన్నాయి. 7అయితే నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, నేను వెళ్లిపోవడం మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్లకుండా ఆదరణకర్త మీ దగ్గరికి రారు. నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. 8ఆయన వచ్చినప్పుడు, పాపం గురించి నీతిని గురించి మరియు తీర్పును గురించి లోకస్తులు తప్పులో ఉన్నారని రుజువుపరుస్తాడు. 9-10లోకులు నన్ను నమ్మలేదు గనుక వారి పాపం గురించి, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను గనుక ఇక మీరు నన్ను చూడరు కనుక వారి నీతిని గురించి, 11మరియు ఈ లోకాధికారి ఇప్పుడు తీర్పుపొందినవానిగా ఉన్నాడు గనుక తీర్పు గురించి ఒప్పింపజేస్తాడు.
12“మీతో ఇంకా చాలా చెప్పాల్సి ఉంది, కాని మీరు ఇప్పుడు వాటిని భరించలేరు. 13అయితే సత్యమైన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను మాట్లాడడు; తాను విన్నవాటినే ఆయన చెప్తాడు, జరుగబోయే వాటిని మీకు చెప్తాడు. 14ఆయన నా నుండి వినే వాటినే మీకు తెలియజేస్తూ నన్ను మహిమపరుస్తాడు. 15నా తండ్రికి ఉన్నవన్ని నావే. అందుకే ఆత్మ నా నుండి వినే వాటినే మీకు తెలియజేస్తాడని నేను చెప్పాను.”
శిష్యుల దుఃఖం సంతోషంగా మారును
16యేసు ఇంకా చెప్తూ, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, ఆ తర్వాత మరికొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు.”
17అప్పుడు, ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, “ఆయన అంటున్న, ‘నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ కనుక ‘కొద్దిసేపట్లో మీరు నన్ను చూడలేరు, తర్వాత కొద్దిసేపటికి మీరు నన్ను చూస్తారు’ అని ఆయన అనే దానికి అర్థమేంటి?” అని చెప్పుకొన్నారు. 18వారు, “ ‘ఇంకా కొద్ది సమయం’ అంటే ఆయన అర్థమేంటి? ఆయన ఏమంటున్నారో మనకు అర్థం కావడం లేదు” అని అనుకున్నారు.
19యేసు, తన శిష్యులు ఆ విషయం గురించి తనను అడగాలని అనుకుంటున్నారని గ్రహించి, వారితో, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, దాని తర్వాత ఇంకొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు” అని నేను చెప్పినదాని గురించి మీరు ఒకరిని ఒకరు అడుగుతున్నారా? 20నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఏడుస్తూ దుఃఖిస్తున్న సమయంలో ఈ లోక ప్రజలు సంతోషిస్తారు. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. 21ఒక స్త్రీ ప్రసవించు సమయం వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదనపడుతుంది; కానీ శిశువు పుట్టగానే, తన ద్వారా ఈ లోకానికి ఒక బిడ్డ పుట్టాడనే ఆనందంలో తాను పడిన వేదననంతా ఆమె మర్చిపోతుంది. 22మీ విషయంలో కూడా అంతే; మీకు ఇది దుఃఖ సమయం, కాని నేను తిరిగి మిమ్మల్ని చూసినప్పుడు మీ హృదయాంతరంగంలో నుండి ఆనందిస్తారు, ఆ ఆనందాన్ని మీ దగ్గర నుండి ఎవ్వరూ తీసివేయలేరు. 23ఆ రోజు మీరు ఇక నన్ను దేని గురించి అడగరు. మీరు నా పేరట నా తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇస్తాడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 24ఇప్పటి వరకు మీరు నా పేరట ఏమి అడగలేదు. అడగండి మీరు పొందుకొంటారు, మీ ఆనందం పరిపూర్ణమవుతుంది.
25“ఇంతవరకు నేను మీతో దృష్టాంతాలతో చెప్పాను. కానీ ఒక సమయం వస్తుంది అప్పుడు ఈ దృష్టాంతాల భాషను వాడకుండ నా తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజేస్తాను. 26ఆ రోజు మీరు నా పేరిట అడుగుతారు. అయితే మీ కొరకు నేను తండ్రిని అడుగుతానని చెప్పడం లేదు. 27ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని దగ్గరి నుండి వచ్చానని నమ్మారు కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. 28నేను తండ్రి దగ్గరి నుండి బయలుదేరి ఈ లోకానికి వచ్చాను; ఇప్పుడు నేను లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తున్నాను” అన్నారు.
29అప్పుడు యేసు శిష్యులు, “ఇప్పుడు నీవు దృష్టాంతాలతో కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నావు. 30నీకు అన్ని సంగతులు తెలుసని, ఎవరు నిన్ను ప్రశ్నించే అవసరం లేదని, మేము గ్రహిస్తున్నాం. దీనిని బట్టి నీవు దేవుని నుండి వచ్చావని మేము నమ్ముతున్నాం” అన్నారు.
31యేసు వారితో, “ఇప్పుడు మీరు నమ్ముతున్నారా?” అన్నారు. 32“ఒక సమయం రాబోతుంది, అది ఇప్పటికే వచ్చేసింది అప్పుడు మీలో ప్రతి ఒక్కరు నన్ను ఒంటరిగా విడిచి, ఎవరి ఇంటికి వారు చెదరిపోతారు. అయినాసరే నేను ఒంటరి వానిని కాను, ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు.
33“ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. అయినా ధైర్యం తెచ్చుకోండి! ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. నాలో మీకు సమాధానం ఉండాలని ఈ సంగతులను మీకు చెప్పాను” అన్నారు.
S'ha seleccionat:
యోహాను 16: TCV
Subratllat
Comparteix
Copia
Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.