లూకా సువార్త 16

16
అన్యాయ గృహనిర్వాహకుని ఉపమానం
1యేసు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు: “ఒక ధనవంతుని దగ్గర ఒక గృహనిర్వాహకుడు ఉన్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేస్తున్నాడని వాని మీద నేరారోపణ ఉంది. 2కాబట్టి ఆ ధనవంతుడు వానిని లోపలికి పిలిపించి వానితో, ‘నీ గురించి నేను వింటుంది ఏమి? నిన్ను గృహనిర్వాహక పని నుండి తొలగిస్తున్నాను కాబట్టి నీవు లెక్కలన్నీ అప్పగించాలి’ అన్నాడు.
3“ఆ గృహనిర్వాహకుడు తనలో తాను, ‘ఇప్పుడు నేను ఏమి చేయాలి? నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేస్తాడు, నేను త్రవ్వే పని చేయలేను, భిక్షమెత్తాలంటే నాకు సిగ్గు. 4కాబట్టి ఇక్కడ నా ఉద్యోగం పోయినా ప్రజలు నన్ను తమ ఇళ్ళకు ఆహ్వానించేలా ఏం చేయాలో నాకు తెలుసు!’ అని అనుకున్నాడు.
5“కాబట్టి అతడు, తన యజమానికి బాకీ ఉన్న ప్రతివారిని పిలిపించాడు. మొదటి వానిని, ‘నా యజమానికి నీవెంత బాకీ ఉన్నావు?’ అని అడిగాడు.
6“అందుకు వాడు, ‘మూడు వేల లీటర్ల నూనె’ అని జవాబిచ్చాడు.
“వెంటనే ఆ గృహనిర్వాహకుడు వానితో, ‘నీ చీటి తీసుకుని, పదిహేను వందల లీటర్లు#16:6 పదిహేను వందల లీటర్లు అంటే 100 మణుగులు అని వ్రాసుకో’ అన్నాడు.
7“ఆ తర్వాత రెండవ వానిని, ‘నీవెంత బాకీ ఉన్నావు?’ అని అడిగాడు.
“అందుకు వాడు, ‘వంద టన్నుల గోధుమలు#16:7 వంద టన్నుల గోధుమలు అంటే కొ.ప్ర.లలో నూరు తూముల గోధుమలు’ అని చెప్పాడు.
“కాబట్టి అతడు వానితో, ‘నీవు నీ చీటిలో ఎనభై టన్నులని వ్రాసుకో’ అన్నాడు.
8“ఈ విషయాన్ని విన్న ధనవంతుడు ఆ యజమాని మోసగాడైనా కానీ యుక్తిగా నడుచుకొన్నాడని వానిని మెచ్చుకొన్నాడు. ఈ లోకసంబంధులు తమ తరాన్ని బట్టి చూస్తే వెలుగు సంబంధుల కంటే యుక్తిగా వ్యవహరిస్తున్నారు. 9కాబట్టి నేను మీతో చెప్పేదేమంటే, మీకున్న లోక ధనసంపదతో మీరు స్నేహితులను సంపాదించుకోండి, అది పోయినప్పుడు, నిత్యమైన నివాసాల్లో మీకు ఆహ్వానం దొరుకుతుంది.
10“చాలా కొంచెంలో నమ్మకంగా ఉండేవారు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు; చిన్న వాటిలో అన్యాయంగా ఉండేవారు పెద్ద వాటిలో కూడా అన్యాయంగానే ఉంటారు. 11అనగా, ఈ లోక సంపద విషయాల్లో మీరు నమ్మకంగా లేనప్పుడు, నిజమైన ధనం విషయంలో మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? 12మీరు ఇతరుల ఆస్తి విషయంలో నమ్మకంగా లేనప్పుడు, మీకు సొంత ఆస్తిని ఎవరు ఇస్తారు?
13“ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేదా ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవున్ని, ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.”
14డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలను విని యేసును ఎగతాళి చేశారు. 15ఆయన వారితో, “మీరు మనుష్యుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకుంటారు గాని దేవుడు మీ హృదయాలను ఎరిగి ఉన్నాడు. మనుష్యులు అధిక విలువ ఇచ్చేవి దేవుని దృష్టికి అసహ్యము.
మరికొన్ని బోధలు
16“యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ప్రవక్తలు ఉన్నారు. అప్పటినుండి దేవుని రాజ్యసువార్త ప్రకటింపబడుతూ ఉంది, ప్రతి ఒక్కరు ఆ రాజ్యంలో చొరబడుతూనే ఉన్నారు. 17ధర్మశాస్త్రం నుండి ఒక పొల్లు తప్పిపోవడం కన్న ఆకాశం భూమి గతించిపోవడం సులభం.
18“ఎవడైనా తన భార్యను విడిచి మరొక స్త్రీని పెళ్ళి చేసుకుంటే వాడు వ్యభిచారం చేస్తున్నాడు, అలాగే విడిచిపెట్టబడిన స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
ధనవంతుడు లాజరు
19“ఊదా రంగు సన్నని నారబట్టలను ధరించుకొని, ప్రతిరోజు విలాసంగా జీవించే ఒక ధనవంతుడు ఉండేవాడు. 20వాని ఇంటి వాకిటనే శరీరమంతా కురుపులు ఉన్న లాజరు అనే పేరుగల ఒక పేదవాడు ఉండేవాడు. 21వాడు ఆ ధనవంతుని బల్ల నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలని చూసేవాడు. కుక్కలు వచ్చి వాని కురుపులను నాకేవి.
22“ఆ పేదవాడు చనిపోయినప్పుడు దేవదూతలు వానిని అబ్రాహాము రొమ్మున ఆనుకోడానికి తీసుకెళ్లారు. అలాగే ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడ్డాడు. 23ధనవంతుడు నరకంలో యాతనపడుతు, దూరం నుండి అబ్రాహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూశాడు. 24వెంటనే అతడు, ‘తండ్రీ అబ్రాహామూ, నేను అగ్నిలో అల్లాడి పోతున్నాను. నా మీద కనికరం చూపించి, తన చేతివ్రేలికొన నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించవా’ అని కేక వేశాడు.
25“అందుకు అబ్రాహాము, ‘కుమారుడా, జ్ఞాపకం చేసుకో, లాజరు కష్టాలను అనుభవిస్తున్నప్పుడు నీ జీవితంలో నీవు మేళ్ళను అనుభవించావు, కానీ ఇప్పుడు ఇక్కడ అతడు ఆదరణ పొందుతున్నాడు, కానీ నీవు యాతనపడుతున్నావు. 26వీటన్నిటితో పాటు, నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది కాబట్టి ఇక్కడి వారు అక్కడికి గాని అక్కడి వారు ఇక్కడకు గాని రాలేరు’ అన్నాడు.
27-28“అందుకు అతడు, ‘అయితే తండ్రీ, నా కుటుంబంలో నాకు అయిదుగురు సహోదరులు ఉన్నారు. వారు కూడ ఇక్కడకు వచ్చి వేదన పడకుండా వారిని హెచ్చరించడానికి లాజరును పంపించమని నిన్ను వేడుకొంటున్నాను’ అన్నాడు.
29“అందుకు అబ్రాహాము, ‘వారికి మోషే ప్రవక్తలు ఉన్నారు, వారు వీరి మాటలను విననివ్వు’ అన్నాడు.
30“అందుకు అతడు, ‘కాదు, తండ్రీ అబ్రాహామూ, చనిపోయినవారిలో నుండి ఎవరైనా వెళ్తే, వారు పశ్చాత్తాపపడతారు’ అన్నాడు.
31“అందుకు అబ్రాహాము అతనితో, ‘వారు మోషే మాటలు గాని ప్రవక్తల మాటలు గాని వినకపోతే చనిపోయినవారిలో నుండి ఒకడు లేచి వెళ్లినా నమ్మరు’ అన్నాడు.”

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió