లూకా సువార్త 3
3
మార్గాన్ని సిద్ధపరచే బాప్తిస్మమిచ్చే యోహాను
1తిబెరి కైసరు ఏలుచున్న పదిహేనవ సంవత్సరంలో, యూదయ ప్రాంతానికి అధిపతిగా పొంతి పిలాతు, గలిలయ ప్రాంతానికి చతుర్థాధిపతిగా హేరోదు, ఇతూరియా త్రకోనీతి అనే ప్రాంతాలకు చతుర్థాధిపతిగా అతని తమ్ముడైన ఫిలిప్పు అబిలేనె ప్రాంతానికి చతుర్థాధిపతిగా లుసానీయ ఉన్నారు. 2అన్నా కయపాల ప్రధాన యాజకత్వం కొనసాగుతున్న సమయంలో, అరణ్యంలో నివసిస్తున్న జెకర్యా కుమారుడైన యోహాను దగ్గరకు దేవుని వాక్కు వచ్చింది. 3అతడు యూదయలోని యొర్దాను నదీ తీరప్రాంతమంతా వెళ్తూ పాపక్షమాపణ కొరకై పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుకోండని ప్రకటిస్తున్నాడు. 4ప్రవక్తయైన యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లు:
“అరణ్యంలో ఒక స్వరం ఎలుగెత్తి ఇలా చెప్తుంది,
‘ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధపరచండి,
ఆయన కోసం త్రోవలను సరాళం చేయండి.
5ప్రతి లోయ పూడ్చబడుతుంది,
ప్రతి పర్వతం, కొండ సమం చేయబడుతుంది.
వంకర త్రోవలు తిన్నగా,
గరుకు మార్గాలు నున్నగా చేయబడతాయి.
6దేవుని రక్షణను ప్రజలందరు చూస్తారు.’ ”#3:6 యెషయా 40:3-5
7తనచే బాప్తిస్మం పొందడానికి వస్తున్న జనసమూహంతో యోహాను, “సర్పసంతానమా! రానున్న ఉగ్రత నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? 8పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. ‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవడం మొదలుపెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగజేయగలడు అని మీతో చెప్తున్నాను. 9ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర పెట్టబడింది, మంచి పండ్లు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది.”
10అందుకు జనసమూహం, “అయితే మేము ఏమి చేయాలి?” అని అడిగారు.
11అందుకు యోహాను, “రెండు చొక్కాలు ఉన్నవాడు ఏమిలేని వానికి ఇవ్వాలి, ఆహారం కలవాడు కూడా అలాగే చేయాలి” అన్నాడు.
12పన్ను వసూలు చేసేవారు కూడ బాప్తిస్మం పొందడానికి వచ్చారు. వారు, “బోధకుడా, మేము ఏమి చేయాలి?” అని అడిగారు.
13అందుకు అతడు వారితో, “మీకు నిర్ణయించబడిన పన్ను కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని చెప్పాడు.
14తర్వాత కొందరు సైనికులు వచ్చి, “మేము ఏమి చేయాలి?” అని అడిగారు.
అందుకతడు, “ఎవరి దగ్గరి నుండి అక్రమంగా డబ్బు తీసుకోవద్దు అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు, మీ జీతంతో తృప్తిగా ఉండండి” అని వారితో చెప్పాడు.
15ప్రజలు క్రీస్తు వస్తాడని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి యోహానే క్రీస్తు అయి ఉంటాడా అని వారందరు తమ హృదయాల్లో అనుకుంటూ ఉన్నారు. 16అప్పుడు యోహాను వారందరితో అన్నాడు, “నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నాకన్నా శక్తిమంతుడు ఒకడు వస్తాడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు. 17గోధుమల నుండి పొట్టును వేరు చేయడానికి తన చేతిలో చేటతో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గోధుమలను తన ధాన్యపు కొట్టులో పోసి, తన నూర్చెడి కల్లమును శుభ్రం చేసి, పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తారు.” 18అతడు ఇంకా అనేకమైన ఇతర మాటలతో వారిని హెచ్చరిస్తూ వారికి సువార్త ప్రకటించాడు.
19అయితే చతుర్థాధిపతియైన హేరోదు, తన సోదరుని భార్యయైన హేరోదియను పెళ్ళి చేసుకున్నందుకు, అతడు చేసిన ఇతర దుష్ట క్రియలను గురించి యోహాను అతన్ని గద్దించాడు కాబట్టి, 20హేరోదు తాను చేసిన తప్పులు చాలవన్నట్టు యోహానును చెరసాలలో వేయించాడు.
యేసు బాప్తిస్మం ఆయన వంశావళి
21ప్రజలందరు బాప్తిస్మం పొందుతున్నప్పుడు, యేసు కూడా బాప్తిస్మం పొందుకున్నారు. ఆయన ప్రార్థిస్తుండగా, ఆకాశం తెరువబడింది, 22పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకు దిగివచ్చాడు. పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం వినబడింది: “నీవు నా కుమారుడవు, నేను ప్రేమించేవాడవు; నీయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను.”
23ఆ తర్వాత యేసు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఇంచుమించు ముప్పై యేండ్ల వయస్సు కలవాడు. ఆయన యోసేపు కుమారుడని అనుకున్నారు,
యోసేపు హేలీ కుమారుడు, 24హేలీ మత్తతు కుమారుడు,
మత్తతు లేవీ కుమారుడు, లేవీ మెల్కి కుమారుడు,
మెల్కి యన్న కుమారుడు, యన్న యోసేపు కుమారుడు,
25యోసేపు మత్తతీయ కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు,
ఆమోసు నహూము కుమారుడు, నహూము ఎస్లి కుమారుడు,
ఎస్లి నగ్గయి కుమారుడు, 26నగ్గయి మయతు కుమారుడు,
మయతు మత్తతీయ కుమారుడు, మత్తతీయ సిమియ కుమారుడు,
సిమియ యోశేఖు కుమారుడు, యోశేఖు యోదా కుమారుడు,
27యోదా యోహన్న కుమారుడు, యోహన్న రేసా కుమారుడు,
రేసా జెరుబ్బాబెలు కుమారుడు, జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు,
షయల్తీయేలు నేరి కుమారుడు, 28నేరి మెల్కీ కుమారుడు,
మెల్కి అద్ది కుమారుడు, అద్ది కోసాం కుమారుడు,
కోసాము ఎల్మాదాం కుమారుడు, ఎల్మాదాం ఏరు కుమారుడు,
29ఏరు యెహోషువ కుమారుడు, యెహోషువ ఎలియాజరు కుమారుడు,
ఎలియాజరు యోరీము కుమారుడు, యోరీము మత్తతు కుమారుడు,
మత్తతు లేవీ కుమారుడు, 30లేవీ షిమ్యోను కుమారుడు,
షిమ్యోను యూదా కుమారుడు, యూదా యోసేపు కుమారుడు.
యోసేపు యోనాము కుమారుడు, యోనాము ఎల్యాకీము కుమారుడు,
31ఎల్యాకీము మెలెయ కుమారుడు, మెలెయ మెన్నా కుమారుడు,
మెన్నా మత్తతా కుమారుడు, మత్తతా నాతాను కుమారుడు,
నాతాను దావీదు కుమారుడు, 32దావీదు యెష్షయి కుమారుడు,
యెష్షయి ఓబేదు కుమారుడు, ఓబేదు బోయజు కుమారుడు,
బోయజు శల్మాను కుమారుడు, శల్మాను నయస్సోను కుమారుడు,
33నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు, అమ్మీనాదాబు అరాము కుమారుడు,
అరాము హెస్రోను కుమారుడు, హెస్రోను పెరెసు కుమారుడు,
పెరెసు యూదా కుమారుడు, 34యూదా యాకోబు కుమారుడు,
యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రాహాము కుమారుడు,
అబ్రాహాము తెరహు కుమారుడు, తెరహు నాహోరు కుమారుడు,
35నాహోరు సెరూగు కుమారుడు, సెరూగు రయూ కుమారుడు,
రయూ పెలెగు కుమారుడు, పెలెగు హెబెరు కుమారుడు,
హెబెరు షేలహు కుమారుడు, 36షేలహు కేయినాను కుమారుడు,
కేయినాను అర్పక్షదు కుమారుడు, అర్పక్షదు షేము కుమారుడు,
షేము నోవహు కుమారుడు, నోవహు లెమెకు కుమారుడు,
37లెమెకు మెతూషెల కుమారుడు, మెతూషెల హనోకు కుమారుడు,
హనోకు యెరెదు కుమారుడు, యెరెదు మహలలేలు కుమారుడు,
మహలలేలు కేయినాను కుమారుడు, 38కేయినాను ఎనోషు కుమారుడు,
ఎనోషు షేతు, షేతు ఆదాము కుమారుడు,
ఆదాము దేవుని కుమారుడు.
S'ha seleccionat:
లూకా సువార్త 3: TSA
Subratllat
Comparteix
Copia
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fca.png&w=128&q=75)
Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.