మార్కు సువార్త 16

16
చనిపోయి తిరిగి లేచిన యేసు
1సబ్బాతు దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి యేసు శరీరానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలను కొన్నారు. 2వారం మొదటి రోజున తెల్లవారేటప్పుడు, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారు సమాధి దగ్గరకు వెళ్తూ 3“సమాధి ద్వారాన్ని మూసిన రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు.
4కాని వారు అక్కడ చేరుకుని, ఆ పెద్ద రాయి ప్రక్కకు తొలగిపోయి ఉండడం చూశారు 5వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, తెల్లని అంగీ వేసుకుని ఉన్న ఒక యవ్వనస్థుడు కుడి ప్రక్కన కూర్చుని ఉండడం చూసి, చాలా భయపడ్డారు.
6అప్పుడు ఆ దూత, “భయపడవద్దు, మీరు సిలువవేయబడిన, నజరేయుడైన యేసును వెదుకుతున్నారు. ఆయన లేచారు! ఆయన ఇక్కడ లేరు. వారు ఆయనను పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి. 7అయితే వెళ్లి, ఆయన శిష్యులతో, పేతురుతో, ‘ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నారు. ఆయన మీతో చెప్పినట్లే, అక్కడ మీరు ఆయనను చూస్తారు’ ” అని చెప్పండని ఆ స్త్రీలతో చెప్పాడు.
8ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ సమాధి నుండి పరుగెత్తి వెళ్లిపోయారు. వారు చాలా భయపడ్డారు, కాబట్టి వారు ఎవరితో ఏమి చెప్పలేదు.
9వారంలో మొదటి రోజైన ఆదివారం తెల్లవారుతుండగా, యేసు ఎవరిలో నుండి ఏడు దయ్యాలను వెళ్లగొట్టారో ఆ మగ్దలేనే మరియకు మొదట కనిపించారు. 10ఆమె వెళ్లి, ఆయనతో పాటు ఉండినవారై ఆయన కోసం దుఃఖిస్తూ, ఏడుస్తున్నవారికి చెప్పింది. 11యేసు బ్రతికి ఉన్నాడని, ఆమె ఆయనను చూసిందని వారు విన్నప్పుడు, వారు నమ్మలేదు.
12ఆ తర్వాత వారిలో ఇద్దరు నడుస్తూ వెళ్తుండగా యేసు వారికి వేరే రూపంలో కనిపించారు. 13వారు తిరిగివెళ్లి జరిగిన విషయాన్ని మిగిలిన శిష్యులకు చెప్పారు; కాని వీరి మాటలను కూడా వారు నమ్మలేదు.
14తర్వాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తున్నప్పుడు యేసు వారికి కనిపించారు. యేసు తిరిగి లేచిన తర్వాత ఆయనను చూసినవారు వారికి చెప్పినా వారు నమ్మలేదని, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన వారిని గద్దించారు.
15యేసు వారితో, “మీరు సర్వలోకానికి వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. 16నమ్మి, బాప్తిస్మం పొందేవారు రక్షణ పొందుతారు, నమ్మనివారు శిక్షను అనుభవిస్తారు. 17నన్ను నమ్మిన వారందరి ద్వారా ఈ సూచకక్రియలు జరుగుతాయి: నా నామంలో దయ్యాలను వెళ్లగొడతారు; క్రొత్త భాషలు మాట్లాడుతారు; 18తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు; విషం త్రాగినా వారికి ఏ హాని కలుగదు; వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, రోగులు స్వస్థత పొందుతారు” అన్నారు.
19ప్రభువైన యేసు శిష్యులతో మాట్లాడిన తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు, దేవుని కుడిచేతి వైపున కూర్చున్నారు. 20ఆ తర్వాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రకటించారు, ప్రభువు వారితో కూడా ఉండి, అద్భుతాలు సూచనలతో తన మాటలు నిజమని నిరూపించారు.#16:20 కొ.ప్ర.లలో 9-20 వచనాలు లేవు.

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió