Logo YouVersion
Eicon Chwilio

మత్తయి సువార్త 7

7
ఇతరులకు తీర్పు తీర్చకూడదు
1“తీర్పు తీర్చకండి. అప్పుడు మీకు కూడ తీర్పు తీర్చబడదు. 2మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు తీర్చబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకు అదే కొలత కొలవబడుతుంది.
3“నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు? 4ఎప్పుడూ నీ కంటిలో దూలాన్ని ఉంచుకుని నీ సహోదరునితో, ‘నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు?’ అని నీవెలా అనగలవు? 5ఓ వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయు, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది.
6“పవిత్రమైన వాటిని కుక్కలకు పెట్టకండి. మీ ముత్యాలను పందుల ముందు వేయకండి. మీరు అలా చేస్తే ఆ పందులు తమ కాళ్లతో వాటిని త్రొక్కివేసి, మీమీద పడి మిమ్మల్ని ముక్కలుగా చీల్చివేస్తాయి.
అడగండి, వెదకండి, తట్టండి
7“అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. 8అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి తలుపు తీయబడుతుంది.
9“మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టె అడిగితే రాయి ఇస్తారా? 10చేప అడిగితే పాము ఇస్తారా? 11మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా మంచి బహుమానాలు ఇస్తారో కదా! 12కాబట్టి ఏ విషయంలోనైనా ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి. ఎందుకంటే ధర్మశాస్త్రం, ప్రవక్తలు చెప్పిన సారాంశం ఇదే.
ఇరుకు ద్వారం, విశాల ద్వారం
13“ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, దారి విశాలంగా ఉంటుంది. అనేకమంది దానిలోనికి ప్రవేశిస్తారు. 14జీవానికి వెళ్లడానికి ప్రవేశించే ద్వారం ఇరుకుగా దారి ఇరుకుగా ఉంటుంది. కొంతమందే దాన్ని కనుగొంటారు.
నిజ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు
15“అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెతోలు కప్పుకుని మీ దగ్గరకు వస్తారు; లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 16వారి ఫలంతో మీరు వారిని గుర్తించగలరు. ముళ్ళపొదల్లో ద్రాక్షపండ్లను, పల్లేరులాంటి ముళ్ళ మొక్కల్లో అంజూర పండ్లను ప్రజలు కోస్తారా? 17ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. చెడ్డ చెట్టు చెడ్డపండ్లు కాస్తుంది. 18మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు. 19మంచి పండ్లు కాయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. 20అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు.
నిజ శిష్యులు, అబద్ధ శిష్యులు
21“ ‘ప్రభువా, ప్రభువా’ అని పిలిచే ప్రతి ఒక్కరు పరలోకరాజ్యంలో ప్రవేశించరు. కాని పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు. 22ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా, మేము నీ పేరట ప్రవచించలేదా? నీ పేరట దయ్యాలను వెళ్లగొట్టలేదా? నీ పేరట అనేక అద్భుతాలను చేయలేదా?’ అని అంటారు. 23అప్పుడు నేను వారితో, ‘మీరెవరో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అని చెప్తాను.
తెలివిగల నిర్మాణకులు, తెలివిలేని నిర్మాణకులు
24“కాబట్టి నేను చెప్పిన ఈ మాటలు విని, వాటి ప్రకారం చేసేవారు బండ మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగలవారిని పోలినవారు. 25వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకినా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది. 26అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న తెలివిలేనివారిని పోలినవారు. 27వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకాయి. అప్పుడు పెద్ద శబ్దంతో అది కూలిపోయింది.”
28యేసు ఈ మాటలు చెప్పి ముగించిన తర్వాత ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. 29ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల్లా కాక ఒక అధికారం కలవానిగా బోధించారు.

Uwcholeuo

Rhanna

Copi

None

Eisiau i'th uchafbwyntiau gael eu cadw ar draws dy holl ddyfeisiau? Cofrestra neu mewngofnoda