Logo YouVersion
Eicon Chwilio

ఆది 2

2
1ఆ విధంగా ఆకాశం భూమి వాటిలో సమస్తం సంపూర్తి చేయబడ్డాయి.
2ఏడవ రోజు నాటికి దేవుడు తాను చేస్తున్న పనంతా ముగించారు; కాబట్టి ఏడవ రోజున తన పని అంతటి నుండి విశ్రాంతి తీసుకున్నారు. 3ఆ రోజున సృష్టి క్రియ అంతటి నుండి దేవుడు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఆయన ఆ రోజును దీవించి పరిశుద్ధపరిచారు.
ఆదాము హవ్వ
4యెహోవా దేవుడు భూమిని సృజించినప్పుడు, భూమ్యాకాశాల సృష్టి జరిగిన విధానం ఇదే.
5భూమి#2:5 లేదా నేల 6 మీద ఏ పొద కనిపించలేదు, మొక్క మొలవలేదు, ఎందుకంటే యెహోవా దేవుడు భూమి మీద వాన కురిపించలేదు, భూమిని సేద్యం చేయడానికి నరులు లేరు, 6అయితే భూమిలో నుండి నీటిబుగ్గలు#2:6 లేదా మంచు వచ్చి అంతా పారుతూ నేలను తడిపేవి. 7యెహోవా దేవుడు నేల మట్టితో మనుష్యుని#2:7 హెబ్రీలో మనుష్యుని ఆదాము లేదా ఆదామా ఈ పదాలు ఒకేలా ఉంటాయి; (20 చూడండి). చేసి, అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవి అయ్యాడు.
8యెహోవా దేవుడు తూర్పు దిక్కున ఏదెనులో తోట నాటి, అందులో తాను రూపించిన నరుని ఉంచారు. 9యెహోవా దేవుడు నేల నుండి కంటికి అందంగా కనిపించే ఆహారానికి సరియైన అన్ని రకాల చెట్లను మొలిపించారు. అలాగే ఆ తోట మధ్యలో జీవవృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞాన వృక్షం ఉన్నాయి.
10ఏదెను నుండి ఒక నది పారుతూ తోటను తడిపేది; అది అక్కడినుండి నాలుగు పాయలుగా చీలిపోయింది. 11ఈ నదులలో మొదటి దాని పేరు పీషోను; ఇది బంగారం ఉన్న హవీలా దేశం చుట్టూ పారుతుంది. 12ఆ దేశ బంగారం ఉండేది; సువాసనగల గుగ్గిలం#2:12 లేదా ముత్యాలు లేతపచ్చ రాళ్లు కూడా అక్కడ ఉండేవి. 13రెండవ నది పేరు గిహోను, అది కూషు#2:13 బహుశ ఆగ్నేయ మెసపొటేమియా అయి ఉండవచ్చు దేశమంతటా పారుతుంది. 14మూడవ నది పేరు టైగ్రీసు, అది అష్షూరు ప్రాంతానికి తూర్పున ప్రవహిస్తుంది. నాలుగవ నది యూఫ్రటీసు.
15ఏదెను తోటను సాగుచేయడానికి దానిని, జాగ్రత్తగా చూసుకోడానికి యెహోవా దేవుడు నరుని దానిలో ఉంచారు. 16యెహోవా దేవుడు ఆ నరునితో, “ఈ తోటలోని చెట్ల పండ్లన్నీ నీవు తినవచ్చు; 17కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకూడదు. అది తిన్న రోజున నీవు తప్పక చస్తావు” అని ఆజ్ఞాపించారు.
18యెహోవా దేవుడు, “నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి తగిన తోడును చేస్తాను” అని అనుకున్నారు.
19యెహోవా దేవుడు నేల మట్టితో ప్రతి విధమైన అడవి జంతువులను, ఆకాశ పక్షులను చేసి, ఆ మనుష్యుని దగ్గరకు తెచ్చి వాటికి అతడు ఏ పేర్లు పెడతాడో అని చూశారు; అతడు ఒక్కొక్క జీవికి ఏ పేరైతే పెట్టాడో అదే ఆ జీవికి పేరు అయ్యింది. 20ఆ మనుష్యుడు పశువులన్నిటికి, ఆకాశపక్షులకు, అడవి జంతువులన్నిటికి పేర్లు పెట్టాడు.
అయితే మనుష్యునికి#2:20 మనుష్యునికి లేదా ఆదాముకు తగిన తోడు దొరకలేదు. 21కాబట్టి యెహోవా దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలిగించి, అతని ప్రక్కటెముకల్లో ఒకటి తీసి, ఆ స్థలాన్ని మాంసంతో పూడ్చి వేశారు. 22అప్పుడు యెహోవా దేవుడు మనుష్యుని నుండి తీసిన ప్రక్కటెముకతో స్త్రీని చేసి అతని దగ్గరకు తెచ్చారు.
23అప్పుడు ఆ మనుష్యుడు ఇలా అన్నాడు:
“ఈమె నా ఎముకల్లో ఎముక,
నా మాంసంలో మాంసం;
ఈమె నరుని నుండి వచ్చింది కాబట్టి
ఈమె ‘నారీ’ అని పిలువబడుతుంది.”
24అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరు ఏకశరీరం అవుతారు.
25ఆదాము, అతని భార్య, ఇద్దరు నగ్నంగా ఉన్నారు, కానీ వారికి సిగ్గు అనిపించలేదు.

Dewis Presennol:

ఆది 2: OTSA

Uwcholeuo

Rhanna

Copi

None

Eisiau i'th uchafbwyntiau gael eu cadw ar draws dy holl ddyfeisiau? Cofrestra neu mewngofnoda