మత్తయి 16

16
సూచక క్రియ కొరకు బలవంతము చేయుట
1అప్పుడు కొందరు పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు యేసును పరీక్షించడానికి వచ్చి, ఆకాశం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు.
2అందుకు ఆయన, “సాయంకాలమైనప్పుడు, ఆకాశం ఎరుపుగా ఉంటే వాతావరణము మామూలుగానే ఉందని, 3అలాగే ఉదయాన ఆకాశం ఎరుపుగా, మబ్బుగా ఉంది కనుక ఈ రోజు గాలి వాన వస్తుందని మీరు చెప్తారు. ఆకాశం యొక్క వాతావరణ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు, కాని కాలాలను అర్థం చేసుకోలేరు. 4అయితే దుష్టులు, వ్యభిచారులైన తరం వారు సూచనను అడుగుతున్నారు, కానీ యోనా సూచన తప్ప వేరే ఏది వారికి ఇవ్వబడదు” అని చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను.
పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండి
5యేసు శిష్యులు అవతలి ఒడ్డుకు వెళ్లినప్పుడు వారు రొట్టెలు తీసుకువెళ్లడం మరచిపోయారు. 6యేసు వారితో, “పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని వారితో చెప్పారు.
7కనుక వారు, “మనం రొట్టెలు తీసుకురాలేదు కాబట్టి ఇలా అన్నాడని” తమలో తాము చర్చించుకున్నారు.
8వారు ఏమి చర్చించుకుంటున్నారో తెలిసినవాడై యేసు, “అల్పవిశ్వాసులారా, రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? 9మీరు ఇంకా గ్రహించలేక పోతున్నారా? ఐదు రొట్టెలు ఐదు వేలమందికి పంచినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తారు? 10లేక ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచినప్పుడు, ఎన్ని గంపలు ఎత్తారు? 11నేను మీతో మాట్లాడుతుంది రొట్టెల గురించి కాదని మీకెందుకు అర్థం కాలేదు? మీరు పరిసయ్యులు, సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి” అని వారితో చెప్పారు. 12అప్పుడు పులిసిన రొట్టెల పిండిని గురించి కాదు గాని పరిసయ్యులు, సద్దూకయ్యులు చేస్తున్న బోధ గురించి జాగ్రత్త అని యేసు తమతో చెప్పాడని వారు గ్రహించారు.
యేసే క్రీస్తు అని తెలియజేసిన పేతురు
13యేసు కైసరయ ఫిలిప్పు ప్రాంతానికి వచ్చినప్పుడు, “మనుష్యకుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని తన శిష్యులను అడిగారు.
14వారు ఆయనతో, “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అని, కొందరు ఏలీయా అని, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొంటున్నారని” జవాబిచ్చారు.
15అయితే ఆయన వారిని, “మరి మీరు ఏమనుకొంటున్నారు?” అని అడిగారు.
16అందుకు సీమోను పేతురు, “నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు” అని చెప్పాడు.
17అందుకు యేసు, “యోనా కుమారుడా సీమోను, నీవు ధన్యుడవు, రక్తమాంసములున్న వారి ద్వారా నీకు తెలియపరచబడలేదు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ సంగతిని నీకు తెలియజేసారు. 18నీవు పేతురువు,#16:18 పేతురువు అనగా బండ ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువలేవని నేను నీతో చెప్తున్నాను. 19పరలోక రాజ్యపు తాళపుచెవి నీకు ఇస్తున్నాను, నీవు భూమి మీద దేనిని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది, అలాగే భూమి మీద దేని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది” అని పేతురుతో చెప్పారు. 20ఆ తర్వాత యేసు, తానే క్రీస్తు అని ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఆదేశించారు.
తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు
21అప్పటి నుండి యేసు తాను యెరూషలేము పట్టణానికి వెళ్లి యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ రోజున తిరిగి లేస్తానని తన శిష్యులకు వివరించడం మొదలుపెట్టారు.
22అప్పుడు పేతురు, “ప్రభువా, అది నీ నుండి దూరమగు గాక, అలా నీకు ఎన్నడు జరుగకూడదు!” అని ఆయనను ప్రక్కకు తీసుకువెళ్లి గద్దింపసాగాడు.
23అప్పుడు యేసు పేతురు వైపు తిరిగి “సాతానా, నా వెనుకకు పో! నీవు నాకు ఆటంకంగా ఉన్నావు; నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు వున్నాయి” అన్నారు.
24అప్పుడు యేసు తన శిష్యులను చూసి, “ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. 25తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొనేవారు దానిని పోగొట్టుకొంటారు, కానీ నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకోడానికి తెగించే వారు దానిని దక్కించుకొంటారు. 26ఎవరైనా లోకమంతా సంపాదించుకొని తమ ప్రాణాన్ని పోగొట్టుకొంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు? 27ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.
28“ఇక్కడ నిలబడివున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యంతో రావడం చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.

Zur Zeit ausgewählt:

మత్తయి 16: TCV

Markierung

Teilen

Kopieren

None

Möchtest du deine gespeicherten Markierungen auf allen deinen Geräten sehen? Erstelle ein kostenloses Konto oder melde dich an.