మత్తయి 20

20
ద్రాక్షతోటలో పని చేసేవారి ఉపమానము
1యేసు పరలోక రాజ్యం గురించి వివరిస్తూ, “పరలోక రాజ్యం, తన ద్రాక్షతోటలో కూలికి పని చేసేవారిని తీసుకురావాలని వేకువనే బయలుదేరిన ఒక యజమానిని పోలి ఉంది. 2అతడు రోజుకు ఒక దేనారం#20:2 దేనారం ఒక రోజు కూలి కూలి ఇస్తానని ఒప్పుకొని తన ద్రాక్షతోటలోనికి పనికి వారిని పంపించాడు.
3“ఉదయకాలం దాదాపు తొమ్మిది గంటలకు ఏ పనిలేక ఖాళీగా సంతవీధిలో నిలబడి ఉన్న మరికొంతమందిని అతడు చూశాడు. 4వారితో, ‘మీరు కూడా వెళ్లి ద్రాక్షతోటలో పని చేయండి, మీకు ఏది న్యాయమో అది మీకు చెల్లిస్తాను’ అని వారితో చెప్పాడు. 5కనుక వారు కూడా వెళ్లారు.
“మళ్ళీ దాదాపు పన్నెండు గంటలకు, తిరిగి మూడు గంటలకు అతడు వెళ్లి అలాగే చేశాడు. 6దాదాపు ఐదు గంటలకు కూడా మరికొందరు ఏ పనిలేక ఖాళీగా సంతవీధిలో నిలబడి ఉన్నారని చూసి, ‘రోజంతా ఇక్కడ మీరు ఏ పనిలేక ఖాళీగా ఎందుకు నిలబడి ఉన్నారు?’ అని వారిని అడిగాడు.
7“అందుకు వారు, ‘ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు’ అని చెప్పారు.
“కనుక అతడు వారితో, ‘మీరు కూడా వెళ్లి, నా ద్రాక్షతోటలో పని చేయండి’ అని చెప్పాడు.
8“సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని తన గృహనిర్వాహకునితో, ‘పనివారిని పిలిచి వారికి చివరి నుండి మొదట వచ్చిన వారివరకు కూలి ఇవ్వుమని’ చెప్పాడు.
9“దాదాపు ఐదు గంటలకు కూలికి వచ్చినవారు వచ్చి ఒక్కొక్కరు ఒక దేనారం కూలి తీసుకొన్నారు. 10అది చూసి, మొదట కూలి పనికి వచ్చినవారు, మిగతా వారి కంటే తమకు ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశించారు. కాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు. 11-12వారు కూలి తీసుకొని, ‘మేము ఉదయం నుండి ఎండలో కష్టపడి పనిచేసాము అయినా చివరలో వచ్చి ఒక్క గంట మాత్రమే పని చేసిన వారితో సమానంగా కూలి ఇచ్చారు’ అని యజమానుని మీద సణుగుకొన్నారు.
13“అందుకు ఆ యజమాని వారిలో ఒకనితో, ‘స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదు. నీవు నా దగ్గర ఒక దేనారం కొరకే పని చేస్తానని ఒప్పుకొన్నావు కదా? 14నీవు నీ కూలిని తీసికొని వెళ్లు. నేను నీకు ఇచ్చినట్టే చివర వచ్చిన వానికి ఇవ్వడం నా ఇష్టం. 15నా సొంత డబ్బును నా ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకోవడానికి నాకు అధికారం లేదా? లేక నేను ధారాళంగా ఇస్తున్నానని నీవు అసూయపడుతున్నావా?’ అని అడిగాడు.
16“కనుక చివరివారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు” అని చెప్పారు.
యేసు మూడవసారి తన మరణాన్ని గురించి ముందే చెప్పుట
17యేసు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తన పన్నెండు మంది శిష్యులను ఏకాంతంగా తీసుకువెళ్లి దారిలో వారితో, 18“మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్యకుమారుడు ముఖ్యయాజకులకు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులకు అప్పగించబడతాడు. వారు ఆయనకు మరణశిక్ష విధించి, 19యూదేతరుల చేత అపహసించబడి, కొరడాలతో కొట్టబడి, సిలువ వేయబడడానికి అప్పగిస్తారు. అయితే ఆయన మూడవ రోజున సజీవంగా మరల తిరిగి లేస్తాడు!” అని చెప్పారు.
ఒక తల్లి విన్నపము
20అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి, ఆయన పాదాల ముందు మోకరించి ఒక మనవి చేసింది.
21యేసు ఆమెను, “నీకేమి కావాలి?” అని అడిగారు.
అందుకు ఆమె, “నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఇంకొకడు నీ ఎడమ వైపున కూర్చోడానికి అనుమతి ఇవ్వండి” అని ఆయనతో అన్నది.
22యేసు వారితో, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా?” అని అడిగారు.
వారు, “మేము త్రాగగలం” అని జవాబిచ్చారు.
23అప్పుడు యేసు వారితో, “వాస్తవానికి నా గిన్నెలోనిది మీరు త్రాగుతారు, కాని నా కుడి లేక ఎడమ వైపున కూర్చోడానికి అనుమతి ఇవ్వాల్సింది నేను కాదు. ఈ స్థానాలు నా తండ్రి ద్వారా ఎవరి కొరకు సిద్ధపరచబడి ఉన్నాయో వారికే చెందుతాయి” అని వారితో అన్నారు.
24ఇది విన్న తక్కిన పదిమంది శిష్యులు, ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపపడ్డారు. 25అప్పుడు యేసు వారినందరిని పిలిచి, “యూదులు కాని అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారు, వారి మీద అధికారం చెలాయిస్తారు, వారి పై అధికారులు కూడా వారి మీద అధికారం చెలాయిస్తారని మీకు తెలుసు. 26కాని మీరలా ఉండకూడదు. మీలో గొప్పవాడు కావాలని కోరేవాడు మీకు దాసునిగా ఉండాలి, 27మీలో మొదటి వానిగా ఉండాలని కోరుకొనేవాడు మీకు దాసునిలా ఉండాలి. 28ఎందుకనగా మనుష్యకుమారుడు సేవలు చేయించుకోడానికి రాలేదు గాని సేవ చేయడానికి, అనేకుల విమోచన కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు” అని చెప్పారు.
ఇద్దరు గ్రుడ్డివారు చూపును పొందుట
29యేసు అతని శిష్యులతో యెరికో పట్టణం దాటి వెళ్తున్నప్పుడు ఒక గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. 30దారి ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు!” అని బిగ్గరగా కేకలు వేశారు.
31ఆ జనసమూహం వారిని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండుమని వారికి చెప్పారు, కాని వారు, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు!” అని ఇంకా గట్టిగా కేకలు వేశారు.
32యేసు ఆగి వారిని పిలిపించి, “నేను మీకు ఏమి చేయాలని కోరుతున్నారు?” అని వారిని అడిగారు.
33వారు “ప్రభువా, మాకు చూపు కావాలి!” అని అన్నారు.
34యేసు వారి మీద కనికరపడి వారి కళ్ళను ముట్టాడు, వెంటనే వారు చూపు పొందుకొని ఆయనను వెంబడించారు.

Zur Zeit ausgewählt:

మత్తయి 20: TCV

Markierung

Teilen

Kopieren

None

Möchtest du deine gespeicherten Markierungen auf allen deinen Geräten sehen? Erstelle ein kostenloses Konto oder melde dich an.