మత్తయి 26
26
యేసుకు వ్యతిరేకంగా కుట్ర
1యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత, ఆయన తన శిష్యులతో, 2“మీకు తెలిసినట్లు, పస్కాకు ఇంకా రెండు రోజులున్నాయి, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడడానికి అప్పగించబడతాడు” అని చెప్పారు.
3అప్పుడు ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి కయప అనబడే ప్రధాన యాజకుని నివాసంలో సమావేశమయ్యారు. 4వారు యేసును రహస్యంగా పట్టుకొని, చంపాలి అని కుట్ర పన్నారు. 5కాని పండుగ సమయంలో వద్దు “జనాల మధ్య అల్లరి కలుగుతుందేమో” అని చెప్పుకున్నారు.
బేతనియలో యేసు అభిషేకించబడుట
6యేసు బేతనియ గ్రామంలో కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు, 7ఒక స్త్రీ చాలా ఖరీదైన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, ఆయన భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆయన తల మీద ఆ పరిమళద్రవ్యంను పోసింది.
8శిష్యులు అది చూసి కోపపడి, “ఇలా ఎందుకు వృధా చేయడం?” అని అడిగారు. 9వారు, “ఈ పరిమళద్రవ్యాన్ని ఎక్కువ వెలకు అమ్మి ఆ డబ్బు పేదవారికి ఇచ్చి ఉండాల్సింది” అన్నారు.
10యేసు ఆ సంగతి గ్రహించి వారితో, “ఈ స్త్రీని ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది. 11పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, కాని#26:11 ద్వితీ 15:11 నేను మీతో ఉండను. 12ఈమె ఈ పరిమళద్రవ్యంను నా శరీరం మీద పోసి, నా భూస్థాపన కొరకు నన్ను సిద్ధం చేసింది. 13సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినా, అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం చేసుకొని, ఈమె చేసినదాని గురించి కూడా చెప్పుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు.
యేసును పట్టించడానికి యూదా ఒప్పుకొనుట
14అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్యయాజకుల దగ్గరకు వెళ్లి, 15“నేను యేసును మీకు పట్టించడానికి నాకు ఏమి ఇస్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు ముప్పై వెండి నాణాలు లెక్కపెట్టి వానికి ఇచ్చారు. 16వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కొరకు ఎదురు చూసాడు.
పస్కా పండుగ
17పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “నీ కొరకు పస్కా#26:17 పస్కా పస్కా పండుగ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి పొందిన విడుదలను జ్ఞాపకం చేసుకొంటారు నిర్గమ 12 భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు.
18అందుకు యేసు, “మీరు పట్టణంలో ఫలాన వ్యక్తి దగ్గరకు వెళ్లి, అతనితో, బోధకుడు ఇలా అన్నాడు: నా సమయం దగ్గరకు వచ్చింది. నేను నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కాను ఆచరిస్తాను అని చెప్పమన్నాడు అని చెప్పండి” అన్నారు. 19శిష్యులు వెళ్లి యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేసి పస్కాను సిద్ధం చేశారు.
20సాయంకాలమైనప్పుడు, ఆయన పన్నెండు మంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. 21వారు భోజనం చేస్తూవుండగా, ఆయన వారితో, “మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అని అన్నారు.
22అందుకు వారు చాలా దుఃఖపడి, “ప్రభువా, నేనైతే కాదు కదా?” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనను అడగడం మొదలుపెట్టారు.
23అందుకు యేసు, “నాతో పాటు గిన్నెలో చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగిస్తాడు. 24మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు.
25అప్పుడు ఆయనను అప్పగించబోయే యూదా, “బోధకుడా, నేనైతే కాదు కదా?” అని అడిగాడు.
అందుకు యేసు, “అలా నీవే చెప్పావు” అని జవాబిచ్చారు.
26వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకొని, దాని కొరకు కృతజ్ఞతలు చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసికొని తినండి; ఇది నా శరీరం” అని చెప్పారు.
27తర్వాత ఆయన పాత్రను తీసుకొని, కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, “దీనిలోనిది మీరందరు త్రాగండి. 28ఇది అనేకుల పాపక్షమాపణ కొరకు నేను చిందించనున్న నా నిబంధన రక్తం. 29నేను మీతో చెప్పేదేమనగా, నా తండ్రి రాజ్యంలో మీతో కూడ నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగను.”
30వారు ఒక కీర్తన పాడిన తర్వాత, ఒలీవల కొండకు వెళ్లారు.
పేతురు తనను నిరాకరించుట గురించి ముందే చెప్పిన యేసు
31అప్పుడు యేసు వారితో, “నన్ను బట్టి ఈ రాత్రి మీరందరు చెదరిపోతారు ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది:
“ ‘నేను గొర్రెల కాపరిని కొడతాను,
అప్పుడు మందలోని గొర్రెలు చెదరిపోతాయి.’#26:31 జెకర్యా 13:7
32కాని నేను తిరిగి లేచిన తర్వాత, మీకంటే ముందు గలిలయకు వెళ్తాను” అన్నారు.
33అందుకు పేతురు, “అందరు నిన్ను విడిచి వెళ్లిపోయినా, నేను నిన్ను విడువను” అన్నాడు.
34అందుకు యేసు అతనితో, “ఈ రాత్రి కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
35కాని పేతురు యేసుతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా, నీవెవరో నాకు తెలియదని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరు కూడా అలాగే అన్నారు.
గెత్సేమనే తోట
36ఆ తర్వాత యేసు తన శిష్యులతో కూడ గెత్సేమనే అనే చోటికి వెళ్లారు, ఆయన వారితో, “నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చేవరకు మీరు ఇక్కడే కూర్చోండి” అని చెప్పారు. 37ఆయన పేతురును, జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుతూ బాధపడసాగారు. 38ఆయన వారితో, “నేను చనిపోయే అంతగా నా ప్రాణం దుఃఖంలో నిండిపోయింది, కనుక మీరు ఇక్కడే ఉండి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పారు.
39కొంత దూరం వెళ్లి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తొలగిపోనివ్వు. అయినా నా చిత్తప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించు” అని ప్రార్థించారు.
40యేసు తిరిగి తన శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్రిస్తున్నారని చూసి పేతురుతో, “ఒక గంటయైనా నాతో మెలకువగా ఉండలేరా?” అని అడిగి, 41“మీరు శోధనలో పడకుండ ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం” అని చెప్పారు.
42ఆయన రెండవ సారి వెళ్లి ప్రార్థించారు, “నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే తప్ప ఇది నా దగ్గరి నుండి తొలగిపోవడం సాధ్యం కానట్లైతే, నీ చిత్తమే నెరవేర్చు.”
43ఆయన తిరిగి వచ్చినప్పుడు, వారి కళ్ళు బరువుగా ఉన్నాయి, కనుక వారు మళ్ళీ నిద్రపోతున్నారని గమనించారు. 44కనుక ఆయన మరొకసారి వారిని విడిచివెళ్లి, ఆ మాటలనే పలుకుతు మూడవసారి ప్రార్థించారు.
45అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరకు తిరిగి వచ్చి, “మీరు ఇంకా నిద్రిస్తు విశ్రాంతి తీసుకొంటున్నారా? చూడండి, మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది. 46లేవండి! మనం వెళ్దాం. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు” అని చెప్పారు.
యేసు బంధించబడుట
47ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు మరియు ప్రజానాయకుల వద్దనుంచి పంపబడిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకొని వచ్చింది. 48ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు, “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించాలి” 49యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా, నీకు శుభం” అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు.
50అందుకు యేసు, “స్నేహితుడా, ఏమి చేయడానికి వచ్చావో అది చెయ్యి” అన్నారు.
అప్పుడు వారు ముందుకు వచ్చి, యేసును అడ్డుకుని, ఆయనను బంధించారు. 51అంతలో, యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, వాని చెవిని నరికివేసాడు.
52యేసు వానితో, “నీ కత్తిని వరలో తిరిగిపెట్టు, ఎందుకంటే కత్తి ఉపయోగించేవాడు కత్తితోనే చస్తాడు. 53ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకొంటే, ఆయన పన్నెండు దళాల సైన్యం కంటే ఎక్కువ మంది దూతలను వెంటనే నాకు పంపడని అనుకున్నావా? 54కాని, ఈ విధంగా జరగాలని లేఖనాలలో చెప్పబడినవి ఎలా నెరవేరుతాయి?” అని అన్నారు.
55ఆ సమయంలోనే యేసు ఆ గుంపుతో, “నన్ను పట్టుకోడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా? నేను ప్రతి రోజు దేవాలయ ఆవరణంలో కూర్చొని బోధించేటప్పుడు, మీరు నన్ను బంధించలేదు. 56అయితే ప్రవక్తలు వ్రాసిన లేఖనాలు నెరవేరడానికే ఈ విధంగా జరిగింది” అని చెప్పారు. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయారు.
న్యాయసభ ముందు యేసు
57యేసును బంధించినవారు ఆయనను ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకొనివెళ్లారు, అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు యూదా నాయకులు సమావేశమై ఉన్నారు. 58అయితే పేతురు ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణం వరకు, ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. లోపల ఏమి జరుగుతుందో చూడాలని అక్కడే సైనికులతో కూర్చున్నాడు.
59ముఖ్య యాజకులు మరియు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలను వెదకుతున్నారు. 60చాలామంది అబద్ధ సాక్షులు ముందుకు వచ్చారు, కానీ వారికి ఏమి దొరకలేదు.
చివరికి ఇద్దరు సాక్షులు ముందుకొచ్చారు. 61వారిచ్చిన సాక్ష్యం ఏంటంటే, “ఈయన దేవాలయాన్ని పడగొట్టి, మూడు దినాల్లో దానిని లేపుతాను అని చెప్పాడు.”
62అప్పుడు ప్రధాన యాజకుడు లేచి యేసుతో, “నీవు జవాబు చెప్పవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న ఈ సాక్ష్యం ఏమిటి?” అని అడిగాడు. 63అయితే యేసు మౌనంగా ఉన్నారు.
అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “జీవంగల దేవుని తోడని నిజం చెప్పు: ఒకవేళ నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాతో చెప్పు” అన్నాడు.
64అందుకు యేసు, “నీవే చెప్పినట్లే, అయితే, ఇక నుండి మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడి వైపున కూర్చొని ఉండడం మరియు ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారని మీ అందరికి చెప్తున్నాను.”#26:64 కీర్తన 110:1; దాని 7:13
65అప్పుడు ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొని, “వీడు దైవదూషణ చేశాడు! ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? చూడండి, ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. 66మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు.
వారు, “ఇతనికి మరణశిక్ష విధించాలి” అని సమాధానం ఇచ్చారు.
67అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఆయనను వారి పిడికిళ్ళతో గుద్దారు, మరికొందరు ఆయనను తమ అరచేతులతో కొట్టి, 68“క్రీస్తు, నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు” అన్నారు.
పేతురు యేసును ఎరుగననుట
69పేతురు బయట ప్రాంగణంలో కూర్చుని ఉన్నప్పుడు, అక్కడ ఒక దాసియైన అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. “నీవు కూడా గలిలయవాడైన యేసుతో ఉన్నవాడివే” అన్నది.
70అయితే పేతురు అందరి ముందు తిరస్కరించి, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అన్నాడు.
71తర్వాత అతడు ద్వారం వైపు వెళ్లాడు, అక్కడ మరొక దాసియైన అమ్మాయి అతన్ని చూసి అక్కడ ఉండిన ప్రజలతో, “ఇతడు నజరేయుడైన యేసుతో ఉన్నవాడే” అని చెప్పింది.
72పేతురు ఈ సారి ఒట్టు పెట్టుకొంటూ, “అతడు నాకు తెలియదు” అని మళ్ళీ తిరస్కరించాడు.
73కొంతసేపటి తర్వాత, అక్కడ నిలబడినవారు పేతురు దగ్గరకు వెళ్లి, “ఖచ్చితంగా నీవు కూడ వారిలో ఒకడివి; నీ మాట తీరే చెప్తుంది” అన్నారు.
74అప్పుడు పేతురు శపించడం మొదలుపెట్టి మరియు వారితో ఒట్టుపెట్టుకొని, “అతని గురించి నాకు తెలియదు!” అన్నాడు.
వెంటనే కోడి కూసింది. 75“కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకొని బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.
Zur Zeit ausgewählt:
మత్తయి 26: TCV
Markierung
Teilen
Kopieren

Möchtest du deine gespeicherten Markierungen auf allen deinen Geräten sehen? Erstelle ein kostenloses Konto oder melde dich an.
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.