Logo de YouVersion
Ícono Búsqueda

ఆదికాండము 5

5
1ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను; 2మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. 3ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. 4షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను. 5ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
6షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను. 7ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. 8షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
9ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను. 10కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. 11ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయి దేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
12కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను. 13మహలలేలును కనినతరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. 14కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
15మహలలేలు అరువదియైదేండ్లు బ్రదికి యెరెదును కనెను. 16యెరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పదియేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. 17మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
18యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను. 19హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. 20యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
21హనోకు అరువదియైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను. 22హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 23హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు. 24హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
25మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను. 26మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. 27మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
28లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని 29–భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు#5:29 నోవహు అనగా నెమ్మది. అని పేరు పెట్టెను. 30లెమెకు నోవహును కనిన తరువాత ఐనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. 31లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
32నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.

Destacar

Compartir

Copiar

None

¿Quieres guardar tus resaltados en todos tus dispositivos? Regístrate o Inicia sesión

Video de ఆదికాండము 5