Logo YouVersion
Îcone de recherche

ఆదికాండము 10

10
1ఇది నోవహు కుమారులగు షేము హాము యాపె తను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
2యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు. 3గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు. 4యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు. 5వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆయా దేశములలో వారు వేరైపోయిరి.
6హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు. 7కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు. 8కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను. 9అతడు యెహోవాయెదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి–యెహోవా యెదుట పరా క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు. 10షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. 11ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును 12నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము. 13మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను 14పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూ హీయులలోనుండి వచ్చినవారు.
15కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను హివ్వీయులను అర్కీయులను సినీయులను 16-18అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. 19కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషావరకును ఉన్నది. 20వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులనుబట్టియు హాము కుమారులు.
21మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను. 22షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామనువారు. 23అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు. 24అర్ప క్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. 25ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. 26యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మా వెతును యెరహును 27-29హదోరమును ఊజాలును దిక్లాను ఓబాలును అబీమాయెలును షేబను ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు. 30మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము. 31వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు.
32వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.

Surbrillance

Partager

Copier

None

Tu souhaites voir tes moments forts enregistrés sur tous tes appareils? Inscris-toi ou connecte-toi