Logo YouVersion
Îcone de recherche

ఆదికాండము 16

16
1అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను. 2కాగా శారయి–ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను. 3కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయురాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. 4అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దానిదృష్టికి నీచమైనదాయెను. 5అప్పుడు శారయి– నా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటి కిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దానిదృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. 6అందుకు అబ్రాము–ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా 7యెహోవాదూత అరణ్యములో నీటిబుగ్గయొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని 8–శారయి దాసివైన హాగరూ, ఎక్కడనుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్లుచున్నావని అడిగినందుకు అది–నా యజమానురాలైన శారయియొద్దనుండి పారిపోవుచున్నాననెను. 9అప్పుడు యెహోవాదూత– నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణగియుండుమని దానితో చెప్పెను. 10మరియు యెహోవాదూత–నీ సంతానమును నిశ్చయముగా విస్త రింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవు నని దానితో చెప్పెను. 11మరియు యెహోవాదూత– ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు#16:11 దేవుడు వినును. అను పేరు పెట్టుదువు; 12అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా 13అది–చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. 14అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్ లహాయిరోయి#16:14 నన్ను చూచుచున్న సజీవునిబావి. అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది. 15తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. 16హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు.

Surbrillance

Partager

Copier

None

Tu souhaites voir tes moments forts enregistrés sur tous tes appareils? Inscris-toi ou connecte-toi