YouVersion logo
Ikona pretraživanja

యోహాను 4

4
యేసు గలిలయకు తరలి పోవడం
1యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిసమిస్తున్నాడని పరిసయ్యులు విన్నారని ప్రభువుకు తెలిసింది. 2నిజానికి యేసు తానే బాప్తిసం ఇవ్వలేదు, ఆయన శిష్యులు ఇస్తూ ఉన్నారు. 3అప్పుడు ఆయన యూదయ దేశం నుండి ప్రయాణమై గలిలయ దేశానికి వెళ్ళాడు. 4మార్గంలో సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. 5అలా ఆయన సమరయలో ఉన్న సుఖారు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరి దగ్గరే యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు.
సమరయ స్త్రీతో యేసు
6యాకోబు బావి అక్కడ ఉంది. యేసు ప్రయాణంలో అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం.
7ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, “తాగడానికి నీళ్ళు ఇస్తావా?” అని అడిగాడు. 8ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. 9ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, “నువ్వు యూదుడివి. సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు?” ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోరు. 10దానికి యేసు, “నువ్వు దేవుని బహుమానాన్నీ, తాగడానికి నీళ్ళు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తినీ తెలుసుకుంటే నువ్వే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు” అన్నాడు.
11అప్పుడా స్త్రీ, “అయ్యా, ఈ బావి చాలా లోతు. తోడుకోడానికి నీ దగ్గర చేద లేదు. ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది? 12మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?” అంది. 13దానికి యేసు, “ఈ నీళ్ళు తాగే ప్రతి ఒక్కరికీ మళ్ళీ దాహం వేస్తుంది.
అంతరంగంలో నివాసముండే ఆత్మ
యోహా 7:37-39
14 కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నేను వారికిచ్చే నీళ్ళు అయితే వారిలో నిత్య జీవానికి ఊరుతూ ఉండే ఊట అవుతాయి” అన్నాడు.
15అప్పుడు ఆమె ఆయనతో, “అయ్యా, నీళ్ళు చేదుకోడానికి నేను ఇంత దూరం రానవసరం లేకుండా ఆ నీళ్ళు నాకివ్వు” అంది. 16యేసు ఆమెతో, “నువ్వు వెళ్ళి నీ భర్తను ఇక్కడికి తీసుకురా” అన్నాడు. 17దానికి ఆ స్త్రీ, “నాకు భర్త లేడు” అంది. యేసు ఆమెతో, “‘భర్త లేడని సరిగ్గానే చెప్పావు. 18ఎందుకంటే నీకు ఐదుగురు భర్తలున్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు” అన్నాడు.
19అప్పుడా స్త్రీ, “అయ్యా, నువ్వు ఒక ప్రవక్తవి అని నాకు అర్థమౌతున్నది. 20మా పూర్వీకులు ఈ కొండ పైన ఆరాధించారు. కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందనీ అందరూ అక్కడికే వెళ్ళి ఆరాధించాలనీ మీరు అంటారు” అంది.
అందుకు యేసు ఇలా చెప్పాడు. 21“అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము. 22మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. 23నిజమైన ఆరాధికులు తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. తనను ఆరాధించేవారు అలాటివారే కావాలని తండ్రి చూస్తున్నాడు.
24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.” 25అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు అని పిలిచే మెస్సీయ వస్తున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు అంతా వివరిస్తాడు” అంది. 26అది విని యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అని చెప్పాడు.
27ఇదే సమయానికి ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉండడం చూసి ‘ఎందుకు మాట్లాడుతున్నాడా’ అని ఆశ్చర్యపడ్డారు. కానీ ‘నీకేం కావాలని’ గానీ ‘ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు’ అని గానీ ఎవరూ అడగలేదు. 28ఇక ఆ స్త్రీ తన నీళ్ళ కుండ అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. 29ఆ ఊరి వారితో, “మీరు నాతో వచ్చి నేను చేసిన పనులన్నిటినీ నాతో చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయన క్రీస్తు కాడా?” అంది. 30వారంతా ఊరి నుండి బయలు దేరి ఆయన దగ్గరికి వచ్చారు.
31ఆలోగా శిష్యులు, “బోధకా, భోజనం చెయ్యి” అని ఆయనను బతిమాలారు. 32దానికి ఆయన, “తినడానికి మీకు తెలియని ఆహారం నాకుంది” అని వారితో చెప్పాడు. 33“ఆయన తినడానికి ఎవరైనా భోజనం ఏదైనా తెచ్చారా ఏమిటి?” అని శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
34యేసు వారిని చూసి, “నన్ను పంపించిన వాని ఇష్టాన్ని చేయడం, ఆయన పని చేసి ముగించడమే నా ఆహారం. 35పంట కోయడానికి కోతకాలం రావాలంటే ఇంకా నాలుగు నెలలు ఉన్నాయని మీరు చెబుతారు కదా! మీ తలలెత్తి పొలాలను చూడండి. అవి ఇప్పటికే పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉన్నాయని మీతో చెబుతున్నాను. 36విత్తనాలు చల్లేవాడూ పంట కోసేవాడూ కలసి సంతోషించేలా కోసేవాడు జీతం తీసుకుని శాశ్వత జీవం కోసం ఫలాన్ని సమకూర్చుకుంటున్నాడు.
37 ఈ విషయంలో “విత్తనాలు చల్లేది ఒకరు, పంట కోసేది మరొకరు, అనే మాట నిజమే. 38మీరు దేని కోసం ప్రయాస పడలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు చాకిరీ చేశారు. వారి కష్టఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు” అన్నాడు.
39‘నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు’ అంటూ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ పట్టణంలోని అనేక మంది సమరయులు ఆయనలో విశ్వాసముంచారు.
సమరయ ప్రజానీకంతో యేసు
40ఆ సమరయ వారు ఆయన దగ్గరికి వచ్చి తమతో ఉండమని ఆయనను వేడుకున్నారు. కాబట్టి ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నాడు. 41ఆయన మాటలు విని ఇంకా చాలా మంది ఆయనలో విశ్వాసముంచారు. వారు ఆ స్త్రీతో, “మేము విశ్వసించింది కేవలం నీ మాట మీదే కాదు. 42మేము కూడా ఆయన మాటలు విన్నాం. ఇప్పుడు ఈయన నిజంగా ఈ లోక రక్షకుడని తెలుసుకున్నాం” అన్నారు.
43ఆ రెండు రోజులయ్యాక ఆయన గలిలయకు ప్రయాణమై వెళ్ళాడు. 44ఎందుకంటే ఏ ప్రవక్తా తన స్వదేశంలో గౌరవం పొందడని ఆయనే స్వయంగా ప్రకటించాడు. 45ఆయన గలిలయకు వచ్చినప్పుడు గలిలయులు ఆయనకు స్వాగతం పలికారు. పండగ ఆచరించడం కోసం గలిలయులు కూడా యెరూషలేముకు వెళ్తారు. అక్కడ ఆయన చేసిన పనులన్నీ వారు చూశారు.
46యేసు గలిలయలోని కానా అనే ఊరికి వచ్చాడు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చింది ఇక్కడే. అదే సమయంలో కపెర్నహూములో ఒక అధికారి కొడుకు జబ్బుపడి ఉన్నాడు. 47యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడనీ వచ్చి బాగుచేయాలనీ ఆయనను వేడుకున్నాడు. 48యేసు అతడితో ఇలా అన్నాడు, “సూచనలూ అద్భుతాలూ చూడందే మీరు నమ్మనే నమ్మరు.” 49అందుకా అధికారి, “ప్రభూ, నా కొడుకు చావక ముందే రా” అని వేడుకున్నాడు. 50యేసు అతడితో, “నువ్వు వెళ్ళు. నీ కొడుకు బతుకుతాడు” అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు వెళ్ళి పోయాడు.
51అతడు దారిలో ఉండగానే అతడి సేవకులు ఎదురొచ్చారు. అతని కొడుకు బతికాడని తెలియజేశారు. 52“ఏ సమయంలో వాడు బాగవ్వడం ప్రారంభమైంది” అని అతడు వారిని అడిగాడు. వారు, “నిన్న ఒంటి గంటకు జ్వరం తగ్గడం మొదలైంది” అని చెప్పారు. 53‘నీ కొడుకు బతికి ఉన్నాడు’ అని యేసు తనతో చెప్పిన సమయం సరిగ్గా అదేనని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి అతడూ, అతని ఇంట్లో అందరూ నమ్మారు. 54ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.

Istaknuto

Podijeli

Kopiraj

None

Želiš li svoje istaknute stihove spremiti na sve svoje uređaje? Prijavi se ili registriraj