ఆదికాండము 20

20
1అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను. 2అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారానుగూర్చి–ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను. 3అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి –నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను. 4అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు–ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? 5–ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ–అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితిననెను. 6అందుకు దేవుడు–అవును, యథార్థహృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు. 7కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. 8తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరిని పిలిపించి ఈ సంగతు లన్నియు వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి. 9అబీమెలెకు అబ్రాహామును పిలిపించి–నీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. 10మరియు అబీమెలెకు–నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహాము నడుగగా 11అబ్రాహాము–ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదు రనుకొని చేసితిని. 12అంతేకాక–ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది. 13దేవుడు నన్ను నా తండ్రియిల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి–మనము పోవు ప్రతి స్థలమందు– ఇతడు నా సహోదరుడని నన్నుగూర్చి చెప్పుము; నీవు నాకు చేయవలసిన ఉపకారమిదేయని చెప్పితిననెను. 14అబీమెలెకు గొఱ్ఱెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి, అబ్రాహాముకిచ్చి అతని భార్యయైన శారాను అతనికి తిరిగి అప్పగించెను. 15అప్పుడు అబీమెలెకు–ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను. 16మరియు అతడు శారాతో– ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. 17అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలుకనిరి. 18ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారానుబట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.

Kiemelés

Megosztás

Másolás

None

Szeretnéd, hogy a kiemeléseid minden eszközödön megjelenjenek? Regisztrálj vagy jelentkezz be