యోహాను 8

8
1యేసు ఒలీవలకొండకు వెళ్లెను. 2తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. 3శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి 4–బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; 5అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. 6ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. 7వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి–మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి 8మరల వంగి నేలమీద వ్రాయుచుండెను. 9వారామాట విని,#8:9 కొన్ని ప్రాచీన ప్రతులలోమనస్సాక్షిచేత గద్దింపబడినవారై అని కూర్చబడియున్నది. పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీమధ్యను నిలువబడియుండెను. 10యేసు తలయెత్తి చూచి–అమ్మా, వారెక్కడ ఉన్నారు?#8:10 కొన్ని ప్రాచీన ప్రతులలోనీ మీద నేరము మోపిన వారెక్కడనున్నారు అని పాఠాంతరము. ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు 11ఆమె –లేదు ప్రభువా అనెను. అందుకు యేసు–నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
12మరల యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. 13కాబట్టి పరిసయ్యులు–నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా 14యేసు– నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు. 15మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను. 16నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. 17మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా. 18నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను. 19వారు–నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు–మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రిని కూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను. 20ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.
21మరియొకప్పుడు ఆయన–నేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనేయుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. 22అందుకు యూదులు–నేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపు కొనునా అని చెప్పుకొనుచుండిరి. 23అప్పుడాయన–మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను. 24కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను. 25కాబట్టి వారు–నీ వెవరవని ఆయన నడుగగా యేసు వారితో–మొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే. 26మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. 27తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహిం పక పోయిరి. 28కావున యేసు–మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. 29నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. 30ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి.
31కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో–మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; 32అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా 33వారు–మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. 34అందుకు యేసు–పాపముచేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 35దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును. 36కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతం త్రులైయుందురు. 37మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. 38నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. 39అందుకు వారు ఆయనతో–మా తండ్రి అబ్రాహామనిరి; యేసు–మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. 40దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు. 41మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు– మేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా 42యేసు వారితో ఇట్లనెను–దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. 43మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా? 44మీరు మీ తండ్రియగు అపవాది#8:44 అనగా, సాతాను. సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై#8:44 లేక, అబద్ధికునికి జనకుడునై. యున్నాడు. 45నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. 46నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు? 47దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. 48అందుకు యూదులు–నీవు సమరయుడవును దయ్యముపెట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా 49యేసు–నేను దయ్యముపెట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచు వాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు. 50నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. 51ఒకడు నా మాట గైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడని#8:51 మూలభాషలోమరణము చూడడని. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. 52అందుకు యూదులు–నీవు దయ్యము పెట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను –ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు. 53మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడ వని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి. 54అందుకు యేసు–నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; –మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పు దురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. 55మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. 56మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను. 57అందుకు యూదులు– నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, 58యేసు–అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 59కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను.

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요