లూకా 13

13
1పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా 2ఆయన వారితో ఇట్లనెను–ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందునవారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారా? 3కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు. 4మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా? 5కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.
6మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –ఒక మనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చి నప్పుడు ఏమియు దొరకలేదు 7గనుక అతడు–ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను. 8అయితే వాడు–అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడ ఉండనిమ్ము; 9అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను.
10విశ్రాంతిదినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు 11పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యము#13:11 మూలభాషలో–ఆత్మ. పట్టిన యొక స్ర్తీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. 12యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి–అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి 13ఆమెమీద చేతులుంచ గానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. 14యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహమును చూచి–పనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను. 15అందుకు ప్రభువు–వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలుకొనిపోయి, నీళ్లు పెట్టును గదా. 16ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింప దగదా? అని అతనితో చెప్పెను. 17ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను.
18ఆయన–దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాని పోల్తును? 19ఒక మనుష్యుడు తీసికొనిపోయి తన తోటలోవేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశపక్షులు దాని కొమ్మలయందు నివసించెననెను. 20మరల ఆయన–దేవుని రాజ్యమును దేనితో పోల్తును? 21ఒక స్ర్తీ తీసికొని, అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను.
22ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచా రము చేయుచుండెను. 23ఒకడు–ప్రభువా, రక్షణపొందువారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా 24ఆయన వారిని చూచి–ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను. 25ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి–అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు 26ఆయన–మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు. 27అప్పుడాయన– మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమముచేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును. 28అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. 29మరియు జనులు తూర్పునుండియు పడమటనుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు. 30ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.
31ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి–నీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా 32ఆయన వారిని చూచి–మీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి– ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్లగొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవదినమున పూర్ణ సిద్ధి పొందెదను. 33అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. 34యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి. 35ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది– ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.

선택된 구절:

లూకా 13: TELUBSI

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요