లూకా 17

17
1ఆయన తన శిష్యులతో ఇట్లనెను–అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ. 2వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. 3మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందినయెడల అతని క్షమించుము. 4అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగి–మారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపవలెననెను.
5అపొస్తలులు–మా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా 6ప్రభువు–మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచి–నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. 7దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చినప్పుడు–నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు. 8అంతేకాక–నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని 9ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? 10అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత – మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.
11ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయలమధ్యగా వెళ్లుచుండెను. 12ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి 13–యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. 14ఆయన వారిని చూచి–మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి. 15వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి 16గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు. 17అందుకు యేసు–పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? 18ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి 19–నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.
20దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయన–దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. 21ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తర మిచ్చెను.
22మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను–మనుష్య కుమారుని దినములలో ఒకదినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చునుగాని మీరు ఆ దినమును చూడరు. 23వారు–ఇదిగో యిక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినయెడల వెళ్లకుడి, వెంబడింపకుడి. 24ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరిసి, ఆకాశముక్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును. 25అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరము వారిచేత ఉపేక్షింపబడవలెను.
26నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. 27నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను. 28లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. 29అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను. 30ఆప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. 31ఆ దినమున మిద్దెమీదఉండు వాడు ఇంటఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగకూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. 32లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి. 33తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. 34ఆ రాత్రి యిద్దరొక్క మంచముమీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును. 35-37ఇద్దరు స్ర్తీలు ఒక్క తిరుగలి విసరుచుందురు; ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్టబడుననెను. శిష్యులు–ప్రభువా, యిది ఎక్కడ (జరుగు) నని ఆయన నడిగినందుకు ఆయన–పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను.

선택된 구절:

లూకా 17: TELUBSI

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요