Лого на YouVersion
Икона за пребарување

లూకా 15

15
సణుక్కున్న పరిసయ్యులు
1తరువాత ఒకసారి పన్నులు వసూలు చేసేవారూ, పాపులూ అనేకమంది ఆయన ఉపదేశం వినడానికి ఆయన దగ్గరికి వచ్చారు. 2పరిసయ్యులూ, ధర్మశాస్త్ర పండితులూ అది చూసి, “ఈ మనిషి పాపులను దగ్గరికి రానిస్తూ వారితో కలసి భోజనం చేస్తున్నాడు” అని సణుక్కున్నారు. 3అందుకాయన వారికి ఈ ఉపమానం చెప్పాడు,
కనిపించకుండా పోయిన గొర్రె ఉపమానం
మత్తయి 18:12-24
4 “మీలో ఏ మనిషికైనా వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను అడవిలో వదిలి, వెళ్ళి ఆ తప్పిపోయిన గొర్రె దొరికేంత వరకూ వెదకడా?” 5అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులనూ, ఇరుగుపొరుగు వారినీ పిలిచి 6‘మీరు నాతో కలిసి సంతోషించండి. ఎందుకంటే తప్పిపోయిన నా గొర్రె దొరికింది’ అని వారితో చెబుతాడు కదా. 7అలాగే పశ్చాత్తాపం అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే పశ్చాత్తాపం పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది.
పోయిన నాణెం
8 “ఒకామెకు పది వెండి నాణాలు ఉండి వాటిలో ఒకటి పోతే ఆమె దాని కోసం దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి పోయిన నాణెం దొరికే వరకూ జాగ్రత్తగా వెదకదా? 9అది దొరికినప్పుడు తన స్నేహితురాళ్ళనూ ఇరుగుపొరుగు వారినీ పిలిచి, ‘నేను పోగొట్టుకున్న నాణెం దొరికింది కాబట్టి నాతో కలసి సంతోషించండి’ అంటుంది కదా. 10అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి దేవుని దూతల సముఖంలో సంతోషం కలుగుతుందని మీకు చెబుతున్నాను” అన్నాడు.
ఇల్లు విడిచి వెళ్ళిపోయిన కొడుకు
11ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. 12వారిలో చిన్నవాడు ‘నాన్నా, ఆస్తిలో నా వాటా నాకు పంచి ఇవ్వు’ అన్నాడు. తండ్రి తన ఆస్తిని వారికి పంచి ఇచ్చాడు. 13కొద్ది రోజుల తరువాత చిన్న కొడుకు తనకున్నదంతా కూడగట్టుకుని దూర దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ తన డబ్బంతా దుర్వ్యసనాలపై విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. 14అంతా ఖర్చయిపోయాక ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతనికి ఇబ్బందులు మొదలైనాయి. 15దాంతో అతడు వెళ్ళి ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరాడు. ఆ వ్యక్తి అతనిని తన పందులు మేపడానికి తన పొలాల్లోకి పంపించాడు. 16అతడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశ పడ్డాడు. కానీ అతనికి ఎవరూ ఏమీ ఇవ్వలేదు.
17 అతనికి బుద్ధి వచ్చింది. అతడిలా అనుకున్నాడు, ‘నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళకు ఆహారం పుష్కలంగా ఉంది. నేనేమో ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. 18నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. 19ఇక నుండి నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు ఏ అర్హతా లేదు. నన్ను నీ కూలీల్లో ఒకడిగా పెట్టుకో అని చెబుతాను.’ ఇలా అనుకుని అతడు లేచి తన తండ్రి దగ్గరికి వచ్చాడు.
20 అతడింకా దూరంగా ఉండగానే తండ్రి అతణ్ణి చూసి కనికరపడి, పరుగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. 21అప్పుడు ఆ కొడుకు తండ్రితో, ‘నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి నాకు ఏ యోగ్యతా లేదు’ అన్నాడు.
22 “అయితే తండ్రి తన సేవకులతో, “శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడగండి. 23కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంబరాలు చేసుకుందాం. 24నా ఈ కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు’ అని చెప్పాడు. అప్పుడు వారంతా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు.
పరిసయ్యుల మనస్తత్వం
25 “ఆ సమయంలో అతని పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు ఇంటిని సమీపిస్తుండగా సంగీతం, నాట్యధ్వని అతనికి వినిపించాయి. 26ఒక సేవకుణ్ణి పిలిచి, ‘ఏం జరుగుతోంది?’ అని అడిగాడు. 27ఆ పనివాడు అతనితో, ‘నీ తమ్ముడు వచ్చాడు. అతడు తన దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు.
28 దాంతో పెద్ద కొడుక్కి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళలేదు. అతని తండ్రి బయటకు వచ్చి అతణ్ణి లోపలికి రమ్మని బతిమాలాడు. 29కాని అతడు, ‘ఇదిగో విను, ఇన్నేళ్ళ నుండి నీకు సేవలు చేస్తున్నాను. ఏనాడూ నీ మాట జవదాటలేదు. అయినా నా స్నేహితులతో కలసి సంబరం చేసుకోడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు. 30కానీ నీ ఆస్తిని వేశ్యలకు ఖర్చు చేసిన నీ చిన్న కొడుకు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధించావు’ అంటూ నిష్టూరంగా మాట్లాడాడు. 31అందుకతని తండ్రి, ‘నాయనా, నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నావన్నీ నీవే. 32మనం సంతోషంగా పండగ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు’ అని చెప్పాడు.”

Селектирано:

లూకా 15: IRVTel

Нагласи

Сподели

Копирај

None

Дали сакаш да ги зачуваш Нагласувањата на сите твои уреди? Пријави се или најави се