1
1ఇది ఇశ్రాయేలు ప్రజలకు మలాకీ#1:1 మలాకీ అంటే నా సందేశకుడు ద్వారా ఇవ్వబడిన యెహోవా ప్రవచన వాక్కు.
దేవుని ప్రేమను అనుమానించిన ఇశ్రాయేలు
2యెహోవా ఇలా అంటున్నారు, “నేను మిమ్మల్ని ప్రేమించాను.”
“కాని మీరు, ‘నీవెలా మమ్మల్ని ప్రేమించావు?’ అని అడుగుతున్నారు.
“ఏశావు యాకోబుకు అన్న కాడా? అయినా నేను యాకోబును ప్రేమించాను. 3ఏశావును ద్వేషించాను; నేను అతని కొండలను పాడు చేశాను. అతడు వారసత్వంగా పొందిన ప్రదేశాన్ని అడవి నక్కల పాలు చేశాను” అని యెహోవా అంటున్నారు.
4ఎదోము వారు, “మేము నలుగగొట్టబడ్డాము, అయినాసరే మేము ఆ శిథిలాలనే తిరిగి కట్టుకుంటాము” అని అంటారేమో!
కాని సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: “వారు మళ్ళీ కట్టుకున్నా, నేను కూల్చివేస్తాను. వారిది దుర్మార్గుల దేశమని, ఎప్పటికీ యెహోవా ఉగ్రతకు గురయ్యే ప్రజలని పిలువబడతారు. 5మీరు అది కళ్లారా చూసి, ‘ఇశ్రాయేలు సరిహద్దు అవతల కూడా యెహోవా గొప్పవాడు!’ అని అంటారు.
లోపాలున్న వాటిని బలి అర్పించి ఒడంబడికను ఉల్లంఘించుట
6“కుమారుడు తన తండ్రిని గౌరవిస్తాడు, దాసుడు తన యజమానిని గౌరవిస్తాడు, కానీ ఒకవేళ నేను మీ తండ్రినైతే, మరి నా గౌరవం ఏది? నేను యజమానినైతే, నాకెందుకు భయపడరు?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
“యాజకులైన మీరు నా నామాన్ని అవమానిస్తున్నారు.
“అయినా మీరు, ‘మేము మీ నామాన్ని ఎలా అవమానిస్తున్నాము?’ అని అంటారు.
7“మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన ఆహారం అర్పిస్తూ,
“అయినా మీరు, ‘మేము మిమ్మల్ని ఎలా అపవిత్రపరచాము?’ అని అడుగుతారు.
“యెహోవా బల్లను ప్రాముఖ్యత లేనిదిగా చూడడం వల్లనే. 8మీరు గ్రుడ్డి జంతువులను తెచ్చి బలి అర్పిస్తే తప్పు కాదా? కుంటి దానిని, జబ్బుతో ఉన్న జంతువులను తెచ్చి బలి అర్పిస్తే తప్పు కాదా? అలాంటి వాటిని మీ అధికారికి ఇచ్చి చూడండి! అలాంటివి ఇస్తే స్వీకరిస్తాడా? అతడు నిన్ను అంగీకరిస్తాడా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
9“కానీ ఇప్పుడేమో మాపై దయచూపమని దేవుని వేడుకొంటున్నారు. మీ చేతులతో అలాంటి అర్పణలను ఇస్తే ఆయన స్వీకరిస్తాడా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
10“మీరు నా బలిపీఠం మీద వృధాగా మంటలు వేయకుండా మీలో ఎవరైనా గుడి తలుపులు మూసివేస్తే ఎంత బాగుంటుంది! నేను మీ పట్ల సంతోషంగా లేను. నేను మీ చేతుల నుండి ఏ అర్పణను స్వీకరించను అని సైన్యాల యెహోవా అంటున్నారు. 11తూర్పుదిక్కు నుండి పడమటిదిక్కు వరకు ఇతర దేశాల మధ్య నా నామం ఘనపరచబడుతుంది. ప్రతిచోటా ధూపద్రవ్యాలు, పవిత్రమైన అర్పణలు వారు నాకు తెస్తారు. నా పేరు ఇతర దేశాల్లో గొప్పగా ఉంటుంది” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
12“కానీ మీరు, ‘యెహోవా బల్ల అపవిత్రం అయింది, దాని ఆహారం నీచమైనది’ అంటూ నా నామాన్ని అవమానపరుస్తున్నారు. 13పైగా, ‘ఎంత భారంగా ఉంది!’ అంటూ ఆ బల్లను తిరస్కరిస్తున్నారు” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
“మీరు గాయపడిన దాన్ని కుంటి దాన్ని, జబ్బుపడిన జంతువులను తీసుకువచ్చి బలి అర్పించినప్పుడు నేను మీ చేతుల నుండి వాటిని స్వీకరించాలా?” అని యెహోవా అంటున్నారు. 14“తన మందలో అంగీకారయోగ్యమైన మగ జంతువు ఉండి, దానిని బలి ఇస్తానని మ్రొక్కుబడి చేసి దోషం ఉన్న జంతువును బలి అర్పించే మోసగాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే నేను గొప్ప రాజును, దేశాలకు నేనంటే భయం” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.