ఆదికాండము 12

12
1యెహోవా–నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. 2నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. 3నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా 4యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితోకూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు. 5అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానునువారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపా దించిన సమస్తమైనవారిని తీసికొని కనానను దేశమునకు వెళ్లుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి. 6అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరేదగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. 7యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి– నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. 8అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికినిమధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. 9అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్లెను.
10అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను. 11అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో–ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును. 12ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుక నిచ్చెదరు. 13నీవలన నాకు మేలుకలుగునట్లును నిన్నుబట్టి నేను బ్రదుకు నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. 14అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి 15ఫరోయొక్క అధిపతులు ఆమెను చూచి ఫరోయెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను. 16అతడామెనుబట్టి అబ్రామునకు మేలుచేసెను; అందువలన అతనికి గొఱ్ఱెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను. 17అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను. 18అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి–నీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? 19ఈమె నా సహోదరి అని యేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితే నేమి, ఇదిగో నీ భార్య; ఈమెను తీసికొనిపొమ్మని చెప్పెను. 20మరియు ఫరో అతని విషయమై తన జనుల కాజ్ఞాపించినందునవారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.

Highlight

Kongsi

Salin

None

Ingin menyimpan sorotan merentas semua peranti anda? Mendaftar atau log masuk