ఆదికాండము 13

13
1అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతోకూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులోనుండి నెగెబునకు#13:1 దక్షిణపాలస్తీనునకు నెగెబు అనుపేరు. వెళ్లెను. 2అబ్రాము వెండి బంగారము పశువులుకలిగి బహు ధనవంతుడై యుండెను. 3అతడు ప్రయాణము చేయుచు దక్షిణమునుండి బేతేలువరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమువరకు వెళ్లి 4తాను మొదట బలిపీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. 5అబ్రాముతోకూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక 6వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను. 7అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. 8కాబట్టి అబ్రాము –మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. 9ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లినయెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పగా 10లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను. 11కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణముచేసెను. అట్లువారు ఒకరి కొకరు వేరై పోయిరి. 12అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను. 13సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునైయుండిరి. 14లోతు అబ్రామును విడిచి పోయినతరువాత యెహోవా–ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పుతట్టు పడమరతట్టును చూడుము; 15ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. 16మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణువులవలె విస్తరింప చేసెదను; ఎట్ల నగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమును కూడ లెక్కింపవచ్చును. 17నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను. 18అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రేదగ్గరనున్న సింధూరవృక్షవనములోదిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.

Marker

Del

Kopier

None

Vil du ha høydepunktene lagret på alle enhetene dine? Registrer deg eller logg på