మత్తయి 3

3
బాప్తిస్మమిచ్చు యోహాను మార్గాన్ని సిద్ధపరచుట
1ఆ రోజుల్లో బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, యూదయలోని అరణ్యంలో, 2“పరలోక రాజ్యం సమీపించింది కనుక పశ్చాత్తాపపడండి” అని ప్రకటించాడు. 3దేవుడు యెషయా ప్రవక్త ద్వారా:
“ ‘ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధపరచండి,
ఆయన కొరకు త్రోవలను సరాళం చేయండి,’
అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం,”#3:3 యెషయా 40:3
అని చెప్పింది ఇతని గురించే.
4యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాలను ధరించుకొని, నడుముకు తోలుదట్టీని కట్టుకొని మిడతలు, అడవి తేనె తినేవాడు. 5యెరూషలేము, యూదయ ఇంకా యోర్దాను నది ప్రాంతమంతటి నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్లారు. 6వారు తమ పాపాలను ఒప్పుకొంటూ, యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు.
7అయితే తాను బాప్తిస్మం ఇస్తున్న ప్రాంతానికి పరిసయ్యులు, సద్దూకయ్యులలో చాలామంది రావడం చూసి అతడు వారితో అన్నాడు: “సర్పసంతానమా! రానున్న ఉగ్రత నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? 8పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. 9‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవద్దు, దేవుడు ఈ రాళ్ళ నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగచేయగలడు అని మీతో చెప్తున్నాను. 10ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర ఉంది, మంచి పండ్లను ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది.
11“పశ్చాత్తాపం కొరకు నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడ నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు. 12గోధుమల నుండి పొట్టును వేరు చేయడానికి తన చేతిలో చేటతో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గోధుమలను తన ధాన్యపు కొట్టులో పోసి, తన నూర్చెడి కల్లమును శుభ్రం చేసి, పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తారు.”
యేసు బాప్తిస్మం
13అప్పుడు యేసు యోహాను చేత బాప్తిస్మం పొందడానికి గలిలయ నుండి యోర్దానుకు వచ్చారు. 14కాని యోహాను ఆయనతో, “నేనే నీ ద్వారా బాప్తిస్మం పొందాలి, అలాంటిది నీవు నా దగ్గరకు వస్తున్నావా?” అని అంటూ యేసును ఆపడానికి ప్రయత్నించాడు.
15అందుకు యేసు, “ఇప్పటికి ఇలా కానివ్వు. నీతి అంతటిని నెరవేర్చడానికి ఇలా చేయడం మనకు సరియైనది” అని చెప్పారు కాబట్టి యోహాను ఒప్పుకొన్నాడు.
16యేసు బాప్తిస్మం పొందిన వెంటనే, నీళ్ళ నుండి బయటకు వచ్చారు. ఆ క్షణంలో ఆకాశం తెరువబడి, దేవుని ఆత్మ పావురంలా దిగి వచ్చి ఆయన మీద వాలడం అతడు చూసాడు. 17మరియు పరలోకం నుండి ఒక స్వరం: “ఈయన నా కుమారుడు, నేను ప్రేమించే వాడు; ఈయన యందు నేను ఎంతో ఆనందిస్తున్నాను” అని చెప్పడం వినబడింది.

Marker

Del

Kopier

None

Vil du ha høydepunktene lagret på alle enhetene dine? Registrer deg eller logg på