ఆదికాండము 4

4
1ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని–యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను. 2తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు. 3కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. 4హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను; 5కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తనముఖము చిన్నబుచ్చుకొనగా 6యెహోవా కయీనుతో–నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? 7నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను. 8కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలుమీదపడి అతనిని చంపెను. 9యెహోవా–నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు –నే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. 10అప్పుడాయన–నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తముయొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది. 11కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు; 12నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. 13అందుకు కయీను –నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. 14నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడోవాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. 15అందుకు యెహోవా అతనితో–కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతి దండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను.
16అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను. 17కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను. 18హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషా యేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను. 19లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను; వారిలో ఒక దాని పేరు ఆదా రెండవదానిపేరు సిల్లా. 20ఆదా యా బాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు. 21అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను#4:21 పిల్లన గ్రోవిని. వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు. 22మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుపపనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.
23లెమెకు తన భార్యలతో
–ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి
లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి
నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని
నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని
24ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చిన యెడల
లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను.
25ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని–కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెనను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను. 26మరియు షేతునకు కూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj