ఆది 1

1
ఆరంభం
1ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు. 2భూమి ఆకారం లేనిదిగా శూన్యంగా ఉంది; అగాధజలాల మీద చీకటి ఆవరించి ఉంది, దేవుని ఆత్మ నీళ్ల మీద అల్లాడుతూ ఉన్నాడు.
3అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది. 4దేవుడు ఆ వెలుగు బాగుందని చూసి, వెలుగును చీకటిని వేరుచేశారు. 5దేవుడు వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది మొదటి రోజు.
6దేవుడు, “ఆకాశ జలాలను భూ జలాలను వేరు చేయడానికి జలాల మధ్య విశాలం కలుగును గాక” అన్నారు. 7అలాగే జరిగింది. దేవుడు విశాలాన్ని చేసి ఆ విశాలం క్రింది జలాలను విశాలం మీది జలాలను వేరుచేశారు. 8దేవుడు ఆ విశాలానికి “ఆకాశం” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది రెండవ రోజు.
9దేవుడు, “ఆకాశం క్రింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడును గాక” అని అనగా అలాగే జరిగింది. 10దేవుడు ఆరిన నేలకు “భూమి” అని, ఒకే చోట సమకూడిన జలాలకు “సముద్రం” అని పేరు పెట్టారు. అది మంచిదని దేవుడు చూశారు.
11అప్పుడు దేవుడు, “భూమి వృక్ష సంపదను అనగా విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లను భూమి మొలిపించును గాక” అని అన్నారు. అలాగే జరిగింది. 12భూమి వృక్ష సంపదను ఉత్పత్తి చేసింది అంటే, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలు గల మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లు మొలిపించింది. అది మంచిదని దేవుడు చూశారు. 13సాయంకాలం గడిచి ఉదయం రాగా అది మూడవ రోజు.
14దేవుడు, “పగలు రాత్రులను వేరు చేయడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుండాలి, అవి రుతువులను రోజులను సంవత్సరాలను సూచించే అసాధారణ గుర్తులుగా ఉండాలి. 15ఆకాశ విశాలంలో భూమికి వెలుగునిచ్చే జ్యోతులుండును గాక” అని అన్నారు, అలాగే జరిగింది. 16దేవుడు పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని అలా రెండు గొప్ప జ్యోతులను అలాగే నక్షత్రాలను కూడా చేశారు. 17-18భూమికి వెలుగునివ్వడానికి, పగటిని రాత్రిని పాలించడానికి, చీకటిని వెలుగును వేరు చేయడానికి, దేవుడు వాటిని ఆకాశ విశాలంలో అమర్చారు. అది మంచిదని దేవుడు చూశారు. 19సాయంకాలం గడిచి ఉదయం రాగా అది నాలుగవ రోజు.
20దేవుడు, “నీటిలో జలజీవులు విస్తరించాలి, భూమిపై నుండి పక్షులు ఆకాశ విశాలంలో ఎగురును గాక” అని అన్నారు. 21కాబట్టి దేవుడు సముద్రపు గొప్ప జీవులను, వాటి వాటి జాతుల ప్రకారం నీటిలో ఉండి నీటిలో తిరిగే ప్రతి జీవిని, వాటి వాటి జాతి ప్రకారం రెక్కలు గల పక్షులను సృష్టించారు. అది మంచిదని దేవుడు చూశారు. 22దేవుడు, “ఫలించి, వృద్ధి చెంది, సముద్ర జలాల్లో నిండిపోవాలి, అలాగే భూమి మీద పక్షులు విస్తరించును గాక” అని వాటిని ఆశీర్వదించారు. 23అలా సాయంకాలం గడిచి ఉదయం రాగా అది అయిదవ రోజు.
24దేవుడు, “భూమి వాటి వాటి జాతి ప్రకారం జీవులను పుట్టించాలి అంటే, పశువులను, నేల మీద ప్రాకే జీవులను, అడవి మృగాలను, వాటి వాటి జాతుల ప్రకారం పుట్టించును గాక” అని అన్నారు, అలాగే జరిగింది. 25దేవుడు వాటి వాటి జాతుల ప్రకారం అడవి మృగాలను, వాటి వాటి జాతుల ప్రకారం పశువులను, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద ప్రాకే జీవులను చేశారు. అది మంచిదని దేవుడు చూశారు.
26అప్పుడు దేవుడు, “మనం మన స్వరూపంలో, మన పోలికలో నరులను చేద్దాము. వారు సముద్రంలోని చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను, పశువులను, అడవి మృగాలను భూమిపై ప్రాకే జీవులన్నిటిని ఏలుతారు” అని అన్నారు.
27కాబట్టి దేవుడు తన స్వరూపంలో నరులను సృజించారు,
దేవుని స్వరూపంలో వారిని సృజించారు;
వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు.
28దేవుడు వారితో, “మీరు ఫలించి, వృద్ధి చెంది, భూలోకమంతా విస్తరించి, దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, నేలపై ప్రాకే ప్రతి జీవిని ఏలండి” అని చెప్పి ఆశీర్వదించారు.
29అప్పుడు దేవుడు, “భూమిపై విత్తనాలు ఇచ్చే ప్రతి మొక్కను, విత్తనాలు గల ఫలమిచ్చే ప్రతి చెట్టును మీకు ఆహారంగా ఇస్తున్నాను. 30భూమిపై ఉన్న మృగాలన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, నేలపై ప్రాకే జీవులన్నిటికి, జీవం ఉన్న ప్రతీ దానికి ప్రతి పచ్చని మొక్కను ఆహారంగా ఇస్తున్నాను” అని అన్నారు. అలాగే జరిగింది.
31దేవుడు తాను చేసిందంతా చూశారు. అది చాలా బాగుంది. సాయంకాలం గడిచి ఉదయం రాగా అది ఆరవరోజు.

Obecnie wybrane:

ఆది 1: TSA

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj

Bezpłatne plany czytania i rozważania na temat: ఆది 1

YouVersion używa plików cookie, aby spersonalizować twoje doświadczenia. Korzystając z naszej strony, wyrażasz zgodę na używanie przez nas plików cookie zgodnie z naszą Polityką prywatności