లూకా సువార్త 12

12
హెచ్చరికలు ప్రోత్సాహాలు
1అంతలో, వేలాదిమంది ప్రజలు ఒకరినొకరు త్రొక్కిసలాడుకొనేంతగా గుమికూడారు. అప్పుడు యేసు మొదట తన శిష్యులతో మాట్లాడడం ప్రారంభించారు: “వేషధారణ అనే పరిసయ్యుల పులిసిన పిండి మీలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి. 2దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు. 3మీరు చీకట్లో మాట్లాడినవి పగటి వెలుగులో వినబడతాయి. మీరు లోపలి గదుల్లో చెవిలో చెప్పిన మాటలు పైకప్పుల నుండి ప్రకటించబడతాయి.
4“నా స్నేహితులారా, నేను మీతో చెప్పేదేమంటే, మీ శరీరాన్ని చంపి, ఆ తర్వాత ఏమి చేయలేనివారికి భయపడకండి. 5మీరు ఎవరికి భయపడాలో నేను చెప్తాను: మీ దేహం చంపబడిన తర్వాత, మిమ్మల్ని నరకంలో పడద్రోసే శక్తిగల వానికి భయపడండి. అవును, ఆయనకే భయపడండి. 6అయిదు పిచ్చుకలు రెండు కాసులకే అమ్మబడడం లేదా? అయినా వాటిలో ఒకదాన్ని కూడా దేవుడు మరచిపోరు. 7నిజానికి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. భయపడకండి; మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు.
8“ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, మనుష్యకుమారుడు కూడా దేవదూతల ముందు వారిని ఒప్పుకుంటారు. 9కాని ఇతరుల ముందు ఎవరు నన్ను నిరాకరిస్తారో దేవదూతల ముందు వారు నిరాకరించబడతారు. 10మనుష్యకుమారునికి విరోధంగా మాట్లాడే వారికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవారెవ్వరు క్షమించబడరు.
11“మిమ్మల్ని సమాజమందిరాలు, పరిపాలకులు అధికారుల ముందుకు ఈడ్చుకొని వెళ్లినప్పుడు, మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అని ఏమి చెప్పాలో అని మీరు చింతపడవద్దు. 12ఎందుకంటే మీరు ఏమి చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు.”
బుద్ధిలేని ఒక ధనవంతుని గురించిన ఉపమానం
13ఆ జనసమూహంలో నుండి ఒకడు ఆయనతో, “బోధకుడా, వారసునిగా నేను పొందాల్సిన ఆస్తి భాగాన్ని పంచమని నా సహోదరునితో చెప్పండి” అన్నాడు.
14అందుకు యేసు, “అయ్యా, నన్ను మీకు న్యాయాధిపతిగా గాని మధ్యవర్తిగా గాని నన్నెవరు నియమించారు?” అని జవాబిచ్చారు. 15ఆ తర్వాత ఆయన వారితో, “మెలకువగా ఉండండి! మీరు అన్ని రకాల అత్యాశలకు విరుద్ధంగా ఉండేలా జాగ్రత్తపడండి; జీవితం అంటే సమృద్ధిగా ఆస్తులు కలిగి ఉండడం కాదు” అని చెప్పారు.
16ఇంకా ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఒక ధనవంతుని పొలం సమృద్ధిగా పంట పండింది. 17అప్పుడు అతడు తనలో తాను అనుకున్నాడు, ‘నేను ఏమి చేయాలి? ఈ పంటంతటిని నిల్వ చేసుకోవడానికి నాకు స్ధలం చాలదు.’
18“అప్పుడతడు, ‘నేను ఇలా చేస్తాను. ఇప్పుడున్న కొట్లను పడగొట్టి, పెద్ద కొట్లను కట్టించి వాటిలో నా ధాన్యాన్ని సమకూర్చుకుంటాను. 19నా ఆత్మతో నేను ఇలా అనుకుంటాను, “అనేక సంవత్సరాలకు సరిపడినంత విస్తారమైన ధాన్యం నీకోసం సమకూర్చి ఉంచాను. జీవితాన్ని తేలికగా తీసుకో; తిను, త్రాగు, సంతోషంగా ఉండు” ’ అని అనుకున్నాడు.
20“కాని దేవుడు అతనితో, ‘ఓయీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతే, నీకోసం నీవు సిద్ధపరచుకొన్నది ఎవరిదవుతుంది?’
21“దేవునిలో ధనవంతుడు కాకుండా తమ కోసం సమకూర్చుకొనేవారి స్థితి ఇలా ఉంటుంది” అని చెప్పారు.
చింతించవద్దు
22తర్వాత యేసు తన శిష్యులతో, “కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి అని, మీ ప్రాణం గురించి గాని, లేదా ఏమి ధరించాలి అని మీ దేహం గురించి గాని చింతించకండి. 23ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. 24కాకులను చూడండి: అవి విత్తవు కోయవు, వాటికి నిల్వ చేసుకోడానికి గది కాని కొట్లు కాని లేవు; అయినా దేవుడు వాటిని పోషిస్తున్నారు. పక్షుల కన్నా మీరు ఇంకా ఎంతో విలువైన వారు. 25మీలో ఎవరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట#12:25 ఒక గంట లేదా మీ ఎత్తులో ఒక అడుగు పొడిగించుకోగలరా? 26మీరు ఇంత చిన్నదాన్ని చేయలేనప్పుడు, మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తారు?
27“అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు నేయవు. అయినా గొప్ప వైభవం కలిగి ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. 28అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో పడవేయబడే, పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా అలంకరిస్తారు! 29ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి. 30దేవుని ఎరుగనివారు అలాంటి వాటి వెంటపడతారు కాని, అవన్నీ మీకు అవసరమని మీ తండ్రికి తెలుసు. 31కాబట్టి ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి.
32“చిన్న మందా, భయపడవద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి తన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. 33మీ ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వండి. మీ కోసం పాతగిల్లని డబ్బు సంచులను ఏర్పరచుకోండి, పరలోకంలో ధనం ఎప్పటికీ తరిగిపోదు, అక్కడ ఏ దొంగ సమీపించలేడు, ఏ చిమ్మెట కొట్టివేయలేదు. 34ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో, అక్కడే మీ హృదయం ఉంటుంది.
మెలకువ
35“సేవ కోసం మీ నడుము కట్టుకోండి, మీ దీపాలను వెలుగుతూ ఉండనివ్వండి, 36తమ యజమాని పెండ్లి విందునుండి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురుచూస్తూ, అతడు వచ్చి తలుపు తట్టినప్పుడు వెంటనే తలుపు తీయడానికి మెలకువతో సిద్ధంగా ఉన్న సేవకుల్లా ఉండండి. 37యజమాని వచ్చినప్పుడు ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ సేవకులకు మేలు. నేను చెప్పేది నిజం, సేవ చేయడానికి అతడు తన నడుము కట్టుకుని, ఆ సేవకులను భోజనానికి కూర్చోబెట్టి, అతడు అక్కడే వేచి ఉంటాడు. 38తమ యజమాని మధ్యరాత్రి వచ్చినా లేదా తెల్లవారుజామున వచ్చినా, సిద్ధపడి కనిపించడం ఆ సేవకులకు మేలు. 39అయితే ఈ విషయం అర్థం చేసుకోండి: దొంగ ఏ సమయంలో వస్తాడో ఒకవేళ ఇంటి యజమానికి తెలిస్తే, అతడు తన ఇంటికి కన్నం వేయకుండా జాగ్రత్తపడతాడు. 40అలాగే మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి” అని చెప్పారు.
41అప్పుడు పేతురు, “ప్రభువా, ఈ ఉపమానం మాకేనా లేదా అందరికి చెప్తున్నావా?” అని అడిగాడు.
42అందుకు ప్రభువు, “యజమాని తన ఇంటి సేవకులకు సమయానికి వారి భోజన వేతనం ఇచ్చే బాధ్యతను అప్పగించడానికి, నమ్మకమైన, జ్ఞానం కలిగిన నిర్వాహకుడు ఎవడు? 43యజమాని తిరిగి వచ్చినప్పుడు అలా చేస్తూ కనిపించడం ఆ సేవకునికి మేలు. 44ఆ యజమాని తన యావదాస్తి మీద అతన్ని అధికారిగా ఉంచుతాడని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. 45కాని ఒకవేళ ఆ సేవకుడు, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడని’ తన మనస్సులో అనుకుని, తన తోటి సేవకులను, పురుషులు స్త్రీలను కూడా కొట్టడం మొదలుపెట్టి, తింటూ త్రాగుతూ మత్తులో ఉండి! 46అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో యజమాని వస్తాడు, అతడు వాన్ని ముక్కలుగా నరికి అవిశ్వాసులతో అతనికి చోటు ఇస్తాడు.
47“ఏ సేవకుడైతే తన యజమానుని చిత్తాన్ని ఎరిగి కూడా దాని ప్రకారం సిద్ధపడి తన యజమాని కోరుకున్నట్లుగా చేయడో వాడు అనేక దెబ్బలు తింటాడు. 48అయితే తెలియక శిక్షకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే పడతాయి. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడిందో వాని నుండి ఎక్కువ తీసుకుంటారు; ఎవనికి ఎక్కువ అప్పగించబడిందో, వాని నుండి ఎక్కువ అడుగుతారు.”
సమాధానం కాదు విభజన
49నేను భూమి మీద అగ్ని వేయడానికే వచ్చాను, ఇప్పటికే అది రగులుకొని మండుతూ ఉండాలని ఎంతో కోరుతున్నాను. 50అయితే నేను ఒక బాప్తిస్మం పొందాల్సి ఉంది, అది నెరవేరే వరకు ఎంత నిర్బంధంలో ఉన్నానో! 51నేను భూమి మీదికి సమాధానం తేవడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కాదు, కాని విడగొట్టడానికి తేవడానికి. 52ఇప్పటినుండి అయిదుగురు ఉన్న ఒక కుటుంబంలో ఒకరికి ఒకరు వ్యతిరేకంగా విభజింపబడతారు, ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు, ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు. 53ఎలాగంటే, కుమారుని మీదికి తండ్రి, తండ్రి మీదికి కుమారుడు, కుమార్తెకు మీదికి తల్లి, తల్లి మీదికి కుమార్తె, కోడలు మీదికి అత్త, అత్త మీదికి కోడలు, ఇలా వారు విడిపోతారు.
కాలాలను అనువదించుట
54ఆయన జనసమూహంతో ఇలా అన్నారు: “పడమర వైపు నుండి మబ్బులు రావడం చూసినప్పుడు మీరు వెంటనే, ‘వాన కురవబోతుంది’ అని అంటారు, అలాగే వాన కురుస్తుంది. 55అలాగే దక్షిణపు గాలి వీచినప్పుడు, ‘వేడిగా ఉండబోతుంది’ అని అంటారు, అది అలాగే ఉంటుంది. 56వేషధారులారా! భూమి, ఆకాశం యొక్క వాతావరణ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు. అలాంటప్పుడు ప్రస్తుత కాలాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలియకపోవడమేంటి?
57“ఏది సరియైనదో మీ అంతట మీరే ఎందుకు విమర్శించుకోలేరు? 58నీవు నీ విరోధితో న్యాయాధిపతి దగ్గరకు వెళ్తున్నప్పుడు, దారిలో ఉన్నప్పుడే వానితో సమాధానపడే ప్రయత్నం చేయి, లేకపోతే నీ విరోధి నిన్ను న్యాయాధిపతి దగ్గరకు ఈడ్చుకెళ్లవచ్చు, న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాలలో వేయించవచ్చు. 59చివరి పైసా చెల్లించే వరకు నీవు బయట పడలేవు” అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.

Podkreślenie

Udostępnij

Kopiuj

None

Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj